Botas
-
విజేత వెర్స్టాపెన్
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) 2020–సీజన్ ముగింపు రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. యాస్ మరీనా సర్క్యూట్లో ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రిలో నిర్ణీత 55 ల్యాప్‌లను వెర్స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 28.645 సెకన్లలో ముగించి ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన 23 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఏదశలోనూ ఇతర డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్ రెండో స్థానంలో... హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. గతవారం సాఖిర్ గ్రాండ్‌ప్రి విజేత సెర్గియో పెరెజ్ (రేసింగ్ పాయింట్–ఆర్పీ) ఎనిమిదో ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. కరోనా కారణంగా ఈ సీజన్లో 22 రేసులకు బదులుగా 17 రేసులను మాత్రమే నిర్వహించారు. 11 రేసుల్లో గెలుపొందిన హామిల్టన్ (మెర్సిడెస్) 347 పాయింట్లతో ఓవరాల్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏడోసారి సొంతం చేసుకొని దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) రికార్డును సమం చేశాడు. బొటాస్, వెర్స్టాపెన్ రెండేసి రేసుల్లో నెగ్గగా... పెరెజ్, పియరీగ్యాస్లీ ఒక్కో రేసులో గెలిచారు. 573 పాయింట్లతో టీమ్ కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ కూడా మెర్సిడెస్ జట్టుకే లభించింది. -
భళా...బొటాస్
బాకు (అజర్బైజాన్): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ బొటాస్ ఈ సీజన్లో రెండో టైటిల్ ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో బొటాస్ విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన బొటాస్ గంటా 31 నిమిషాల 52.942 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. దాంతో ఈ ఏడాది జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే వచ్చాయి. ఫార్ములావన్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. 1992లో విలియమ్స్ జట్టు సీజన్‌లోని తొలి మూడు రేసుల్లో ఈ ఘనత సాధించింది. ఆదివారం జరిగిన రేసుతో మెర్సిడెస్ ఈ రికార్డును సవరించింది. -
బొటాస్‌కు ‘పోల్’
బాకు (అజర్బైజాన్): ఈ సీజన్లో మంచి ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ వరుసగా రెండో రేసులోనూ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 40.495 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన బొటాస్ గత చైనా గ్రాండ్‌ప్రి రేసులోనూ పోల్ పొజిషన్ సంపాదించాడు. అజర్బైజాన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానం నుంచి... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. బహ్రెయిన్, చైనా గ్రాండ్‌ప్రి రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ నేటి రేసులోనూ గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. -
హామిల్టన్ హవా
సోచి: సహచరుడు బొటాస్ సహకారం ఇవ్వడంతో ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 53 ల్యాప్‌లను హామిల్టన్ గంటా 27 నిమిషాల 32.054 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన బొటాస్ రెండో స్థానాన్ని పొందాడు. 25వ ల్యాప్ వరకు వెటెల్ (ఫెరారీ) తొలి స్థానంలో, బొటాస్ రెండో స్థానంలో, హామిల్టన్ మూడో స్థానంలో ఉన్నారు. ఈ దశలో హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇవ్వాలని మెర్సిడెస్ జట్టు టీమ్ రేడియాలో బొటాస్‌ను ఆదేశించింది. జట్టు ఆదేశాలను పాటించిన బొటాస్ వేగం తగ్గించి హామిల్టన్‌కు ఓవర్టేక్ చేసే అవకాశం ఇచ్చాడు. దాంతో రెండో స్థానానికి చేరిన హామిల్టన్ అదే జోరులో ఆధిక్యంలో ఉన్న వెటెల్‌ను కూడా వెనక్కి నెట్టి ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని కెరీర్లో 70వ విజయాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచారు. 21 రేసుల ఈ సీజన్లో 16 రేసులు పూర్తయ్యాక హామిల్టన్ 306 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 256 పాయింట్లతో వెటెల్ రెండో స్థానంలో... 189 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 7న జరుగుతుంది. -
బొటాస్‌కు పోల్ పొజిషన్
స్పీల్బెర్గ్ (ఆస్ట్రియా): ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ బొటాస్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. బొటాస్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 04.251 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మరోవైపు ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి... భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడు, ఒకాన్ తొమ్మిదో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు.