అమెరికాలో చోటు చేసుకున్న లక్షలాది డాలర్ల కుంభకోణంలో ఐదు ఇండియన్ బీపీఓ కంపెనీలు, ఏడుగురు భారతీయుల ప్రమేయం ఉందని అక్కడి జస్టిస్ డిపార్ట్‌మెంట్ తేల్చింది. రెండువేల మందికి పైగా అమెరికా పౌరులను మోసగించిన ఈ కేసులో బాధితులకు దాదాపు 60 లక్షల డాలర్ల మేర నష్టం వాటిల్లినట్టు వెల్లడైంది. ఓ ఆధునాతన పథకం ద్వారా అమెరికన్లను మోసగించినట్టు, అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్ల నెట్‌వర్క్‌తో పాటు భారత్‌లోని సహకుట్రదారులు ఈ పథకాన్ని రచించినట్టు ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో మొత్తం 15 భాగస్వాములు (ఏడుగురు ఇండియన్లతో సహా), భారత్‌లోని ఐదు కాలుసెంటర్లు పాలుపంచుకున్నట్టు స్పష్టమైంది. అక్కడి అధికారులు ఏడుగురు భారతీయులను ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ఇదీ ఆపరేషన్...
2012–16 మధ్యకాలంలో జరిగిన ఈ కుంభకోణాన్ని అమెరికా పరిశోధనా బందం చేధించింది. సంక్షిష్టమైన ఆర్థిక లావాదేవీల్లోని చిక్కుముళ్లను జాగ్రత్తగా విప్పి, చట్టవ్యతిరేకంగా అక్కడి పౌరుల నుంచి డబ్బును బలవంతంగా వసూలు చేసిన ఖండాంతరకుట్రను భగ్నం చేసింది. అమెరికాలోని డేటా బ్రోకర్లు, ఇతర వనరుల ద్వారా సేకరించిన సమాచారంతో ఆయా లొసుగులను బట్టి ఆర్థికపరమైన అంశాలు, దేశపౌరసత్వం, వలస వంటి అంశాల్లో మోసగించేందుకు అవకాశమున్న పౌరులు, వయసుపైబడిన వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత మోసపూరిత పద్ధతుల్లో భారత్‌లోని కొన్ని కాల్‌సెంటర్ల ద్వారా వారికి ఫోన్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసు (ఐఆర్‌ఎస్) లేదా అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ ( యూఎస్‌సీఐఎస్) నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు. పలానా ఆర్థికలావాదేవీలో లేదా పౌరసత్వం, వలసలకు సంబంధించిన అంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ బెదిరిస్తారు. ఈ విషయంలో ప్రభుత్వానికి పెనాల్జీలు,టాక్స్‌లు కట్టకపోతే అరెస్ట్‌లు, జైలుశిక్షకు లేదా పెద్దమొత్తంలో ఫైన్‌కు గురికావాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తారు.
డబ్బు చెల్లించేందుకు అంగీకరించిన వారి నుంచి పైకాన్ని తీసుకునేందుకు అమెరికాలోని సహకుట్రదారుల నెట్‌వర్క్ ప్రమేయం మొదలవుతుంది. ఈ విధంగా వచ్చిన డబ్బును ప్రీపెయిడ్ డెబిట్‌కార్డులు లేదా మనీగ్రామ్, వెస్ట్రన్‌యూనియన్ మనీ ట్రాన్స్‌ఫర్ తదితర రూపాల్లో వసూలు చేశారు. దీనికి మనీలాండరింగ్ పద్ధతిని కూడా ఉపయోగించారు. కొన్ని సందర్భాల్లో ‘పే డే లోన్ ఫోన్స్ స్కీమ్స్’ రూపంలో కూడా బాధితులను మోసగించారు. ఈ స్కీమ్స్‌ల ద్వారా ఆర్థికంగా ఎలా లాభపడవచ్చో వివరించి అమెరికన్లు ఉచ్చులో పడేలా చేశారని యూఎస్ అటార్నీ యుంగ్ జె పాక్ తెలిపారు. ఇలాంటి ఫోన్ కుంభకోణాల వెనకున్న వారిని కనిపెట్టడంలో తమ బంద సభ్యులు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఐఆర్‌ఎస్ పేరిట అమెరికన్లను వంచించిన కేసులో ఐదు బీపీఓ కంపెనీలు, ఏడుగురు భారతీయులు తమ ఉద్యోగుల ద్వారా కుంభకోణానికి పాల్పడినట్టు విచారణలో తేలిందని ట్రెజరీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఫర్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ జె రసెల్ జార్జి వెల్లడించారు.
ఆరోపణలు ఎదుర్కుంటున్న బీపీఓలు ఇవే...
అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ జాబితాలో బీపీఓలు ఇవే... ఎక్స్‌లెంట్ సొల్యూషన్స్ బీపీఓ, ఏడీఎన్ ఇన్ఫోటెక్ ప్రై వేట్ లిమిటెడ్, ఇన్ఫో ఏస్ బీపీఓ సొల్యూషన్స్ ప్రై వేట్ లిమిటెడ్, అడోర్ ఇన్ఫోసోర్స్ ఇన్‌కార్పొరేషన్, జ్యురిక్ బీపీఓ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ .
Comments
Please login to add a commentAdd a comment