భాష ప్రతిష్టను గుర్తిస్తేనే మనుగడ
Published Sat, Feb 22 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
సాక్షి, హైదరాబాద్: ఏ జాతైనా తమ భాష ప్రతిష్టను గుర్తించినప్పుడే ఆ భాష అభివృద్ధి చెంది, మనగలుగు తుందని శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి తెలిపారు. 2020 నాటికి చాలా భాషలు కనుమరుగవుతాయని యునెస్కో హెచ్చరిస్తోందని, దీన్ని అందరూ గుర్తెరగా లని సూచించారు. శుక్రవారం రవీంద్రభారతిలో అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా చక్రపాణి పైవిధంగా మాట్లాడారు. తర్వాత భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎన్.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణం లాగా భాషావరణం తీసుకురావాల్సిన అవసరముందన్నారు. అనంతరం ‘మన తెలుగు’ పుస్తకాన్ని చక్రపాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2014 అధికార భాషా సంఘం విశిష్ట పురస్కారాలను చక్రపాణి చేతుల మీదుగా ఆచార్య పీఎస్ సుబ్రహ్మణ్యం, ఆచార్య వకుళా భరణం రామకృష్ణ, ఆంధ్రభారతి వెబ్‌సైట్ నిర్వాహకులు శేషసాయి, హెచ్‌ఎంటీవీ నుంచి కె.రామచంద్రమూర్తి, రెహనుమ-ఎ-దక్కన్ పత్రిక ప్రధాన సంపాదకులు జనాబ్ సయ్యద్ వికారుద్దీన్‌లకు అందజేశారు.
పద్మశ్రీ పురస్కారం పొందిన ఆచార్య కొలకలూరి ఇనాక్‌ను అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్. కవితాప్రసాద్, రాష్ట్ర మైనారిటీ కమిషన్ అధ్యక్షులు అబీబ్ రసూల్‌ఖాన్, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య కె.యాదగిరి, శాసనమండలి విప్ రుద్రరాజు పద్మరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement