ఉపసభాపతిగారూ.. పడిపోతున్నామయ్యా..
అవనిగడ్డ:
నాలుగు గ్రామాలకు ప్రధాన రహదారి అది. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కార్యాలయానికి వెళ్లేందుకు ఈ దారే ప్రధాన ఆధారం. అంతటి ప్రాధాన్యమున్న ఈ తారురోడ్డును మట్టిరోడ్డుగా మార్చేశారు. కొత్తపేట రోడ్డులో ఉన్న రజకుల చెరువుకు పైపులైన్ వేసేందుకు వారం రోజుల క్రితం పనులు చేశారు. తూములు వేశాక మట్టిని తొలగించకుండా వదిలేశారు. కొన్నిచోట్ల మట్టిదిబ్బలను తొలగించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి కరిగిపోవడంతో తారురోడ్డు మట్టిరోడ్డుగా మారిపోయింది. చినుకు పడితే ఈ దారిపై వెళ్లేందుకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
పుష్కర రహదారి ఇదే
కొత్తపేట, రామకోటిపురం, తిప్పపాలెం, రామచంద్రపురం గ్రామాలతో పాటు డిఎస్సీ, గ్రూప్ పరీక్షలకు శిక్షణ పొందేవారితో నిత్యం ఆ రహదారి కిటకిటలాడుతుంది. మండలంలోనే అతిపెద్ద పుష్కరఘాట్ కొత్తపేటకు వెళ్లేందుకు ఈ రహదారే ఏకైక మార్గం. త్వరలో జరగనున్న పుష్కరాలకు ఈ మార్గంలో వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తుంటారు. రెండు పెద్ద విద్యాసంస్థలతో పాటు రెండు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. తూముల కోసం వేసిన మట్టిని తొలగించక పోవడంతో వాహనాలు మట్టిలో దిగిపోతుండటంతో అవస్థలు పడుతున్నారు. ఉపసభాతి బుద్ధప్రసాద్ కార్యాలయం, ఇల్లు ఈ రహదారిలోనే ఉంది. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారికి రెండు వైపులా ఉన్న మట్టిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.