వారిని ఆదుకుంటాం..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఐఐటీలో ర్యాంకులు దక్కించుకుని ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు సాయం చేయడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. ఐఐటీలో 167, 410 ర్యాంకులతో టాప్ -500 లో వారు స్థానం దక్కించుకున్న రాజు, బ్రిజేష్ లకు శనివారం ఆయన ప్రత్యేకంగా అభినందలు తెలిపారు. కష్టాలను అధిగమించి ఐఐటీ ప్రవేశ పరీక్షలో అద్భుతమైన విజయం సాధించిన వారిద్దరికీ తన ట్విట్టర్లో విషెస్ చెప్పారు. మరో ట్వీట్లో జవహర్ నవోదయ విద్యాలయాన్ని కూడా అభినందించారు. ఇలాంటి గ్రామీణ ప్రాంతంలోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి, వారిని తీర్చిదిద్దడం గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు రాజు, బ్రిజేషలతో ఉదయం రాహుల్ గాంధీ మాట్లాడారని కాంగ్రెస వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ ఆయన కుమార్తె ఎమ్మెల్యే ఆరాధన సహా, స్థానిక పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపాయి. వారికి తగిన సహాయం చేయాల్సిన బాధ్యతను తివారీకి అప్పగించినట్టు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గఢ్ జిల్లాలోని రెహువా లాల్ గంజ్ గ్రామస్తుడైన ధర్మరాజ్ సరోజ్ కుమారులైన రాజు, బ్రిజేష ఐఐటీ ప్రవేశ పరీక్షలో 167, 410 ర్యాంకులు తెచ్చుకున్నారు. ఇద్దరూ స్థానిక జవహర్ నవోదయలో చదువుకుంటూ ఈ ఘనతను సాధించారు. అయితే వాళ్ల తండ్రి ఓ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తూ ఏడుగురు సభ్యులతో ఉన్న కుటుంబాన్ని నెట్టుకొస్తుండటంతో పిల్లల చదువు ఆ కుటుంబానికి పెనుభారంగా మారింది. జూన్ 25 లోపు దాదాపు లక్షరూపాయల పీజు కట్టాల్సి ఉంది. ఈ విషయం మీడియాలో విశేషంగా వచ్చింది.
Congratulations to all those who cracked the IIT. Spoke to Brijesh &Raju from Pratapgarh on their tremendous success against all odds (1/2)
— Office of RG (@OfficeOfRG) June 20, 2015
Proud of the Jawahar Navodaya Vidyalayas for discovering talent from rural areas &giving them such a wonderful springboard:Rahul Gandhi(2/2)
— Office of RG (@OfficeOfRG) June 20, 2015