గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్‌ల్లో ఏవి బెటర్?
నేను బీఎస్‌ఎల్‌ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్‌లో 2010 నుంచి ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. ఇప్పటివరకూ రూ.3,95,000 ఇన్వెస్ట్ చేశాను. ఈ ఇన్వెస్ట్మెంట్ విలువ ప్రస్తుతం రూ.4,10,000గా ఉంది. ఈ ప్లాన్‌లో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా?
–రవికాంత్, విశాఖపట్టణం
బీఎస్‌ఎల్‌ఐ డ్రీమ్ ఎండోమెంట్ ప్లాన్ అనేది ఒక యూనిట్ లింక్డ్లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్). బీమా, మదుపు కలగలపిన ప్లాన్ ఇది. కానీ ఈ తరహా ప్లాన్లు తగిన బీమా కవర్‌ను, కనీసం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకూడదు. పైగా వీటిల్లో చార్జీల వ్యయాలు అధికంగా ఉంటాయి. మీరు చెల్లించే ప్రీమియమ్ నుంచి ఈ చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఎలా చూసినా ఇవి ఇన్వెస్ట్‌మెంట్‌కు తగినవి కావు. బీమా కోసం టర్మ్ బీమా ప్లాన్లను ఎంచుకోవాలి. వీటిల్లో ప్రీమియమ్‌లు చాలా తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ అవసరాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీ విషయానికొస్తే, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై సగటున ఏడాదికి 1 శాతం కంటే తక్కువగానే రాబడులు వచ్చాయి. మీరు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో ఇన్వెస్ట్ చేసినా ఇంతకుమించి రాబడులు వచ్చేవి.మీరు ఈ ప్లాన్ తీసుకొని ఐదేళ్లు పూర్తయినందున మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు పొందే సరెండర్ వేల్యూపై కూడా ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అందుకని ఈ ప్లాన్‌ను సరెండర్ చేయండి. ఈ ప్లాన్ కోసం చెల్లించే ప్రీమియమ్ నుంచే కొంత మొత్తాన్ని టర్మ్ బీమా పాలసీ కోసం, మిగిలిన దానిని ఒకటి లేదా రెండు మంచి ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయండి.
నేను ఇటీవలే గోల్డ్ బాండ్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. అయితే వీటి కంటే కూడా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రయోజనాలు వస్తాయని మిత్రులంటున్నారు. గోల్డ్ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదా ?
–బాబూరావు, వరంగల్
సావరిన్ గోల్ట్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమే. గోల్డ్ ఇటీఎఫ్ల్లో కన్నా గోల్డ్బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మూడు విధాలుగా ప్రయోజనకరం. మొదటిది.. గోల్ట్ బాండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు 2.75 శాతం చొప్పున వార్షిక వడ్డీ లభిస్తుంది. ఆరు నెలలకొకసారి చెల్లిస్తారు. రెండవది.. గోల్ట్ ఈటీఎఫ్‌లు 1 శాతం చొప్పున మేనేజ్మెంట్ చార్జీలు విధిస్తాయి. గోల్డ్ బాండ్స్ ఎలాంటి చార్జీలు విధించవు. మూడవది గోల్డ్ బాండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి మూలధన లాభాల పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఇక ఈటీఎఫ్‌ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసహరించుకుంటే మీరు స్వల్ప కాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక గోల్ట్ బాండ్స్ విషయానికొస్తే, వీటి కాలపరిమితి 8 సంవత్సరాలు. ఐదేళ్ల తర్వాత ఈ బాండ్ల నుంచి కావాలనుకుంటే వైదొలిగే అవకాశముంది. వీటిని డి–మ్యాట్లోకి మార్చుకోవచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అవుతాయి. ఫలితంగా మెచ్యురిటీకి ముందే ఈ బాండ్ల నుంచి వైదొలగవచ్చు. ఈ బాండ్ల ఆధారంగా రుణాలు కూడా తీసుకోవచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే గోల్ట్ ఈటీఎఫ్‌ల కన్నా, సావరిన్ గోల్డ్‌బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనని చెప్పవచ్చు.
నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మిత్రుల దగ్గర తక్కువ వడ్డీకి రుణం తీసుకొని, ఈ మొత్తంతో 3–15 ఏళ్ల కాలానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. లాక్–ఇన్ పీరియడ్, పన్ను తదితర అంశాలు పరిగణనలోకి తీసుకొని నాకు కొన్ని మంచి ఫండ్స్‌ను సూచించండి?
–సూరజ్, హైదరాబాద్
అప్పు చేసి పప్పు కూడా వద్దని పెద్దలు ఆనాటి నుంచి చెపుతూనే ఉన్నారు. ఇది మ్యూచువల్ ఫండ్స్‌తో సహా అన్ని ఇన్వెస్ట్‌మెంట్స్‌కు వర్తిస్తుంది. తక్కువ వడ్డీకైనా సరే, మిత్రుల దగ్గర రుణం తీసుకొని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదు. దీనివల్ల ఆర్థిక ఊబిలో కూరుకుపోవడమే కానీ ఎలాంటి ప్రయోజనాలు మీరు పొందలేరు. చాలా ఫండ్స్ రాబడులు ఊరిస్తూ ఉంటాయి. దీంతో చేతిలో డబ్బుల్లేకపోయినా, అప్పు చేసైనా సరే వాటిల్లో ఇన్వెస్ట్ చేయాలని మనం టెంప్ట్ అవుతూ ఉంటాము. కానీ ఇది సరైన విధానం కాదు. స్టాక్మార్కెట్లో ఒక్కోసారి సుదీర్ఘ బేర్ దశలు నడుస్తూ ఉంటాయి. ఒకసారి ఆ దశ వస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హరించుకుపోతాయి, రాబడులు రాకపోగా, వడ్డీ భారం అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. అందుకని అప్పు చేసి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనకు స్వస్తి చెప్పండి. మీ సొంత డబ్బులనే ఇన్వెస్ట్ చేయండి. ఏవైనా రెండు, మూడు డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోండి. వాటిల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. సంపద సృష్టికి ఇదొక చక్కని మార్గం. ఈ ఫండ్స్‌కు ఎలాంటి లాక్–ఇన్ పీరియడ్ ఉండదు. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ ఫండ్స్ యూనిట్లను విక్రయించుకోవచ్చు. ఈ ఫండ్స్‌లో ఏడాదికి పైగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పని కూడా ఉండదు.