ఇక పట్టాలపైకి పెప్సీ రాజధాని, కోక్ శతాబ్ది!
న్యూడిల్లీ : బ్రాండెడ్ స్టేషన్ నుంచి ఇక పెప్సీ రాజధాని లేదా కోక్ శతాబ్ది పట్టాల పైకి రానున్నాయట. ప్రయాణికుల చార్జీలపై ఎలాంటి పెంపు అవసరం లేకుండా రెవెన్యూలను ఆర్జించడానికి రైల్వే రూపొందించిన బ్రాండెడ్ రైళ్ల, స్టేషన్ల ప్రణాళికను ఇక పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది..ఈ ప్రతిపాదనతో రైలు మొత్తాన్ని(వెలుపల, బయట) బ్రాండెడ్ ప్రకటనలకు విక్రయించేందుకు రైల్వే సిద్ధమవుతోంది.. వచ్చే వారంలో ఈ ప్రతిపాదనను రైల్వే బోర్డు ఆమోదించనుంది. ఒకవేళ కొత్త పాలసీ ఆమోదం పొందితే బోగిల వెలుపల వైపు, లోపలవైపు ప్రకటనలకు కంపెనీలకు మీడియా హక్కులు లభించనున్నాయి. దీంతో కాదేది కవితకనర్హం అన్నట్టు, కాదేది ప్రకటనర్హం మాదిరి రైల్వేలు మారనున్నాయి.
అంతకముందు పీస్-మీల్ మాదిరి కొద్ది స్థలాన్ని మాత్రమే రైల్వే ప్రకటనలకు విక్రయించేంది. కానీ ప్రస్తుతం రైళ్లంతటిన్నీ(వెలుపల, లోపల) మీడియా హక్కులకు విక్రయించాలని రైల్వే ప్లాన్ చేసింది. దీంతో ఎలాంటి ఛార్జీల పెంపు అవసరముండదని ఓ సీనియర్ అధికారి చెబుతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు దీర్ఘకాల గడువుగా ఈ మీడియా హక్కులను రైల్వే విక్రయించనుంది. రవాణా వ్యవస్థలో అత్యంత ప్రముఖమైన పాత్ర వహిస్తున్న రైల్వే కార్యకాలపాల అభివృద్ధికి, రెవెన్యూల పెంపుకు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు, రైల్వే శాఖ ఈ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ప్రకటనల ద్వారా రెవెన్యూలను ఆర్జించాలని యోచిస్తోంది.
అంతేకాక ఖాళీగా పడి ఉండే స్టేషన్లను కూడా పెళ్లి వేడుకలకు, ఈవెంట్లకు అద్దెకు ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ముందటి యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా ఈ మాదిరి ప్రణాళికలే రూపొందించినప్పటికీ, అవి పట్టాలెక్కడానికి నోచుకోలేదు. ప్రస్తుతం ఈ ప్రణాళిక పట్టాలెక్కితే, పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు స్టేషన్లపై, ప్లాట్‌ఫామ్‌లపై దర్శనమివ్వనున్నాయి. దశల వారీగా ఈ ప్యాకేజీని అమలు చేయనున్నారు. మొదట రాజధాని, శతాబ్ది సర్వీసులతో వీటిని ప్రారంభించనున్నారు.