Brahamdagh Bugti
-
'నేను మాత్రం భారత్‌తో యుద్ధం చేస్తా'
కరాచీ: బెలూచిస్థాన్ రగడంతో ఇద్దరు సోదరులు ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్న చందాన తయారయ్యారు. పాకిస్థాన్ చేస్తున్న దుర్మార్గాలను ఎండగడుతూ తమకు స్వాతంత్ర్యం కావాలని నినదించిన ప్రత్యేక బెలూచిస్థాన్ మద్దతుదారు బ్రహందాగ్ బుగ్తీ భారత్‌కు మద్దతు ఇస్తుండగా అతడి సోదరుడు మాత్రం తాను పాకిస్థాన్‌కే మద్దతు ఇస్తానని చెబుతున్నాడు. పాక్ తో భారత్ యుద్ధం చేస్తే తాము మాత్రం పాక్ తరుపునే పోరాడుతామని, భారత సేనలతో తలపడుతామని ప్రకటించాడు. బెలూచిస్థాన్ లోని హత్యకు గురైన గిరిజన నేత నవాబ్ అక్బర్ బుక్తి కుమారుడు షాజెయిన్ బుగ్తి ప్రత్యేక బెలూచిస్తాన్ దేశ మద్దతుదారు బ్రహందాగ్ బుగ్తీకి సోదరుడు. బ్రహందాగ్ ప్రస్తుతం బెలూచిస్తాన్ హక్కుల కోసం ప్రజాస్వామ్య బద్ధంగా తన గొంతును వినిపిస్తుండటమే కాకుండా ప్రస్తుతం భారత్‌లో రక్షణ కోరుతూ దరఖాస్తు కూడా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి సోదరుడు షాజెయిన్ ను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 'బ్రహం దాగ్ భారత్ తో ఉండొచ్చు.. జెనీవాతో ఉండొచ్చు అది అతడి వ్యక్తిగత నిర్ణయం. నేనైనా, నా గిరిజన సమాజం అయినా మా నేత హత్యకు గురైన నవాబ్ అక్బర్ బుగ్తీ ఆదేశాలను మేం పాటిస్తాం. నవాబ్ ఎప్పుడూ పాకిస్థాన్ కు మద్దతిచ్చేవారు. ఆయన పోరాటం, సిద్ధాంతం ఎప్పుడూ పాక్ కు అనుకూలంగా ఉండేది. ఇందులో ఏ మార్పు లేదు. మా సిద్ధాంతం కూడా ఎప్పుడూ ఒకటే. ఇప్పటిప్పుడు భారత్ పాక్ తో యుద్ధం చేస్తే మేం పాకిస్థాన్ సరిహద్దులు కాపాడేందుకు ప్రయత్నిస్తాం. పాక్ సేనలకు అండగా ఉంటాం. భారత సేనలతో యుద్ధం చేస్తాం' అని చెప్పాడు. -
పాక్ కు మంటపుట్టించేలా..!
జమ్ముకశ్మీర్ విషయంలో నానా రాద్ధాంతం చేస్తూ భారత్ ను చీకాకు పరుస్తున్న పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పాక్ లోని కల్లోలిత ప్రాంతాలైన బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశాలను తొలిసారి ప్రస్తావించారు. బలూచిలో, పీవోకేలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యం నెలకొంది. సహజంగానే పాకిస్తాన్ ఆర్మీ సాగిస్తున్న అరాచకాలపై ఎలుగెత్తి నినదిస్తున్న బలూచి కార్యకర్తలకు ప్రధాని మోదీ ప్రకటన వెయ్యి ఎనుగుల బలం ఇచ్చినట్టు అయింది. ఈ నేపథ్యంలో దాయాదికి మంట పుట్టించేలా భారత్ మరో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) అగ్ర నాయకుడు బ్రాహుందాఘ్ బుగ్తీకి దేశంలో రాజకీయ ఆశ్రయం ఇచ్చే దిశగా భారత్ కదులుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జెనీవాలో ఉంటున్న బుగ్తీ త్వరలోనే భారత్ లో రాజకీయ ఆశ్రయం కోసం దరఖాస్తు చేస్తానని ప్రకటించారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా బలూచిస్థాన్ విముక్తి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ మనవడు బ్రాహుందాఘ్ బుగ్తీ. పదేళ్ల కిందట క్వెట్టాలోని ఓ రహస్య స్థావరంపై పాక్ ఆర్మీ జరిపిన దాడిలో నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తీ చనిపోగా.. ఆయన మానవడు ప్రాణాలతో బయటపడి.. విదేశాలకు ప్రవాసం వెళ్లిపోయారు. ఆదివారం జెనీవాలో జరిగిన బీఆర్పీ సమావేశంలో బుగ్తీకి భారత్ లో రాజకీయ ఆశ్రయంపై నిర్ణయం తీసుకున్నారు. బుగ్తీకి రాజకీయ ఆశ్రయం ఇచ్చేందుకు భారత్ అంగీకరించే అవకాశముంది.