పంజాబ్‌లో 'ఉగ్ర' కాల్పులు
గురుదాస్‌పూర్ : భారత్‌పై పాక్ కవ్వింపు చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.. ఆదివారం రాత్రి బారాముల్లా 46 రాష్ట్రీయ రైఫిల్స్ క్యాంపుపై ఆత్మహూతి దాడికి దిగిన ఉగ్రవాదులు మళ్లీ సోమవారం ఉదయం విరుచుకుపడ్డారు. పంజాజ్‌లోని గురుదాస్‌పూర్‌లో బీఎస్ఎఫ్ చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ అనిల్ పైల్వాల్ ఈ దాడులను నిర్థారించారు. అనుమానిత ఉగ్రవాదులు గురుదాస్‌పూర్ సెక్టార్‌లోని చక్రి పోస్టు వద్ద చొరబాటుకు ప్రయత్నిస్తూ కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు.
ఈ కాల్పులను బీఎస్ఎఫ్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందని వివరించారు. కాగ,ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలోనే ఉగ్రవాదులు శ్రీనగర్‌లోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ ప్రధానకార్యాలయం వద్ద బీభత్సం సృష్టించారు. గంటసేపు జరిగిన ఆ హోరాహోరి కాల్పుల్లో ఓ జవాను అమరుడవగా.. ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయని ఆర్మీ వెల్లడించింది. ఇద్దరు మిలిటెంట్లను ఆర్మీ మట్టుబెట్టింది. మిగతా నలుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. వారి కోసం ప్రస్తుతం వేట జరుగుతున్న నేపథ్యంలో గురుదాస్‌పూర్‌లో మళ్లీ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.