Breathing Exercise
-
వ్యాయామం చేయడం బద్దకంగా ఉందా.. జస్ట్ ఇలా చేయండి..
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరమేమీ లేదు. కానీ, ఆచరణకు వచ్చేసరికి అనేక సమస్యలు మొదలవుతాయి. అలాంటి వారికి యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. ఇంట్లోనే కాదు.. మనకు నచ్చిన చోట కూర్చుని రోజూ 30 నిమిషాల పాటు నిర్దిష్ట పద్ధతిలో శ్వాస తీసుకుంటే చాలు.. అది కాస్తా వ్యాయామానికి సరితూగే ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. ఫొటోలో చూపినట్లు ముక్కును రెండు వైపులా మూసేసి.. నోటి ద్వారా మాత్రమే ఈ కొత్త శ్వాస ప్రక్రియ నడుస్తుంది. ‘హై రెసిస్టెన్స్ ఇన్‌స్పిరేటరీ మజిల్ స్ట్రెంగ్త్ ట్రెయినింగ్’ క్లుప్తంగా ఐఎంఎస్టీ అని పిలిచే ఈ తరహా శ్వాస ప్రక్రియ 1980లలోనే పరిచయమైనా దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలిశాయి. 50 నుంచి 79 ఏళ్ల వయసున్న 36 మందిపై తాము ప్రయోగం చేశామని, వారానికి ఆరు సార్లు చొప్పున ఆరు వారాల పాటు జరిగిన ఈ ప్రయోగాల్లో మంచి ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ క్రెయిగ్ హెడ్ తెలిపారు. వీరిలో సగం మంది రోజూ అరగంటపాటు నోట్లో ఒక పరికరాన్ని ఉంచుకుని ఊపిరి పీల్చినప్పుడు వారి రక్తపోటు 9 పాయింట్ల వరకు తగ్గిందని వివరించారు. ఈ పద్ధతిని నిలిపేసిన తర్వాత కూడా చాలాకాలం పాటు ప్రయోజనాలు కొనసాగడం ఇంకో విశేషమని తెలిపారు. అంతేకాకుండా.. నాడుల్లోని ఎండోథీలియల్ కణాల పనితీరు 45 శాతం వరకు మెరుగుపడిందని పేర్కొన్నారు. రుతుస్రావం నిలిచిపోయిన వారికీ ఈ శ్వాస ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. జిమ్ సౌకర్యాలు లేనివారు ఈ పద్ధతిని ఉపయోగించుకుని ఏరోబిక్ వ్యాయామం ద్వారా కలిగే లాభాలను పొందొచ్చని చెప్పారు. -
ఒక్కోసారి ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంటుంది..
ఒక్కోసారి ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంటుంది. అటువంటప్పుడు కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. అవేమిటంటే...ఊపిరితిత్తుల్లో గాలి నిండేలా గుండెల నిండా ఊపిరి బలంగా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ సేపు దాన్ని లంగ్స్‌లో నిలపాలి. ఆ తర్వాత నింపాదిగా వదలాలి. ఇలా కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఈ వ్యాయామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం అంటూ ఉండదు. కూర్చుని ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడు కూడా చేసుకోవచ్చు. ప్రయోజనాలు: ఇలా గుండెల నిండుగా గాలి పీల్చుకుంటూ చేసే వ్యాయామాలతో (డీప్ బ్రీతింగ్‌తో) ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు ఊపిరితిత్తుల సంకోచవ్యాకోచాలకు తోడ్పడే ఉదరవితానం (డయాఫ్రమ్) కూడా బలంగా అయ్యేందుకు తోడ్పడుతుంది. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్గా చెప్పే ఈ వ్యాయామం వల్ల మానసిక ఒత్తిడి (స్ట్రెస్), యాంగై్జటీ కూడా తగ్గుతాయి. నిద్ర నాణ్యత (క్వాలిటీ ఆఫ్ స్లీప్) పెరుగుతుంది. -
బ్రీతింగ్ వ్యాయామంతో వైరస్ల కట్టడి!
సాక్షి, న్యూఢిల్లీ: యోగాలో భాగంగా లేదా ఇతర బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో భాగంగాగానీ ముక్కుతో గాఢంగా గాలిని పీల్చుకొని నోటి నుంచి వదలడం ద్వారా పలు రకాల వైరస్ల బారి నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకోవచ్చని నోబెల్ బహుమతి గ్రహీత, కాలిఫోర్నియా యూనివర్సిటీలో ‘ఎమిరిటస్ ఆఫ్ మాలిక్యులర్ అండ్ మెడికల్ ఫార్మాకాలోజీ, స్కూల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న లూయీ జే ఇగ్నారో తెలియజేశారు. ముక్కుతో గాలిని గాఢంగా పీల్చుకోవడం వల్ల గాలి ముక్కు రంధ్రాల గోడలకు తగలడంతో అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ (ఎన్ఓ) అణువులు పుడతాయని, అవి గాలి ద్వారా ఊపిరి తిత్తుల్లోకి వెళ్లడంతో అక్కడ రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతుందని, అంతే కాకుండా రక్తంలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా కలిసి ప్రవహించేందుకు కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అణువులు ఎంతగానో తోడ్పడుతాయని ఆయన చెప్పారు. అందుకే ఊపిరితిత్తుల సమస్యలున్న చిన్న పిల్లలకు ఇన్హేలర్ ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ చికిత్సను అందిస్తారని ఆయన తెలిపారు. (చదవండి: హెర్బల్ టీ తో కరోనాకి చెక్!) 2003–04 సంవత్సరాల్లో సార్స్ వ్యాధి విజృంభించినప్పుడు శ్వాస పీల్చుకోలేక ఇబ్బంది పడుతున్న రోగులకు నైట్రిక్ ఆక్సైడ్ ఇన్హేలర్లు మంచి ఫలితాలను ఇచ్చాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరోనా రోగులపై కూడా నైట్రిక్ ఆక్సైడ్ ప్రయోగ పరీక్షలు జరపుతున్నారని ఆయన తెలిపారు. ఈ శ్వాస సంబంధిత వ్యాయామం ద్వారా రక్తపోటు (బీపీ) కూడా అదుపులో ఉంటుందని ఆయన అన్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తే బాగుంటుందన్న ప్రశ్నకు ‘ఆక్సిజన్ ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో అంటే, ఇంటి మేడ మీద లేదా పార్కుల్లో పది నిమిషాల చొప్పున రోజుకు రెండు సార్లు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఊపిరి తిత్తుల్లోకి గాలిని గాఢంగా పీల్చుకునేందుకు వీలైన భంగిమలో కూర్చొని చేయడం మంచిది’ అని ఆయన సూచించారు. (కరోనా: 56.71 శాతానికి పెరిగిన రికవరీ రేటు) -
బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
స్విమ్మింగ్‌పూల్‌లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీటమునిగి మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు అరండల్‌పేటకు చెందిన చావలి పృథ్వీరాజ్ యాదవ్(31) బేగంపేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కొండాపూర్ ఆనంద్‌నగర్‌లోని తులీప్ లీ పార్క్ గృహ సముదాయంలోని ఒక ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. చెన్నయ్‌లో సాఫ్ట్వేర్ ఇంజ నీర్‌గా పనిచేస్తున్న సోదరుడు కల్యాణ్‌చక్రవర్తి గురువారం పృథ్వీరాజ్ ఇంటికి రాగా.. సాయంత్రం ఇద్దరూ కలిసి తులీప్ లీ పార్కులోని స్విమ్మింగ్‌పూల్‌కు ఈతకెళ్లారు. ఈ సందర్భంగా ఈత కొడుతూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశారు. కొద్దిసేపటి తరువాత చూసిన కల్యాణ్‌కు పృథ్వీరాజ్ కనిపించలేదు. అనుమానమొచ్చి స్విమ్మింగ్‌పూల్‌లోకి చూడగా పృథ్వీరాజ్ నీటిలో మునిగిపోయి కనిపించారు. వెంటనే అతన్ని మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తుం డగా ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లి నీటిలో మునగడంతో మరణించినట్టు భావి స్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, మూడు నెలల బాబు ఉన్నారు. మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.