British residency
-
164 ఏళ్ల లోకల్ హీరో వీరగాథ; నడిబజారులో ఉరికంబానికి
సాక్షి,హైదరాబాద్: జూలై 17..సాయంత్రం ఆరున్నర..అసురసంధ్య వేళ భాగ్యనగరం పుత్లీబౌలి ప్రాంతంలో అలికిడి మొదలైంది. దాదాపు 500 మంది యువకులు రహస్యంగా ఓ చోటకు చేరారు. వారికి తురేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌లు నాయకత్వం వహిస్తున్నారు. నెమ్మదిగా ముందుకు సాగి బ్రిటిష్ రెసిడెన్సీ గేటుకు సమీపంలో ఉన్న రెండు ఇళ్లలోకి చేరారు. అక్కడి నుంచి తమ పరిమిత ఆయుధ సంపత్తితో రెసిడెన్సీపై దాడి ప్రారంభించారు. చిన్నదిగా ఉన్న గోడను కొంతమేర కూల్చి లోనికి చొరబడ్డారు. వారి లక్ష్యం ఒక్కటే..లోపల బందీగా ఉన్న జమేదార్ చీదాఖాన్‌ను వెంటతీసుకెళ్లాలి. కానీ మద్రాసు హార్స్ ఆర్టిలరీ శిక్షణ పొందిన బ్రిటిష్ సైన్యం ముందు ఆ యువకులు నిలవలేకపోయారు. దాడి విఫలమైంది. చివరకు నిజాం ప్రభుత్వమే వారి జాడను బ్రిటిష్ సైన్యానికి అందించి వారికి మరణశాసనం లిఖించింది. సిపాయి తిరుగుబాటు చరిత్రలో సగర్వంగా నిలవాల్సిన భాగ్యనగర పుటకు ప్రాధాన్యం లేకుండా పోయింది. వారి వీరగాథకు ప్రచారం రాకుండా నాటి నిజాం ప్రభుత్వమే అణచివేసిందనేది చరిత్రకారుల మాట. సరిగ్గా 164 ఏళ్ల క్రితం నాటి లోకల్ హీరో వీరగాథ ఇది ఇది కోఠి కూడలిలో ఉమెన్స్ కాలేజీ గోడనానుకుని నిర్మితమైన ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉన్న స్మారకం, కనిపించినా ఇదేంటో కొందరు చరిత్రకారులకు తప్ప ఎవరికీ తెలియని నిర్మాణం.. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి పౌరుషాన్ని అద్దిన సిపాయి తిరుగుబాటుతో హైదరాబాద్‌కు ముడిపడిన ఓ వీరగాథకు సజీవసాక్ష్యం ఇది. ఎవరీ తరేబాజ్ఖాన్? బ్రిటిష్ వారి ఆగడాలు మితిమీరిపోతుండటం, తన ఉనికిని కాపాడుకునే క్రమంలో నాటి నిజాం పాలకులు సాగిలపడిపోవటం.. కొందరు పౌరుల్లో అసహనాన్ని పెంచింది. అలాంటి అభిప్రాయంతో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభించిన జమేదార్ చీదాఖాన్‌ను బ్రిటిష్ సైన్యం అరెస్టు చేసి ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీ భవనంగా ఉన్న నాటి బ్రిటిష్ రెసిడెన్సీలో ఖైదు చేసింది. ఈ విషయం తెలిసి బేగంబజార్‌కు చెందిన ఓ సాధారణ సిపాయి తురేబాజ్ఖాన్లో ఆగ్రహాన్ని నింపింది. ఇతనిలాగే రగిలిపోతున్న మౌల్వీ అల్లావుద్దీన్‌తో కలిసి తిరుగుబాటుకు పథకం రచించాడు. 1857 జూలై 17న 500 మంది యువకులతో బ్రిటిష్ రెసిడెన్సీ నోడ వద్ద ఉన్న రెండు ఇళ్లలోకి చేరి గోడ కూల్చి లోనికి చొరబడి బ్రిటిష్ సైన్యంపై దాడి ప్రారంభించారు. కానీ ఈ దాడి గురించి ముందుగానే వేగుల ద్వారా తెలుసుకున్న నిజాం ప్రభుత్వ మంత్రి తురబ్ అలీఖాన్ దాడి సమాచారాన్ని బ్రిటిష్ సైన్యానికి చేరవేశారు. దీంతో తురేబాజ్ ఖాన్ గెరిల్లా పోరాటం ఎక్కువసేపు సాగలేదు. సుశిక్షితులైన బ్రిటిష్ సిబ్బంది ముందు నిలవలేక..మరోసారి పెద్ద ఎత్తున దాడి చేద్దామని నిర్ణయించి అంతా పారిపోయారు. తురేబాజ్, అల్లావుద్దీన్‌ల ఆచూకీని నిజాం మంత్రి అలీఖాన్ బ్రిటిష్ సైన్యానికి చేరవేయడంతో వారిని పట్టుకుని అండమాన్ తరలించారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా తురేబాజ్ను హైదరాబాద్ తరలించి బ్రిటిష్ రెసిడెన్సీ ముందు నడిరోడ్డుపై ఉరి తీసి రోజంతా శవాన్ని అలాగే ఉంచారు. ఇప్పుడు అదే చోట స్మారకం ఉంది. ఆయన అండమాన్ నుంచి తప్పించుకుని మళ్లీ పోరాటానికి పథకం సిద్ధం చేసే ప్రయత్నంలో ఉండగా, నిజాం ప్రభుత్వం గుర్తించి బ్రిటిష్ సైన్యంకు పట్టించిందని, 1858 జనవరిలో ఆయనను కాల్చి చంపారన్న మరో కథ కూడా ఉంది. -
భాగ్యనగరంలో ఓ శ్వేతసౌధం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను ఎప్పుడైనా చూశారా? క్రీస్తుపూర్వం ఓ వెలుగు వెలిగిన గ్రీక్–రోమన్ నిర్మాణ శైలిని 15వ శతాబ్దంలో పునరుద్ధరించాక ఆ శైలిలో రూపుదిద్దుకున్న గొప్ప నిర్మాణాల్లో ‘వైట్‌హౌస్’ కూడా ఒకటి. ఆ భవనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఓసారి హైదరాబాద్‌లోని కోఠికి వెళ్లండి సరిపోతుంది! సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని కోఠిలో ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలగా వెలుగొందుతున్న బ్రిటిష్ రెసిడెన్సీ భవనం చూడటానికి వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలానే ఉంటుంది. వాస్తవానికి ఈ రెండు భవనాలకు ఒకదానికొకటి సంబంధం లేకపోయినా పల్లాడియన్ శైలి, సమకాలీన పరిస్థితులు ఈ రెండు భవనాలకు పోలిక తెచ్చిపెట్టాయి. శైలిలోనే కాదు... నిర్మాణ సమయం కూడా ఈ రెండు భవనాలకూ ఇంచుమించు ఒక్కటే. వైట్‌హౌస్ నిర్మాణం 1792లో ప్రారంభమై 1800 సంవత్సరంలో ముగియగా 1803లో బ్రిటిష్ రెసిడెన్సీ రూపుదిద్దుకుంది. వైట్ హౌస్ ముందు భాగం నిర్మాణ ప్రత్యేకతలెన్నో.. అంతెత్తున కనిపించే భారీ స్తంభాలు.. వాటిపై ఐకా నిక్ క్యాపిటల్.. దానిపైన త్రికోణాకారంలో పెడిమెంట్. దర్బారు హాలుకు ప్రవేశ మార్గ భారీతనం.. దానికి రెండు వైపులా రెండంతస్తుల భారీ గదులతో కూడిన భవంతులు.. లోనికి ప్రవేశించేందుకు ఎత్తయిన మెట్ల వరుస.. అర్ధ వృత్తాకారంలో పోర్టికో న మూనాలో వెనుక వైపు ప్రవేశద్వారం.. దానికి ఆధారంగా డబుల్ హైట్ కాలమ్స్.. లోనికి వెళ్లగానే ద ర్బార్ హాల్.. అది కూడా డబుల్ హైట్ బాల్కనీల నిర్మాణం.. ఇవన్నీ కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ ప్రత్యేకతలు.ఇక్కడ కళ్లు మూసుకొని ‘వైట్‌హౌస్’ ముందు తెరిస్తే దాదాపు అదే శైలి నిర్మాణం కనిపిస్తుంది. బ్రిటీష్ రెసిడెన్సీ భవనం వెనక భాగం ఇలా.. కలిపింది పల్లాడియన్ శైలి.. ‘వైట్‌హౌస్’కు మన కోఠి భవనానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒకే తరహా శైలి రెండింటినీ జోడించింది. ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ ఆండ్రూ పల్లాడియో 15వ శతాబ్దంలో కొత్త నిర్మాణ శైలికి బీజం వేశారు. క్రీస్తుపూర్వం గ్రీక్–రోమన్ నిర్మాణ శైలికి ఆధునికతను జోడిస్తూ పునరుద్ధరించారు. దానికి ప్రపంచం మంత్రముగ్ధమైంది. ఎన్నో నిర్మాణాలను ఆ రూపులో తీర్చిదిద్దిన ఆయన.. ఆ నిర్మాణ శైలికి సంబంధించి నాలుగు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఆ తరహా నిర్మాణశైలి పల్లాడియన్ డిజైన్‌గా పేరుగాంచింది. ఆ తర్వాత పల్లాడియన్ శైలిని తిరిగి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ జోమ్స్ ఇటలీకి వెళ్లి చదువుకొని మరీ పునరుద్ధరించారు. ఇది బాగా నచ్చి హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉన్న కిర్క్ ప్యాట్రిక్ అదే నమూనాలో రెసిడెన్సీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను మద్రాస్ ఇంజనీర్స్కు చెందిన శామ్యూల్ రసెల్స్కు అప్పగించారు. దాదాపు అదే సమయంలో జేమ్స్ హోబన్ అనే అమెరికా ఆర్కిటెక్ట్ ‘వైట్‌హౌస్’కు ప్రాణం పోశారు. వెనక పోర్టికో ప్రవేశమార్గం ఇలా భవనాన్ని కాపాడే ప్రయత్నమేదీ..? సమకాలీన నిర్మాణాలే అయినప్పటికీ ‘వైట్‌హౌస్’ తళతళా మెరిసిపోతుంటే కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ మాత్రం ఎప్పుడు కూలుతుందో తెలియనంతగా శిథిలావస్థకు చేరింది. 1949లో ఇది మహిళా కళాశాలగా మారినా భవనాన్ని కాపాడేందుకు పెద్దగా ప్రయత్నం జరగలేదు. త్వరలో కొలువుదీరే జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గం దీనిపై దృష్టి సారించి పురావస్తుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకొని దీన్ని హైదరాబాద్ షాన్లలో ఒకటిగా తీర్చిదిద్దాలన్న వినతులు చరిత్రకారుల నుంచి వస్తున్నాయి. భావితరాలకు చూపించాలి.. బ్రిటిష్ రెసిడెన్సీ భవనం పల్లాడియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న గొప్ప నిర్మాణం. అమెరికా వైట్‌హౌస్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ శైలిలో ఎన్నో భవనాలున్నాయి. గ్రీన్విచ్లోని క్వీన్స్ హౌస్, బర్లింగ్టన్స్ హోమ్ చిస్విక్ హౌస్, ఇంగ్లండ్‌లోని క్లేర్మంట్ హౌస్, కోల్‌కతాలోని గవర్నమెంట్ హౌస్‌లు వాటికి నిదర్శనం. గొప్ప నిర్మాణశైలికి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని కాపాడి భావితరాలకు చూపించాలి. – వసంత శోభ తురగ, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ -
ప్రేమ పునాదులపై భాగ్యనగరం
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ పునాదిపై వెలసిన మహాసౌధం భాగ్యనగరం. ఈ అందమైన ప్రేమకావ్యంలో ప్రతి అక్షరం కమనీయం. తొలిచూపులోనే విరిసిన వలపులు ఆ ఇద్దరినీ ఏకం చేశాయి. భాగమతీ–కులీకుతుబ్ల ప్రేమఘట్టం ఆద్యంతం ఆసక్తిదాయకం. ఈ జంటలాగే నిజాం కాలం నాటి రెసిడెంట్ కిర్క్‌పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమఘట్టం కూడా ఒక అద్భుత కావ్యంగానే నిలుస్తుంది. కులీ, భాగమతిలను ఏకం చేసేందుకు మూసీనదిపై ఏకంగా ఒక ప్రేమ వంతెన (పురానాఫూల్) వెలసింది. కిర్క్,ఖైరున్నీసాల ప్రేమకు సాక్షంగా అద్భుత కళాఖండం లాంటి బ్రిటిష్ రెసిడెన్సీ నిలిచింది. అజరామరమైన వారి ప్రేమ ఘట్టాలు ఇప్పటికీ ఆదర్శప్రాయం. వాలెంటైన్స్‌డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. సూర్యుడి నునులేత కిరణాలతో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంది. ఆకులపై పరుచుకున్న మంచుబిందువులు సూర్యకిరణాలతో తళుకులీనుతున్నాయి. హరివిల్లులై æ ప్రతిఫలిస్తున్నాయి. మరోవైపు మూసీ పరవళ్లు తొక్కుతోంది. కువకువలతో పక్షులు స్వాగతం చెబుతున్నాయి. అప్పుడప్పుడే మేల్కొన్న ‘చిచలం’ దినచర్యకు ఉపక్రమించింది. సరిగ్గా అదే సమయంలో కాలి పట్టాల చిరుసవ్వడిలో ఆమె వడివడిగా అడుగులు వేస్తూ పల్లె పొలిమేరలో ఉన్న ఆలయానికి వెళ్తోంది. ఆ సమయంలో అటుగా వస్తోన్న యువరాజు ఆమెను చూశాడు. ఆ ముగ్ధమోహన సౌందర్యరాశిని చూసి అప్రతిభుడయ్యాడు. గుర్రంపై ఆసీనుడై ఉన్న ఆయన మంత్రం వేసినట్టుగా ఆగిపోయాడు. ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆమె కొద్దిగా తలెత్తి అతన్ని చూసింది. ఇద్దరి చూపులు కలిశాయి. దేవకాంతలా ఉన్న ఆమె రూపం, మోములోని అమాయకత్వం నిజంగానే ఆయనను ముగ్ధున్ని చేశాయి. ఆ ఉదయం వారి తొలిప్రేమకు సంకేతం. ఆయనే గోల్కొండ యువరాజు కులీ కుతుబ్‌షా. ఆమె భాగమతి. అద్భుత ప్రేమ కావ్యంలో నాయకానాయికలు వాళ్లు. ఆమె సాధారణ యువతి...అతను యువరాజు. ఆమెది హైందవ సంప్రదాయం...అతనిది మహ్మదీయ మతం...వారి ప్రేమ ముందు ఆ ఆంతర్యాలు నిలవలేదు. వారి నిజమైన ప్రేమను పెద్దలూ ఆశీర్వదించారు. పెళ్లి బంధంతో వారిని ఏకం చేశారు. ఈ గొప్ప నగరానికి ఆమె పేరుతో భాగ్యనగరంగా నామకరణం చేశారు. ఒక నగరం వెలసింది.... షాజహాన్ తన ప్రియురాలి కోసం తాజ్‌మహల్‌ను కట్టించాడు. కానీ కులీకుతుబ్‌షా...ఒక మహానగరాన్నే నిర్మించాడు. బహుశా మానవ చరిత్రలోనే తొలి ప్రేమనగరం మన హైదరాబాద్. భాగమతి తన ప్రియుడి కోసం మతాన్నే వదులుకొంది. హైదర్బానుబేగంగా తన పేరును మార్చుకుంది. ఆమె పేరుతోనే ‘హైదరాబాద్’ఏర్పడింది. మహా భీకరంగా ప్రవహిస్తోన్న మూసీ నదిని సైతం లెక్క చేయకుండా తన ప్రియురాలు భాగమతి కోసం ‘చిచలం’కు పరుగులు తీశాడు కుతుబ్. నదిని దాటేందుకు యువరాజు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గోల్కొండ పట్టణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిచలం వెళ్లేందుకు ఇబ్రహీం కుతుబ్ షా పురానాపూల్ వంతెనను కట్టించాడు. అది ప్రేమ వంతెనగా ప్రజల హదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. మూసీనదికి ఉత్తరాన కుతుబ్ షా మొట్టమొదటిసారి బాగ్మతిని చూసిన ‘ చిచలం’ వద్ద అద్భుతమైన చారిత్రక కట్టడం చార్మినార్‌తో నగర నిర్మాణం పూర్తయింది. అప్పటికి ఆ ఊరు మహారణ్యంలో ఒక మూలన ఉన్న చిన్న పల్లె. నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో మహ్మద్ కులీ కుతుబ్ షా ‘మేరా షహర్ లోగోసే మాముర్కర్ జో తూ దరియా మే మిన్ యా సమీ ’అని దైవాన్ని ప్రార్ధించాడు. అలా ఈ నగరం అనతి కాలంలోనే జనంతో నించిపోయింది. మహానగరంగా నిలిచింది. ఒకే నమూనాతో 1578లో పురానాపూల్, పాంట్న్యూహ్ వంతెనలు.... గోల్కొండ కోట నుంచి ‘చిచలం’ వెళ్లేక్రమంలో పరవళ్లు తొక్కే మూసీని దాటడం ఒక సవాల్‌గానే ఉండేది. భాగమతిని కలిసేందుకు కులీకుతుబ్‌షా ఆ నదిని దాటేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే మూసీ నదిని దాటేందుకు కుతుబ్‌షాహీ నిర్మించిన మొట్టమొదటి పురానాఫూల్ వంతెన చరిత్రలో ప్రేమ వంతెనగా స్థిరపడింది.అప్పట్లోనే అంతర్జాతీయ నిర్మాణశైలిలో దీన్ని కట్టించారు. 1578లో మూసీ నదిపై కట్టించిన ‘ నర్వ’(పురానాపూర్), పారిస్‌లోని సైని నదిపై నిర్మించిన బ్రిడ్జీలు ఒకే నమూనాలో ఉండడం విశేషం. బ్రిటీష్ రెసిడెన్సీ ఒక ప్రేమ సౌధం.... కులీకుతుబ్‌షా తరహాలో ఇంగ్లీష్ రెసిడెంట్ కిర్క్‌పాట్రిక్ తన సువిశాలమైనక్షేత్రంలో అద్భుతమైన కళాఖండంలా నిర్మించిన భవనం ఒక ప్రేమసౌధంగా చరిత్రలో నిలిచిపోయింది. అదే కోఠీలోని బ్రిటీష్ రెసిడెన్సీ (కోఠీ విమెన్స్ కాలేజ్). కిర్క్‌పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమనిలయంగా బ్రిటీష్ రెసిడెన్సీ చరిత్రలో నిలిచిపోయింది. ఆమె కోసమే ప్రత్యేకంగా కట్టించిన ‘రంగమహల్’లో వాస్తుశిల్ప నైపుణ్యం ఉట్టిపడుతుంది. -
ప్రజల మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ
కొండా లక్ష్మణ్ బాపూజీ అనే పేరు సమస్త ఉద్యమాలకు చిరునామా. నిజాం వ్యతిరేక ఉద్యమం, వందేమాతరం ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, సహకార ఉద్య మం, దళిత బహుజన ఉద్యమం. ఇలా తెలంగాణ గడ్డపై చెలరేగిన ఉద్యమ రూపాలన్నింటికీ అండగా, జెండాగా నిలిచారాయన. 16 ఏళ్ల చిరుప్రాయం లో మొదలుపెట్టిన ఉద్యమ జీవితాన్ని 97 ఏళ్ల పండువయసులో ముగించారు. జీవితమంతా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కృషి చేశారు. తుదిశ్వాస విడిచేవరకూ తెలంగాణ సాధనే లక్ష్యంగా పోరాడారు. జీవిత మలిసంధ్యలో వయోభారాన్ని లెక్క చేయకుండా ఎక్కడ తెలంగాణ టెంట్ మొలిస్తే అక్కడ ప్రత్యక్షమవుతూ యువతకు స్ఫూర్తినిచ్చారు. చారిత్రక నైజాం వ్యతిరేక పోరాటం నుంచి ఇటీవలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా రాష్ట్ర రాజకీయా ల్లో బాపూజీ తనదైన ముద్ర వేశారు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో నిరుపేద చేనేత కుటుంబంలో కొండా లక్ష్మణ్ 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. 16వ ఏట 1930లో బొంబాయి రాష్ట్రం లోని చాందా పట్టణంలో మహాత్మాగాం ధీ చేసిన ప్రసంగంతో ప్రభావితుడై తన తెల్ల షరాయిని గాంధీ టోపీగా కుట్టుకుని ధరించారు. 1940లో ఆంధ్రమహాసభ లో చేరారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఆబిడ్స్ పోస్టాఫీసుపై, కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయజెండా ఎగురవేసి సంచలనం కలిగించారు. నిజాం రాజును అంతమొందిస్తే తప్ప హైద్రా బాద్ ప్రజలకు విముక్తి లేదని భావించిన బాపూజీ ఉస్మాన్ ఆలీఖాన్‌పై బాంబుదాడికి వ్యూహం రచిం చారు. 1947 డిసెంబర్ 4న ఆ ప్రయత్నం కొద్దిలో తప్పిపోగా బాంబు విసిరిన నారాయణరావు పవా ర్ను అక్కడికక్కడే నిర్బంధించి ఉరిశిక్ష, ఇతరులకు జైలుశిక్ష విధించారు. నిజాం హత్యకు కుట్రను రూపొందించాడని కొండా లక్ష్మణ్‌ను ప్రాసిక్యూట్ చేశారు. క్రిమినల్ లాయర్‌గా కూడా పేరుపొందిన బాపూజీ.. తెలంగాణ రైతాంగ సాయు ధ పోరాటంలో నిర్బంధితులైన నేతలకు ఉచిత న్యాయ సహాయం చేశారు. స్వాతంత్య్రానంతరం పార్లమెంట రీ ప్రజాస్వామ్యంలో మచ్చలేని నేతగా సేవలందించారు. ఎంపీగా, ఉపసభాప తిగా, మంత్రిగా, సహకారోద్యమ పిత గా, బహుజన నేతగా, తెలంగాణ ఉద్యమ నాయకు నిగా సేవలందించారు. 1952లో తొలిసారిగా అసి ఫాబాద్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత కాలంలో కమ్యూనిస్టుల కంచుకోట నల్లగొండజిల్లాలోని వేర్వేరు నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు విధానసభకు ఎన్నికయ్యారు. 1957 లో విధానసభ డిప్యూటీ స్పీకర్‌గా, సంజీవయ్య, బ్రహ్మానందరెడ్డిల మంత్రివర్గంలో క్యాబినెట్ మం త్రిగా సేవలందించారు. తొలినాళ్లలో సమైక్యవాదిగా విశాలాంధ్ర ఆవిర్భావానికి మద్దతునిచ్చారు. కానీ ఆంధ్రా పాలకుల తెలంగాణ వ్యతిరేక విధానాలు, ముల్కీ నిబంధనల అమలులో వైఫల్యం, ప్రాంతాల మధ్య ఆర్థిక ఆంతరాలను స్వయంగా ఎదుర్కొన్న బాపూజీ తన పూర్వ అభిప్రాయాలను మార్చుకుని 1969 నాటికి మంత్రిపదవికి రాజీనామా ఇచ్చి మరీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిం చారు. రాష్ట్రం రెండు ప్రాంతాలుగా విడిపోవాలే తప్ప తెలుగు ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు, వైషమ్యాలు ఉండరాదని ఆనాడే కోరుకున్నారు. 1996లో మొదలైన మలిదశ ఉద్యమానికి కూడా ఊతకర్రగా నిలిచారు. 2001లో టీఆర్ఎస్ ఏర్పడిన ప్పుడు దాన్ని నిండుమనసుతో ఆహ్వానించి తన నివాసం జలదృశ్యంలోనే దానికి పురుడు పోశారు. తెలంగాణ రాష్ట్రసాధన కొరకు కరడుగట్టిన సమైక్య వాది లగడపాటి రాజగోపాల్‌తో కూడా చర్చలు జరి పిన అజాతశత్రువాయన. ఆయన స్వప్నం సాకార మైంది. ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు బతుకు తెలంగాణ కావాలి. ఆత్మహత్యల తెలంగాణ వద్దు. ఆత్మగౌరవ తెలంగాణ కావాలి. శతజయంతి సందర్భంగా వారికి శతకోటి జోహార్లు. (27న కొండాలక్ష్మణ్ బాపూజీ శతజయంతి) వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్ పాలమూరు విశ్వవిద్యాలయం, 98492 83056 - డా॥వంగరి భూమయ్య -
బ్రిటిష్ రెసిడెన్సీ
ప్రధాన రెసిడెన్సీ భవనాన్ని ఆనుకుని వున్న విశాలమైన ప్రాంగణంలో ఆనాటి బ్రిటిష్ అధికారుల కోసం నిర్మించిన ఆఫీసు గదులు, వారి నివాసం కోసం నిర్మించిన క్వార్టర్లు వున్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ నిర్మించిన తర్వాత సుమారు 50 ఏళ్ల దాకా చుట్టూతా ఎలాంటి ప్రహారీ నిర్మించ లేదు. ఐతే, 1857లో భారత స్వాతంత్య్ర సమరంలో భాగంగా రెసిడెన్సీపై ఉద్యమకారుల దండయాత్ర జరిగింది. దాంతో దీని చుట్టూ రాళ్లతో ప్రహరీ నిర్మించారు. చారిత్రక పురాతన వారసత్వ సంపదకు నిలువెత్తు సాక్ష్యం బ్రిటిష్ రెసిడెన్సీ. ఇండో-బ్రిటిష్ కాలం నాటి భవనాలకు సంబంధించిన తీపి గుర్తుగా బ్రిటిష్ రెసిడెన్సీ నిలుస్తుంది. హైదరాబాద్‌లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సమయంలో ఈ కట్టడం నిర్మించారు. దీని నిర్మాణంలో ఆనాటి గొప్ప ఆర్కిటెక్చర్, వాస్తు శిల్ప శైలీ విశిష్టత నేటికీ ప్రతిబింబిస్తుంది. బ్రిటిష్ 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కోఠి-సుల్తాన్ బజార్, చౌరస్తాలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన రాజ ప్రాసాదంలో నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల ఉంది. అసఫ్ జాహీల కాలంలో (1724-1948)బ్రిటిష్ పాలకుల ఆధిపత్యం అధికంగా ఉండేది. స్థానిక నిజాం ప్రభువులు కల్పించిన క్వార్టర్సలోనే బ్రిటిష్ రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మేజర్ జె.ఎ. కిర్క్‌పాట్రిక్, బ్రిటిష్ అధికారులకు వారి హోదాకు దీటుగా ఒక పెద్ద బంగళా ఉండాలని, అందుకోసం కోఠి ప్రాంతంలో మూసీనది సమీపంలో సుమారు 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ పెద్ద భవంతి నిర్మించాలని ప్రతిపాదించాడు. అప్పటి నిజాం ప్రభువు ముందుగా ఈ ప్రతిపాదనను ఒప్పుకోకపోయినా, తర్వాత అంగీకరించి రెసిడెన్సీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకయిన ఖర్చునంతా నిజాం ప్రభువే భరించాడు. బ్రిటిష్ రాయల్ ఇంజనీర్లు లెఫ్టినెంట్ శామ్యూల్ రస్సెల్, మద్రాసు, ఈ భవన నమూనాను రూపొందించారు. నిజాం ఆస్థానంలోని ఉన్నతాధికారి శ్రీరాజా కంద స్వామి ముదిలియార్ తదితరులు సివిల్ పనులు పర్యవేక్షించారు. 22 పాలరాతి మెట్లు రెసిడెన్సీ ప్రధాన హాలును చేరుకోవడానికి 22 పాలరాతి మెట్లు ఎక్కవల్సి వుంటుంది. ఒక్కొక్క మెట్టు సుమారు 60 అడుగుల పొడవు వుంది. పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనిమిది భారీ ఎత్తై పిల్లర్లు, నాటి రాచఠీవికి దర్పణంగా దర్శనమిస్తాయి. అలాగే, తెల్లని ఎత్తై పాలరాయి వేదికపై ప్రధాన సింహద్వారానికి ఇరు పక్కలా పెద్దసైజు సింహాలు బ్రిటిష్ ఇంపీరియల్ చిహ్నంగా స్వాగతం పలుకుతాయి. ఇది దాటి రాజప్రాసాదంలో అడుగిడగానే ఉన్న దర్బార్ హాల్లో అత్యంత ప్రతి భావంతంగా చెక్కిన పలు కళాకృతులున్నాయి. దర్బారుహాల్లో సుమారు 60 అడుగుల ఎత్తున గల పైకప్పుపై ఆనాటి చిత్ర కళాకారుని తైలవర్ణ చిత్రాలు నేటికీ చెక్కుచెదర లేదు. ఖరీదైన చాండిలియర్లు, గోడలకు బిగించిన నిలువుటెత్తు అద్దాలు, అద్దాల మహల్‌ను తలపిస్తూ దర్శకుల మనసులను దోచుకుంటాయి. అన్నిరకాల హంగులున్నా బ్రిటిష్ రెసిడెన్సీలోని ప్రధాన భవనం చాలా భాగం శిథిలావస్థకు చేరుకుంది. వాటికి తక్షణ రిపేరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాన భవన సముదాయానికి కొద్దిపాటి దూరంలో బ్రిటిష్ రెసిడెంట్ల సమాధులు ఉన్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ కట్టడ నమూనా కూడా ఇక్కడ దగ్గర్లోనే ఉంది. అయితే ఈ ప్రాంతంలో నేడు కాలు మోపడానికి కూడా వీలు లేనంతగా పిచ్చి మొక్కలతో నిండి ఉంది. వీటికి తగిన రక్షణ, మరమ్మతులు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది. న్యూయార్కులోని గిౌటఛీ కౌఠఝ్ఛ్ట గ్చ్టిఛిజి అనే సంస్థ బ్రిటిష్ రెసిడెన్సీలో తగిన మరమ్మతుల కోసం ఒక లక్ష అమెరికన్ డాలర్లు గ్రాంటుగా ప్రకటించింది. చారిత్రక, వారసత్వ కట్టడాలపై ఆసక్తి గల వారందరికీ బ్రిటీష్ రెసిడెన్సీ ఎన్నో కథలు తెలియజేస్తుంది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com