bpo industry
-
సగం మంది ఆఫీసుకు వస్తే చాలు!
సాక్షి, అమరావతి: వర్క్ ఫ్రం హోమ్.. దేశంలోని ఐటీ రంగం జపిస్తున్న మంత్రమిది. ఈ పరిణామం కీలక మార్పులకు నాంది పలుకుతూ.. ఐటీ రంగాన్ని పరోక్షంగా చిన్న పట్టణాలు, పల్లెలకు చేరువ చేస్తోంది. ఇది ఏపీకి సానుకూల అంశమని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని దాదాపు అన్ని ఐటీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్ (డబ్ల్యూఎఫ్‌హెచ్) విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉద్యోగులకు ఈ వెసులుబాటు ఈ నెల 31తో ముగియాల్సి ఉంది. కానీ దేశంలో ఇంకా కరోనా ముప్పు తొలగకపోవడం.. సెకండ్ వేవ్ వస్తుందనే అంచనాలతో ఐటీ కంపెనీలు రిస్క్ తీసుకునేందుకు సాహసించడం లేదు. అందుకే తమ ఉద్యోగులకు డబ్ల్యూఎఫ్‌హెచ్‌ను 2021మార్చి 31 వరకు పొడిగించాలని నిర్ణయించాయి. 98 శాతం మంది ఇంటినుంచే పని దేశంలో దాదాపు 45 లక్షల మంది ఐటీ, బీపీవో ఉద్యోగులు ఉన్నారు. వారిలో 98 శాతం మంది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి డబ్ల్యూఎఫ్‌హెచ్ విధానంలోనే పని చేస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రోలలో దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో దాదాపు 8.75 లక్షల మంది తమ ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. టీసీఎస్ మరో అడుగు ముందుకేసి 2025 వరకు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కరోనా ప్రభావం తొలగిపోయినా సరే 2025 వరకు కేవలం 25 శాతం మందే కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని.. 75 శాతం మంది డబ్ల్యూఎఫ్‌హెచ్ విధానంలోనే పని చేయాలన్నది ఆ కంపెనీ ఉద్దేశం. ఇన్ఫోసిస్ కూడా భవిష్యత్‌లో తమ ఉద్యోగులలో సగం మంది ఆఫీసుకు వస్తే చాలని భావిస్తోంది. దేశంలో ప్రముఖ కంపెనీలు నగరాల్లోని తమ కార్యాలయాల అద్దెలు, ఇతర నిర్వహణ భారాన్ని తగ్గించుకుంటున్నాయి. గత ఆరు నెలల్లో ఐటీ కంపెనీలు సగటున 40 శాతం వరకు కార్యాలయ భవనాలను ఖాళీ చేయడం గమనార్హం. కరోనా ప్రభావంతో కార్మిక చట్టం నిబంధనలను సడలించాలన్న ఐటీ, బీపీవో కంపెనీల వినతిపై కేంద్రం సానుకూలంగా స్పందిచడం కూడా కలిసొచ్చింది. ‘వర్క్ ఫ్రం హోమ్, వర్క్ ఫ్రం ఎనీవేర్’ అనే అంశాలకు స్థానం కల్పిస్తూ ఐటీ, ఇతర సర్వీస్ ప్రొవైడర్ల సేవల నిబంధనలను కేంద్రం ఇటీవల సడలించింది. (శాశ్వత వర్క్ ఫ్రం హోం అవకాశం: మైక్రోసాఫ్ట్) పల్లెలు చిన్న పట్టణాలకు సదవకాశం వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించాలని ఐటీ, ఇతర కంపెనీలు భావిస్తుండటం పల్లెలు, చిన్న పట్టణాలకు కలిసొస్తుంది. ప్రధానంగా మన రాష్ట్రానికి ఇది సానుకూల అంశం. ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారే. వారు రాష్ట్రం నుంచే పని చేనున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని పల్లెలు, చిన్న పట్టణాలు కూడా ఐటీ, ఇతర సేవా కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయి. – ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, వీసీ, ఆంధ్రా యూనివర్సిటీ -
యూఎస్‌లో భారత్ బీపీఓల కుంభకోణం...
అమెరికాలో చోటు చేసుకున్న లక్షలాది డాలర్ల కుంభకోణంలో ఐదు ఇండియన్ బీపీఓ కంపెనీలు, ఏడుగురు భారతీయుల ప్రమేయం ఉందని అక్కడి జస్టిస్ డిపార్ట్మెంట్ తేల్చింది. రెండువేల మందికి పైగా అమెరికా పౌరులను మోసగించిన ఈ కేసులో బాధితులకు దాదాపు 60 లక్షల డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు వెల్లడైంది. ఓ ఆధునాతన పథకం ద్వారా అమెరికన్లను మోసగించినట్టు, అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్ల నెట్‌వర్క్‌తో పాటు భారత్‌లోని సహకుట్రదారులు ఈ పథకాన్ని రచించినట్టు ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో మొత్తం 15 భాగస్వాములు (ఏడుగురు ఇండియన్లతో సహా), భారత్‌లోని ఐదు కాలుసెంటర్లు పాలుపంచుకున్నట్టు స్పష్టమైంది. అక్కడి అధికారులు ఏడుగురు భారతీయులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదీ ఆపరేషన్... 2012–16 మధ్యకాలంలో జరిగిన ఈ కుంభకోణాన్ని అమెరికా పరిశోధనా బందం చేధించింది. సంక్షిష్టమైన ఆర్థిక లావాదేవీల్లోని చిక్కుముళ్లను జాగ్రత్తగా విప్పి, చట్టవ్యతిరేకంగా అక్కడి పౌరుల నుంచి డబ్బును బలవంతంగా వసూలు చేసిన ఖండాంతరకుట్రను భగ్నం చేసింది. అమెరికాలోని డేటా బ్రోకర్లు, ఇతర వనరుల ద్వారా సేకరించిన సమాచారంతో ఆయా లొసుగులను బట్టి ఆర్థికపరమైన అంశాలు, దేశపౌరసత్వం, వలస వంటి అంశాల్లో మోసగించేందుకు అవకాశమున్న పౌరులు, వయసుపైబడిన వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత మోసపూరిత పద్ధతుల్లో భారత్‌లోని కొన్ని కాల్‌సెంటర్ల ద్వారా వారికి ఫోన్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసు (ఐఆర్ఎస్) లేదా అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ ( యూఎస్సీఐఎస్) నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు. పలానా ఆర్థికలావాదేవీలో లేదా పౌరసత్వం, వలసలకు సంబంధించిన అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ బెదిరిస్తారు. ఈ విషయంలో ప్రభుత్వానికి పెనాల్జీలు,టాక్స్‌లు కట్టకపోతే అరెస్ట్‌లు, జైలుశిక్షకు లేదా పెద్దమొత్తంలో ఫైన్‌కు గురికావాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తారు. డబ్బు చెల్లించేందుకు అంగీకరించిన వారి నుంచి పైకాన్ని తీసుకునేందుకు అమెరికాలోని సహకుట్రదారుల నెట్వర్క్ ప్రమేయం మొదలవుతుంది. ఈ విధంగా వచ్చిన డబ్బును ప్రీపెయిడ్ డెబిట్‌కార్డులు లేదా మనీగ్రామ్, వెస్ట్రన్‌యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ తదితర రూపాల్లో వసూలు చేశారు. దీనికి మనీలాండరింగ్ పద్ధతిని కూడా ఉపయోగించారు. కొన్ని సందర్భాల్లో ‘పే డే లోన్ ఫోన్స్ స్కీమ్స్’ రూపంలో కూడా బాధితులను మోసగించారు. ఈ స్కీమ్స్‌ల ద్వారా ఆర్థికంగా ఎలా లాభపడవచ్చో వివరించి అమెరికన్లు ఉచ్చులో పడేలా చేశారని యూఎస్ అటార్నీ యుంగ్ జె పాక్ తెలిపారు. ఇలాంటి ఫోన్ కుంభకోణాల వెనకున్న వారిని కనిపెట్టడంలో తమ బంద సభ్యులు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఐఆర్ఎస్ పేరిట అమెరికన్లను వంచించిన కేసులో ఐదు బీపీఓ కంపెనీలు, ఏడుగురు భారతీయులు తమ ఉద్యోగుల ద్వారా కుంభకోణానికి పాల్పడినట్టు విచారణలో తేలిందని ట్రెజరీ ఇన్స్పెక్టర్ జనరల్ ఫర్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ జె రసెల్ జార్జి వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న బీపీఓలు ఇవే... అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ జాబితాలో బీపీఓలు ఇవే... ఎక్స్లెంట్ సొల్యూషన్స్ బీపీఓ, ఏడీఎన్ ఇన్ఫోటెక్ ప్రై వేట్ లిమిటెడ్, ఇన్ఫో ఏస్ బీపీఓ సొల్యూషన్స్ ప్రై వేట్ లిమిటెడ్, అడోర్ ఇన్ఫోసోర్స్ ఇన్కార్పొరేషన్, జ్యురిక్ బీపీఓ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ . -
దేశం నుంచి బీపీఓ పరిశ్రమ ఔట్!
కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డీజిల్ క్యాబ్‌లపై నిషేధం విధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇలా నిషేధం విధిస్తే బీపీఓ పరిశ్రమ మొత్తం దేశం నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపింది. బీపీఓ ఉద్యోగులంతా దాదాపు కంపెనీలు ఏర్పాటుచేసే క్యాబ్‌లలోనే ఆఫీసులకు, ఇళ్లకు వెళ్తారు. వాటిలో చాలావరకు డీజిల్ వాహనాలే. ఈ పరిశ్రమ నుంచి ప్రతియేటా దేశానికి దాదాపు వంద కోట్ల డాలర్లకు పైగా ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు ఈ నిషేధం నిర్ణయం వల్ల మన దేశం నుంచి బీపీఓ పరిశ్రమ వేరే దేశానికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనానికి సాలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తెలిపారు. ఐదేళ్లలో దశల వారీగా మొత్తం డీజిల్ క్యాబ్‌లు అన్నింటినీ ఢిల్లీ రోడ్ల నుంచి తీసేయిస్తామని, అంతవరకు గడువు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం కూడా కోర్టును కోరింది. ఢిల్లీ రోడ్లపై డీజిల్ క్యాబ్‌లు నడవడానికి వీల్లేదంటూ తాము పెట్టిన మే 1వ తేదీ గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు ఏప్రిల్ 30న నిరాకరించింది. అయితే బీపీఓ ఉద్యోగుల భద్రత అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, ఈ పరిశ్రమ మనుగడను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర చెప్పింది. తమ ఉద్యోగులకు అసౌకర్యంగా ఉంటే బీపీఓ పరిశ్రమ దేశం నుంచి వెళ్లిపోవచ్చని, అది దేశ ఆర్థిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతుందని సాలిసిటర్ జనరల్ అన్నారు. అయితే, బీపీఓ కంపెనీలు బస్సులను అద్దెకు తీసుకుని తమ ఉద్యోగులకు పికప్, డ్రాప్ అందించొచ్చు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది.