b.srinivasarao
-
భ్రూణహత్యల నివారణపై దృష్టి పెట్టండి
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : భ్రూణహత్యల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అడిషనల్ డెరైక్టర్ కె.సుధాకర్‌బాబు ఆ శాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. భ్రూణహత్యల నివారణ చట్టం అమలుపై అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖాధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి భ్రూణహత్యలను పూర్తిస్థాయిలో నివారించాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని చెప్పారు. రికార్డులు పరిశీలించాలని, అవకతవకలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నకిలీ కస్టమర్లతో స్కానింగ్ సెంటర్లపై ఆపరేషన్లు నిర్వహించి నిఘా పెట్టాలన్నారు. అందుకు సంబంధించి పలు సలహాలు, సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్ఓ రామతులశమ్మ, జిల్లా వైద్యారోగ్యశాఖ డెమో అధికారి బి.శ్రీనివాసరావు, డీపీహెచ్‌ఎన్‌వో పి.నాగరత్నం, డీపీవో సుబ్బలక్ష్మి, లీగల్ కన్సల్టెంట్ ఎంఎల్ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ ఇంగ్లిష్ టీచర్లపై దర్యాప్తు ముమ్మరం
కొణిజర్ల(వైరా),న్యూస్‌లైన్: జిల్లాలో తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన 66 మంది ఇంగ్లిష్ ఉపాధ్యాయులపై సీబీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసిందని, ఈ నివేదిక రాగానే సంబంధిత ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం వైరాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సదరు ఉపాధ్యాయులపై శాఖా పరమైన దర్యాప్తు పూర్తి చేసి, క్రిమినల్ కేసులకు సిఫారసు చేసినట్లు తెలిపారు. అలాగే తప్పుడు వైద్య ధ్రుపత్రాలతో రీయింబర్స్మెంట్ పొందిన 21 మంది ఉపాధ్యాయులకు 3 ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నట్లు తెలిపారు. పదో తర గతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ నుంచి ఇచ్చే స్టడీ మెటీరియల్ రెండు మూడు రోజుల్లో అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 33 మోడల్ స్కూళ్లు ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉండగా స్థలం లేక 31 పాఠశాలలు ప్రారంభం కాలేద ని, రెండు పాఠశాలలు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయని వివరించారు. జాతీయ సగటు మహిళా అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో మాత్రమే మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ కోర్టులో ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా పదోన్నతులు చేపట్టి, షెడ్యూలు విడుదల చేస్తామన్నారు. ఆర్వీఎం పీఓ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఆర్వీఎం ద్వారా ఈ ఏడాది రూ.84.65 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.62.51 కోట్లు వివిధ పనులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు పుష్కలంగా విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఎంఓ వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.