విద్య కాషాయికరణపై ఉద్యమం
► పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమాసుందరి
ఒంగోలు: దేశంలో పెచ్చరిల్లిపోతున్న హిందూ మతోన్మాదం, విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బి.రమాసుందరి పిలుపునిచ్చారు. స్థానిక పీడీఎస్యూ జిల్లా కార్యాలయంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్లో భాగంగా మూడవ రోజైన ఆదివారం ‘చారిత్రక భౌతికవాదం’ అంశంపై ఆమె ప్రసంగించారు. మానవ చరిత్రలో ఆదిమ సమాజం తరువాత దోపిడీ చేసేవర్గం, దోపిడీకి గురయ్యే వర్గం ఉన్నాయన్నారు. వర్షాలు ఉన్నంత వరకు వర్గ పోరాటాలు ఉంటాయన్నారు.
వర్గ పోరాటలతోనే సోషలిస్టు సమాజం ఏర్పడుతుందన్నారు. నేడు దేశాన్ని భూస్వామ్య, పెట్టుబడిదారి, సామ్రాజ్యవాద శక్తులు దోపిడి చేస్తున్నాయన్నారు. కోట్లాది మంది ప్రజానీకం పేదరికం, దారిద్ర్యం, ఆకలి చావులు, ఆత్మహత్యలతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో హిందూ మతోన్మాదం పెట్రేగిపోయిందన్నారు. ప్రజలు తినే తిండిపైన, వారు ధరించే వస్త్రాలపైన ఆంక్షలు వి«ధిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై, సమాజ మార్పుకోసం విద్యార్థులు పోరాడాలని రమాసుందరి పిలుపునిచ్చారు.
‘రచన, వ్యాసాలు, భాషా పరిజ్ఞానం’ అంశం గురించి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కె.గోవర్ధన్ ప్రసంగించారు. పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు ఎం ప్రకృతి, సీహెచ్ శ్యాంసన్ అధ్యక్షతన జరిగిన శిక్షణా తరగతుల్లో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రామకృష్ణ, యూ.గనిరాజు, ఉపాధ్యక్షుడు ఎల్.రాజశేఖర్, నాయకులు ఎం.సునీల్, ఎం.అంకన్న, ఎస్.కిరణ్కుమార్, రవితేజ, ఝాన్సీ, కె.నానుప్రసాద్, సాహితీ, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణోదయ అంజయ్య ఆధ్వర్యంలో ఆలపించిన విప్లవ, విద్యార్థి, ఉద్యమ గేయాలు ఆలోచింపచేశాయి.