Budda Prasad
-
కృష్ణవేణి విగ్రహ ఏర్పాటుపై చర్చ
నాగాయలంక : స్థానిక శ్రీరామపాదక్షేత్రం పుష్కరఘాట్‌లో నది బ్యాక్‌డ్రాప్ అనుసంధానంగా కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ప్రధాన మార్గానికి అభిముఖంగా నదిని తాకిస్తూ విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కమిటీ సభ్యులతో ఆయన అభిప్రాయపడ్డారు. పుష్కరఘాట్ కేంద్రంగా జరిపే సాంస్కృతిక కార్యక్రమాలు, హారతి తదితర అంశాలపై చర్చించారు. శ్రీరామపాదక్షేత్రం ఆలయాల పునర్నిర్మాణ పనులను కూడా బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఏఎంసీ చైర్మన్ మండవ బాలవర్ధిరావు, ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ (జీకే), ఏఎంసీ మాజీ చైర్మన్ తుంగల కోటేశ్వరరావు, డీసీ చైర్మన్ అంబటి లక్ష్మణప్రసాద్, ఎంపీటీసీ తలశిల స్వర్ణలత, డీఈ ఎం.మారుతీప్రసాద్, లాఖిత కనస్ట్రక్షన్స్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కృష్ణమ్మకు హారతి
నాగాయలంక : ప్రధాన పుష్కరఘాట్‌లో గురువారం రాత్రి సమరసతసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులు కృష్ణమ్మకు హారతి ఇచ్చారు. ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులతో దీవి మురళీఆచార్యులు, ప్రభాకరశర్మ, తుర్లపాటి రామ్మోహనరావులు కృష్ణానదికి ప్రత్యేకపూజలు చేయించారు. కృష్ణమ్మకు చీర, పసుపు కుంకుమలతో సారె సమర్పించారు. నాగాయలంక, మర్రిపాలెం, బర్రంకుల టీ.కొత్తపాలెం, రేమాలవారిపాలెం, వక్కపట్లవారిపాలెం తదితర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. హారతుల్లో పాలుపంచుకోవడంతో కృష్ణాతీరం తీరం కిటకిటలాడింది. కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్.నరసింహారావు, ఎంపీటీసీ సభ్యురాలు తలశిల స్వర్ణలత, అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా, సీఐ ఎస్ఎస్వీ మూర్తి, బోయపాటి రాము ఫౌండేషన్ మండల శాఖ ధర్మప్రచారక్ పిరాటి శ్రీనివాసరావు, సంస్థ ఘాట్ కన్వీనర్లు ఎస్‌బీబీవీప్రసాద్, కేఎంఎస్ శేషుబాబు, రేమాల శ్రీనివాసరావు, ఆకురాతి బాబూరావు, శ్రీరామపాదక్షేత్రం కమిటీ, ఆర్యవైశ్య సంఘాల సభ్యులు, పలు స్వచ్ఛంద సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఉపసభాపతిగారూ.. పడిపోతున్నామయ్యా..
అవనిగడ్డ: నాలుగు గ్రామాలకు ప్రధాన రహదారి అది. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కార్యాలయానికి వెళ్లేందుకు ఈ దారే ప్రధాన ఆధారం. అంతటి ప్రాధాన్యమున్న ఈ తారురోడ్డును మట్టిరోడ్డుగా మార్చేశారు. కొత్తపేట రోడ్డులో ఉన్న రజకుల చెరువుకు పైపులైన్ వేసేందుకు వారం రోజుల క్రితం పనులు చేశారు. తూములు వేశాక మట్టిని తొలగించకుండా వదిలేశారు. కొన్నిచోట్ల మట్టిదిబ్బలను తొలగించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కరిగిపోవడంతో తారురోడ్డు మట్టిరోడ్డుగా మారిపోయింది. చినుకు పడితే ఈ దారిపై వెళ్లేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పుష్కర రహదారి ఇదే కొత్తపేట, రామకోటిపురం, తిప్పపాలెం, రామచంద్రపురం గ్రామాలతో పాటు డిఎస్సీ, గ్రూప్ పరీక్షలకు శిక్షణ పొందేవారితో నిత్యం ఆ రహదారి కిటకిటలాడుతుంది. మండలంలోనే అతిపెద్ద పుష్కరఘాట్ కొత్తపేటకు వెళ్లేందుకు ఈ రహదారే ఏకైక మార్గం. త్వరలో జరగనున్న పుష్కరాలకు ఈ మార్గంలో వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రెండు పెద్ద విద్యాసంస్థలతో పాటు రెండు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. తూముల కోసం వేసిన మట్టిని తొలగించక పోవడంతో వాహనాలు మట్టిలో దిగిపోతుండటంతో అవస్థలు పడుతున్నారు. ఉపసభాతి బుద్ధప్రసాద్ కార్యాలయం, ఇల్లు ఈ రహదారిలోనే ఉంది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారికి రెండు వైపులా ఉన్న మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మార్చి 1లోగా స్పీకర్‌కు నివేదిక
అసెంబ్లీ ఘటనలపై బుద్ధప్రసాద్ కమిటీ సమావేశం రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమన్న వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్: శాసనసభలో గత నెల 22న జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించిన అంశాలతోపాటు వీడియో ఫుటేజీ లీకే జీపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఫిబ్రవరి 5వ తేదీన మరోసారి సమావేశమై, నివేదికను రూపొందించనుంది. మార్చి 1వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోగా స్పీకర్‌కు నివేదికను అందించనుంది. కమిటీ సమావేశం మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన బుధవారం జరిగింది. కమిటీ పలు వీడియోలను వీక్షించింది. శాసనసభ సమావేశాల దృశ్యాలు కొన్ని బహిర్గతం కావడంపై అధికారులను వివరణ కోరింది. దీనిపై అధికారులు స్పందిస్తూ అసెంబ్లీ దృశ్యాలు సామాజిక మాధ్యమాలకు ఎలా చేరాయో తమకు తెలియదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సభ్యురాలు ఆర్కే రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమని ఆ పార్టీ తరపున కమిటీలో సభ్యుడైన శ్రీకాంత్‌రెడ్డి వాదించారు. నిబంధనల ప్రకారం రోజాను ఆ సమావేశాల వరకూ, లేదంటే సమావేశాల్లో కొన్ని రోజులు మాత్రమే సస్పెండ్ చేయాలన్నారు. అయితే బుద్ధప్రసాద్ సహా మిగిలిన సభ్యులు మాత్రం రోజా సస్పెన్షన్ వ్యవహారం కమిటీ పరిధిలో లేదని అడ్డుకున్నట్లు సమాచారం. సభలో రోజా ఒక్కరే అనుచిత వ్యాఖ్యలు చేశారన్నట్లుగా చిత్రీకరించడం సరికాదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు రికార్డుల్లోకి ఎక్కేవిధంగా చేసిన అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు, రికార్డుల్లోకి ఎక్కేందుకు వీలు కాకుండా చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన కమిటీ ముందు ఉంచినట్లు తెలిసింది. -
భాష ప్రతిష్టను గుర్తిస్తేనే మనుగడ
సాక్షి, హైదరాబాద్: ఏ జాతైనా తమ భాష ప్రతిష్టను గుర్తించినప్పుడే ఆ భాష అభివృద్ధి చెంది, మనగలుగు తుందని శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి తెలిపారు. 2020 నాటికి చాలా భాషలు కనుమరుగవుతాయని యునెస్కో హెచ్చరిస్తోందని, దీన్ని అందరూ గుర్తెరగా లని సూచించారు. శుక్రవారం రవీంద్రభారతిలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చక్రపాణి పైవిధంగా మాట్లాడారు. తర్వాత భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణం లాగా భాషావరణం తీసుకురావాల్సిన అవసరముందన్నారు. అనంతరం ‘మన తెలుగు’ పుస్తకాన్ని చక్రపాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2014 అధికార భాషా సంఘం విశిష్ట పురస్కారాలను చక్రపాణి చేతుల మీదుగా ఆచార్య పీఎస్ సుబ్రహ్మణ్యం, ఆచార్య వకుళా భరణం రామకృష్ణ, ఆంధ్రభారతి వెబ్సైట్ నిర్వాహకులు శేషసాయి, హెచ్ఎంటీవీ నుంచి కె.రామచంద్రమూర్తి, రెహనుమ-ఎ-దక్కన్ పత్రిక ప్రధాన సంపాదకులు జనాబ్ సయ్యద్ వికారుద్దీన్లకు అందజేశారు. పద్మశ్రీ పురస్కారం పొందిన ఆచార్య కొలకలూరి ఇనాక్‌ను అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. కవితాప్రసాద్, రాష్ట్ర మైనారిటీ కమిషన్ అధ్యక్షులు అబీబ్ రసూల్‌ఖాన్, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య కె.యాదగిరి, శాసనమండలి విప్ రుద్రరాజు పద్మరాజు పాల్గొన్నారు.