బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన చోట ఉన్న నాటి తిరుగుబాటుకు గుర్తుగా ఉన్న స్మారకం
సాక్షి,హైదరాబాద్: జూలై 17..సాయంత్రం ఆరున్నర..అసురసంధ్య వేళ భాగ్యనగరం పుత్లీబౌలి ప్రాంతంలో అలికిడి మొదలైంది. దాదాపు 500 మంది యువకులు రహస్యంగా ఓ చోటకు చేరారు. వారికి తురేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌లు నాయకత్వం వహిస్తున్నారు. నెమ్మదిగా ముందుకు సాగి బ్రిటిష్ రెసిడెన్సీ గేటుకు సమీపంలో ఉన్న రెండు ఇళ్లలోకి చేరారు. అక్కడి నుంచి తమ పరిమిత ఆయుధ సంపత్తితో రెసిడెన్సీపై దాడి ప్రారంభించారు.
చిన్నదిగా ఉన్న గోడను కొంతమేర కూల్చి లోనికి చొరబడ్డారు. వారి లక్ష్యం ఒక్కటే..లోపల బందీగా ఉన్న జమేదార్ చీదాఖాన్‌ను వెంటతీసుకెళ్లాలి. కానీ మద్రాసు హార్స్ ఆర్టిలరీ శిక్షణ పొందిన బ్రిటిష్ సైన్యం ముందు ఆ యువకులు నిలవలేకపోయారు. దాడి విఫలమైంది. చివరకు నిజాం ప్రభుత్వమే వారి జాడను బ్రిటిష్ సైన్యానికి అందించి వారికి మరణశాసనం లిఖించింది. సిపాయి తిరుగుబాటు చరిత్రలో సగర్వంగా నిలవాల్సిన భాగ్యనగర పుటకు ప్రాధాన్యం లేకుండా పోయింది. వారి వీరగాథకు ప్రచారం రాకుండా నాటి నిజాం ప్రభుత్వమే అణచివేసిందనేది చరిత్రకారుల మాట.
సరిగ్గా 164 ఏళ్ల క్రితం నాటి లోకల్ హీరో వీరగాథ ఇది
ఇది కోఠి కూడలిలో ఉమెన్స్ కాలేజీ గోడనానుకుని నిర్మితమైన ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉన్న స్మారకం, కనిపించినా ఇదేంటో కొందరు చరిత్రకారులకు తప్ప ఎవరికీ తెలియని నిర్మాణం.. భారత స్వాతంత్య్ర సంగ్రామానికి పౌరుషాన్ని అద్దిన సిపాయి తిరుగుబాటుతో హైదరాబాద్‌కు ముడిపడిన ఓ వీరగాథకు సజీవసాక్ష్యం ఇది.
ఎవరీ తరేబాజ్‌ఖాన్?
బ్రిటిష్ వారి ఆగడాలు మితిమీరిపోతుండటం, తన ఉనికిని కాపాడుకునే క్రమంలో నాటి నిజాం పాలకులు సాగిలపడిపోవటం.. కొందరు పౌరుల్లో అసహనాన్ని పెంచింది. అలాంటి అభిప్రాయంతో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పనిచేయటం ప్రారంభించిన జమేదార్ చీదాఖాన్‌ను బ్రిటిష్ సైన్యం అరెస్టు చేసి ప్రస్తుతం కోఠి ఉమెన్స్ కాలేజీ భవనంగా ఉన్న నాటి బ్రిటిష్ రెసిడెన్సీలో ఖైదు చేసింది. ఈ విషయం తెలిసి బేగంబజార్‌కు చెందిన ఓ సాధారణ సిపాయి తురేబాజ్‌ఖాన్‌లో ఆగ్రహాన్ని నింపింది. ఇతనిలాగే రగిలిపోతున్న మౌల్వీ అల్లావుద్దీన్‌తో కలిసి తిరుగుబాటుకు పథకం రచించాడు. 1857 జూలై 17న 500 మంది యువకులతో బ్రిటిష్ రెసిడెన్సీ నోడ వద్ద ఉన్న రెండు ఇళ్లలోకి చేరి గోడ కూల్చి లోనికి చొరబడి బ్రిటిష్ సైన్యంపై దాడి ప్రారంభించారు.
కానీ ఈ దాడి గురించి ముందుగానే వేగుల ద్వారా తెలుసుకున్న నిజాం ప్రభుత్వ మంత్రి తురబ్ అలీఖాన్ దాడి సమాచారాన్ని బ్రిటిష్ సైన్యానికి చేరవేశారు. దీంతో తురేబాజ్ ఖాన్ గెరిల్లా పోరాటం ఎక్కువసేపు సాగలేదు. సుశిక్షితులైన బ్రిటిష్ సిబ్బంది ముందు నిలవలేక..మరోసారి పెద్ద ఎత్తున దాడి చేద్దామని నిర్ణయించి అంతా పారిపోయారు. తురేబాజ్, అల్లావుద్దీన్‌ల ఆచూకీని నిజాం మంత్రి అలీఖాన్ బ్రిటిష్ సైన్యానికి చేరవేయడంతో వారిని పట్టుకుని అండమాన్ తరలించారు.
అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా తురేబాజ్‌ను హైదరాబాద్ తరలించి బ్రిటిష్ రెసిడెన్సీ ముందు నడిరోడ్డుపై ఉరి తీసి రోజంతా శవాన్ని అలాగే ఉంచారు. ఇప్పుడు అదే చోట స్మారకం ఉంది. ఆయన అండమాన్ నుంచి తప్పించుకుని మళ్లీ పోరాటానికి పథకం సిద్ధం చేసే ప్రయత్నంలో ఉండగా, నిజాం ప్రభుత్వం గుర్తించి బ్రిటిష్ సైన్యంకు పట్టించిందని, 1858 జనవరిలో ఆయనను కాల్చి చంపారన్న మరో కథ కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment