‘సుడోకు’ రావాలంటే గణితంతో పనిలేదు..! కేవలం..
తొమ్మిది గుడులు.. తొమ్మిది అంకెలు. అటు చూసినా ఇటు చూసినా ఒకటి నుంచి తొమ్మిది వరకు అన్ని అంకెలూ రావాలి. ఒక్కటీ మిస్ కాకూడదు, ఒకే అంకె మరోసారి రాయకూడదు. ఇవన్నీ సుడోకు(sudoku) ఆటలో నియమాలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నిత్యం ఆడే ఈ ఆటంటే పిల్లలతోపాటు పెద్దలకూ చాలా ఇష్టం. దీని వల్ల లెక్కల మీద ఇష్టంతోపాటు ఏకాగ్రత, దీక్ష పెరుగుతాయి. ‘సుడోకు’ జపాన్‌లో (Japan) చాలా ప్రసిద్ధి చెందింది. అయితే పుట్టింది మాత్రం అమెరికాలో. 1979లో హోవర్డ్ గాన్స్ అనే ఆయన దీన్ని కనిపెట్టారు. ఆ తర్వాత ఇది పలు పత్రికల్లో ప్రచురితమైంది. అయితే 1986లో జపాన్‌కు చెందిన పజిల్ కంపెనీ ‘నికోలీ’ ఈ ఆటకు ‘సుడోకు’ అని పేరు పెట్టిన ప్రపంచమంతా తెలిసింది. ‘సుడోకు’ అంటే ‘ఒకే సంఖ్య’ అని అర్థం. సుడోకు ఆడాలంటే లెక్కలు తెలిసి ఉండాలని చాలామంది పొరబడుతుంటారు. నిజానికి అదేమీ అక్కర్లేదని సుడోకు నిపుణులు అంటున్నారు. ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు గుర్తుపట్టగలిగేవారు ఎవరైనా సుడోకు ఆడొచ్చంటున్నారు. ఈ ఆట ఆడేందుకు గణితశాస్త్రంతో పని లేదని, కేవలం ఆలోచనాశక్తి చాలని వివరిస్తున్నారు.సుడోకులోనూ అనేక రకాలున్నాయి. జిగ్సా సుడోకు, సమురాయ్ సుడోకు, మినీ సుడోకు, లాజిక్ 5, కిల్లర్ సుడోకు.. ఇలా ఒకే ఆటని రకరకాలుగా ఆడతారు. పేరుకు ఆటే అయినా ఇది ఆడేందుకు ఒక్కరే సరిపోతారు. ఒకచోట కూర్చుని పెన్ను, కాగితం పట్టుకొని గడులు నింపడమే ఇందులో కీలకం. చదవండి: ఆమె ఇళయరాజానా లేక రెహమానా..? అంత చిన్న వయసులోనే..సుడోకు ఎలా ఆడాలి, తొందరగా ఎలా పూర్తి చేయాలి అనే విషయాలను వివరిస్తూ కొంతమంది పుస్తకాలు రాశారు. అలాగే సుడోకు పేపర్లతో నిండిన పుస్తకాలను మార్కెట్లో అమ్ముతుంటారు. త్రీడీ సుడోకులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటితోపాటు ఫోన్లో సుడోకు ఆడేందుకు ప్రత్యేకమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి. 2006లో ఇటలీ(Italy)లో ప్రపంచ సుడోకు ఛాంపియన్(Championship) షిప్ ఏర్పాటు చేశారు. ఏటా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ విన్నాక మీకూ సుడోకు మీద ఆసక్తి కలుగుతోందా? ఇంకెందుకు ఆలస్యం.. వెళ్లి ఆడేయండి. మెదడును పదునుగా మార్చుకోండి.