బ్రహ్మోత్సవాలకు వేళాయే!
- 5 నుంచి లక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాలు
- 14 వరకు వేడుకలు
- 12న స్వామివారి రథోత్సవం
జూపాడుబంగ్లా: ఎనిమిది శతాబ్దాల క్రితం చెక్కబొమ్మరూపంలో దర్శనమిచ్చి అనంతర కాలం నుంచి కొలిచిన వారికి కొంగుబంగారంగా వెలుగొందుతున్న తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామి.. బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వతేదీన నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తర్తూరు బ్రహోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలయచరిత్ర..
సుమారు 720 ఏళ్లక్రితం జూపాడుబంగ్లా మండలం తర్తూరు ఉల్ఫా వంశానికి చెందిన రాజారెడ్డి మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురానికి చెందిన రంగమ్మను పెళ్లి చేసుకున్నారు. ఏటా హోలీ పౌర్ణమినాడు శ్రీరంగాపురంలో జరిగే శ్రీలక్ష్మిరంగనాథస్వామి వారి ఉత్సవాలకు దంపతులు వెళ్లేవారు. వేడుకల అనంతరం ఆడ బిడ్డకు పుట్టింటివారు ఒడిబియ్యం పెట్టడం ఆనవాయితీ. ఒడిబియ్యంలో ఆడరూపంలోని ఓ చెక్కబొమ్మను పెట్టి వచ్చే ఉత్సవాలకు పండంటి బిడ్డను ఎత్తుకుని రావాలని ఆకాంక్షించేవారు.
ఆ దంపతులు తర్తూరుకు వచ్చి ఒడిబియ్యాన్ని విప్పిచూడగా అందులోని చెక్కబొమ్మ మగరూపంలోకి మారేది. దీంతో మెట్టినింటివారు కోడలిని మందలించేవారు. అలాగే ఏటా వారి వంశస్తులు ఎవ్వరో ఒకరు చనిపోవడంతోపాటు అనారోగ్యాలకు గురయ్యేవారు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు జరగడంతో ఆగ్రహించిన వారు ఆ చెక్కబొమ్మను పశువులగాడిలోకి విసిరివేయగా స్వామివారు పూనకం వచ్చి తాను శ్రీరంగనాథస్వామిగా పేర్కొన్నాడు. తాను తర్తూరులోనే కొలువుంటానని, ఏటా జాతర నిర్వహించి భక్తితో కొలిస్తే అష్టైశ్వర్యాలు, వంశాభివృద్ధి ప్రసాదిస్తానని చెబుతాడు. అప్పటినుంచి ఉల్ఫా వంశస్తులు స్వామివారు కొలువుదీరిన ఇంటితోపాటు 60 ఎకరాల పొలాన్ని స్వామివారికి దారాదత్తం చేసి ఏటా జాతర నిర్వహించేవారు. అలా ప్రారంభమైన జాతరకు రాష్ట్రవ్యాప్తంగా పేరుంది.
జాతర ప్రత్యేకత..
తర్తూరు జాతర అనగానే కలప, ఎద్దుల విక్రయాలు గుర్తుకొస్తాయి. జాతరలో కడుపేదవాడి నుంచి ధనికుని వరకు అవసరమైన వంటింటి, వ్యవసాయ పనిముట్లు లభిస్తాయి. ప్రస్తుతం అటవిశాఖ అధికారులు నిషేధం విధించడంతో కలప పనిముట్ల స్థానంతో ఇనుముతో తయారుచేసిన వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే జాతరలో విక్రయించే కడ్డీల మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ఈ మాసంపు కడ్డీలను తినడానికి భక్తులు ప్రత్యేకంగా జాతరకు వస్తుంటారు. దేవుని ప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకెళ్లి ఆరగిస్తుంటారు.
కళ తప్పుతున్న జాతర..
పన్నెండేళ్ల క్రితం వరకు తర్తూరు జాతర నెలరోజుల పాటు జరుగుతుండేది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి సైతం భక్తులు, రైతులు భారీ సంఖ్యలో వచ్చేవారు. స్వామివారికి మొక్కులు తీర్చుకోవడంతో పాటు వారికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం జాతరలో కలప విక్రయాలు, రైతులు ఎద్దులబండ్లపై రావడాన్ని అటవీ అధికారులు నిషేధించడంతో క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోతోంది.
12న రథోత్సవం..
ఈనెల 5న ప్రారంభమయ్యే తర్తూరు శ్రీలక్ష్మిరంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 12వతేదీన స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన పూజారి వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపుచిన్నరంగారెడ్డి తెలిపారు. మొదటి రోజు 5న పూలచపురం, 6న సింహవాహనసేవ, 7 హంససేవ, 8నాగేంద్రునిసేవ, 9 హనుమంతునిసేవ, 10 గరుడసేవ, 11 గజవాహనసేవ, 12 రథోత్సవం, 13 పారువేట, 14 తీర్థావళితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.