భారత్‌కు రెండు స్వర్ణాలు
అపియా (సమోవా) : అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత కుర్రాళ్లు జోరు కొనసాగిస్తున్నారు. గురువారం రెండు స్వర్ణాలతో పాటు ఏడు పతకాలను దక్కించుకున్నారు. ఆర్చర్ ప్రాచీ సింగ్ బాలికల రికర్వ్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో బంగ్లాదేశ్ ఆర్చర్‌పై నెగ్గి స్వర్ణం ఖాయం చేసుకుంది. మరోవైపు టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో శశికుమార్ ముకుంద్, ధ్రుతి వేణుగోపాల్ 7-6 (7/4), 6-3 తేడాతో మెకెలాండ్, లమ్స్‌డెన్ (స్కాట్లాండ్)ను ఓడించి స్వర్ణం దక్కించుకున్నారు.
ఇక బాక్సర్ గౌరవ్ సోలంకి (52 కేజీలు) రజతంతో సంతృప్తి పడ్డాడు. అలాగే ఆర్చర్ నిశాంత్ (బాలుర రికర్వ్ వ్యక్తిగత), స్క్వాష్ మిక్స్డ్ టీమ్‌లో సెం థిల్ కుమార్, హర్షిత్ జవందాలకు కూడా రజతాలు లభించాయి. బాక్సర్లు లీచోం బన్ భీమ్‌చంద్ సింగ్ (49 కేజీలు), ప్రయాగ్ (64 కేజీలు) కాంస్యాలు దక్కించుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటిదాకా భారత్ 17 పతకాలతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.