ప్రేమ పునాదులపై భాగ్యనగరం | sakshi special story on love constructions in hyderabad | Sakshi
Sakshi News home page

లవ్‌ సిటీ!

Published Wed, Feb 14 2018 8:32 AM | Last Updated on Wed, Feb 14 2018 12:49 PM

sakshi special story on love constructions in hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ పునాదిపై వెలసిన మహాసౌధం భాగ్యనగరం. ఈ అందమైన ప్రేమకావ్యంలో ప్రతి అక్షరం కమనీయం.  తొలిచూపులోనే  విరిసిన వలపులు ఆ ఇద్దరినీ ఏకం చేశాయి. భాగమతీ–కులీకుతుబ్‌ల ప్రేమఘట్టం ఆద్యంతం ఆసక్తిదాయకం. ఈ జంటలాగే నిజాం కాలం నాటి రెసిడెంట్‌ కిర్క్‌పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమఘట్టం కూడా  ఒక అద్భుత కావ్యంగానే  నిలుస్తుంది. కులీ, భాగమతిలను ఏకం చేసేందుకు మూసీనదిపై ఏకంగా ఒక ప్రేమ వంతెన (పురానాఫూల్‌) వెలసింది. కిర్క్,ఖైరున్నీసాల ప్రేమకు సాక్షంగా అద్భుత కళాఖండం లాంటి  బ్రిటిష్‌ రెసిడెన్సీ నిలిచింది. అజరామరమైన వారి ప్రేమ ఘట్టాలు ఇప్పటికీ ఆదర్శప్రాయం. వాలెంటైన్స్‌డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. 

సూర్యుడి నునులేత కిరణాలతో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుంది. ఆకులపై పరుచుకున్న మంచుబిందువులు సూర్యకిరణాలతో తళుకులీనుతున్నాయి. హరివిల్లులై æ ప్రతిఫలిస్తున్నాయి. మరోవైపు మూసీ పరవళ్లు తొక్కుతోంది. కువకువలతో పక్షులు స్వాగతం చెబుతున్నాయి. అప్పుడప్పుడే మేల్కొన్న ‘చిచలం’ దినచర్యకు ఉపక్రమించింది. సరిగ్గా అదే సమయంలో  కాలి పట్టాల  చిరుసవ్వడిలో ఆమె వడివడిగా అడుగులు వేస్తూ పల్లె పొలిమేరలో ఉన్న ఆలయానికి  వెళ్తోంది. ఆ సమయంలో అటుగా వస్తోన్న యువరాజు ఆమెను చూశాడు. ఆ ముగ్ధమోహన సౌందర్యరాశిని చూసి అప్రతిభుడయ్యాడు. గుర్రంపై ఆసీనుడై ఉన్న ఆయన మంత్రం వేసినట్టుగా ఆగిపోయాడు. ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆమె కొద్దిగా తలెత్తి అతన్ని చూసింది. ఇద్దరి చూపులు కలిశాయి. దేవకాంతలా ఉన్న ఆమె రూపం, మోములోని అమాయకత్వం నిజంగానే ఆయనను ముగ్ధున్ని చేశాయి. ఆ ఉదయం వారి తొలిప్రేమకు సంకేతం. ఆయనే గోల్కొండ యువరాజు కులీ కుతుబ్‌షా. ఆమె భాగమతి. అద్భుత ప్రేమ కావ్యంలో నాయకానాయికలు వాళ్లు. ఆమె సాధారణ యువతి...అతను యువరాజు. ఆమెది హైందవ సంప్రదాయం...అతనిది మహ్మదీయ మతం...వారి ప్రేమ ముందు ఆ ఆంతర్యాలు నిలవలేదు. వారి నిజమైన ప్రేమను పెద్దలూ ఆశీర్వదించారు. పెళ్లి బంధంతో వారిని ఏకం చేశారు. ఈ గొప్ప నగరానికి ఆమె పేరుతో భాగ్యనగరంగా నామకరణం చేశారు. 

ఒక నగరం వెలసింది....
షాజహాన్‌ తన ప్రియురాలి కోసం తాజ్‌మహల్‌ను కట్టించాడు. కానీ కులీకుతుబ్‌షా...ఒక మహానగరాన్నే  నిర్మించాడు. బహుశా మానవ చరిత్రలోనే తొలి ప్రేమనగరం మన హైదరాబాద్‌. భాగమతి తన ప్రియుడి కోసం మతాన్నే  వదులుకొంది. హైదర్‌బానుబేగంగా తన పేరును మార్చుకుంది. ఆమె పేరుతోనే   ‘హైదరాబాద్‌’ఏర్పడింది. మహా భీకరంగా ప్రవహిస్తోన్న మూసీ నదిని సైతం లెక్క చేయకుండా తన ప్రియురాలు భాగమతి కోసం ‘చిచలం’కు పరుగులు తీశాడు కుతుబ్‌. నదిని దాటేందుకు యువరాజు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గోల్కొండ పట్టణం నుంచి 8 కిలోమీటర్‌ల దూరంలో ఉన్న  చిచలం వెళ్లేందుకు ఇబ్రహీం కుతుబ్‌ షా పురానాపూల్‌ వంతెనను కట్టించాడు. అది ప్రేమ వంతెనగా  ప్రజల హదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. మూసీనదికి ఉత్తరాన కుతుబ్‌ షా మొట్టమొదటిసారి బాగ్‌మతిని చూసిన ‘ చిచలం’ వద్ద  అద్భుతమైన చారిత్రక కట్టడం చార్మినార్‌తో  నగర నిర్మాణం పూర్తయింది. అప్పటికి ఆ ఊరు మహారణ్యంలో ఒక మూలన ఉన్న చిన్న పల్లె. నగర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో మహ్మద్‌ కులీ కుతుబ్‌ షా  ‘మేరా షహర్‌ లోగోసే మాముర్‌కర్‌ జో తూ దరియా మే మిన్‌ యా సమీ ’అని దైవాన్ని  ప్రార్ధించాడు. అలా ఈ నగరం అనతి కాలంలోనే జనంతో నించిపోయింది. మహానగరంగా నిలిచింది.

ఒకే నమూనాతో 1578లో పురానాపూల్, పాంట్‌న్యూహ్‌ వంతెనలు....
గోల్కొండ కోట నుంచి ‘చిచలం’ వెళ్లేక్రమంలో పరవళ్లు తొక్కే మూసీని దాటడం ఒక సవాల్‌గానే ఉండేది.  భాగమతిని కలిసేందుకు  కులీకుతుబ్‌షా ఆ నదిని దాటేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఈ  క్రమంలోనే మూసీ నదిని దాటేందుకు కుతుబ్‌షాహీ నిర్మించిన మొట్టమొదటి పురానాఫూల్‌ వంతెన  చరిత్రలో  ప్రేమ వంతెనగా  స్థిరపడింది.అప్పట్లోనే అంతర్జాతీయ నిర్మాణశైలిలో  దీన్ని కట్టించారు. 1578లో మూసీ నదిపై  కట్టించిన ‘ నర్వ’(పురానాపూర్‌), పారిస్‌లోని  సైని నదిపై నిర్మించిన బ్రిడ్జీలు ఒకే నమూనాలో ఉండడం విశేషం.

బ్రిటీష్‌ రెసిడెన్సీ ఒక ప్రేమ సౌధం....
కులీకుతుబ్‌షా తరహాలో ఇంగ్లీష్‌ రెసిడెంట్‌ కిర్క్‌పాట్రిక్‌ తన సువిశాలమైనక్షేత్రంలో అద్భుతమైన కళాఖండంలా నిర్మించిన భవనం ఒక ప్రేమసౌధంగా చరిత్రలో నిలిచిపోయింది. అదే కోఠీలోని  బ్రిటీష్‌ రెసిడెన్సీ (కోఠీ విమెన్స్‌ కాలేజ్‌). కిర్క్‌పాట్రిక్, ఖైరున్నీసాబేగంల ప్రేమనిలయంగా బ్రిటీష్‌ రెసిడెన్సీ చరిత్రలో నిలిచిపోయింది. ఆమె కోసమే  ప్రత్యేకంగా కట్టించిన ‘రంగమహల్‌’లో వాస్తుశిల్ప నైపుణ్యం ఉట్టిపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement