దేశం నుంచి బీపీఓ పరిశ్రమ ఔట్!
కాలుష్యాన్ని అరికట్టేందుకు దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డీజిల్ క్యాబ్‌లపై నిషేధం విధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇలా నిషేధం విధిస్తే బీపీఓ పరిశ్రమ మొత్తం దేశం నుంచి తరలిపోయే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపింది. బీపీఓ ఉద్యోగులంతా దాదాపు కంపెనీలు ఏర్పాటుచేసే క్యాబ్‌లలోనే ఆఫీసులకు, ఇళ్లకు వెళ్తారు. వాటిలో చాలావరకు డీజిల్ వాహనాలే. ఈ పరిశ్రమ నుంచి ప్రతియేటా దేశానికి దాదాపు వంద కోట్ల డాలర్లకు పైగా ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు ఈ నిషేధం నిర్ణయం వల్ల మన దేశం నుంచి బీపీఓ పరిశ్రమ వేరే దేశానికి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనానికి సాలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ తెలిపారు. ఐదేళ్లలో దశల వారీగా మొత్తం డీజిల్ క్యాబ్‌లు అన్నింటినీ ఢిల్లీ రోడ్ల నుంచి తీసేయిస్తామని, అంతవరకు గడువు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం కూడా కోర్టును కోరింది.
ఢిల్లీ రోడ్లపై డీజిల్ క్యాబ్‌లు నడవడానికి వీల్లేదంటూ తాము పెట్టిన మే 1వ తేదీ గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు ఏప్రిల్ 30న నిరాకరించింది. అయితే బీపీఓ ఉద్యోగుల భద్రత అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, ఈ పరిశ్రమ మనుగడను కూడా దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర చెప్పింది. తమ ఉద్యోగులకు అసౌకర్యంగా ఉంటే బీపీఓ పరిశ్రమ దేశం నుంచి వెళ్లిపోవచ్చని, అది దేశ ఆర్థిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతుందని సాలిసిటర్ జనరల్ అన్నారు. అయితే, బీపీఓ కంపెనీలు బస్సులను అద్దెకు తీసుకుని తమ ఉద్యోగులకు పికప్, డ్రాప్ అందించొచ్చు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది.