Buddha Rajasekhara Reddy
-
మహిళా సంఘాలపై ఎమ్మెల్యే కక్ష సాధింపు
ఆత్మకూరు: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. పోలీసులు, అధికారులను ఉసిగొల్పి తమను ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఎమ్మెల్యే అండతో పోలీసులు, మునిసిపల్ కమిషనర్ రమేష్‌బాబు దౌర్జన్యం చేయడంతో ప్రియదర్శిని మహిళా సంఘం అధ్యక్షురాలు షఫివున్ స్పృహ కోల్పోయి ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు పట్టణంలోని రామ్ రహీం రాబర్ట్ పట్టణ మహిళా సమాఖ్య పరిధిలో 36 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో ఆరు సంఘాలు ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతుండగా.. మిగిలిన 30 సంఘాలు వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డికి మద్దతుగా ఉన్నాయి. కాగా..కేవలం ఆరు సంఘాల మద్దతు ఉన్న సరోజ అనే మహిళను ఎమ్మెల్యే అండతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పట్టణ సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నిక చేశారు. సరోజ సోమవారం మునిసిపల్ కమిషనర్, పోలీసులను తీసుకెళ్లి మెప్మా కార్యాలయాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. కార్యాలయ తలుపులు మూసి ఉండడంతో తాళం పగులగొట్టేందుకు కమిషనర్ యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన సంఘాల సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కమిషనర్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గొడవ జరగడంతో షఫివున్ స్పృహ కోల్పోయింది. ఆమెకు బీపీ పడిపోవడంతో వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం షఫివున్ మాట్లాడుతూ శిల్పా చక్రపాణిరెడ్డికి మద్దతు ఇస్తున్నారంటూ తమపై కక్ష సాధిస్తున్నారని వాపోయారు. సంఘాల్లో లక్షలాది రూపాయల పొదుపు డబ్బు ఉందని, వారికి అప్పగిస్తే అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. -
నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
పార్టీ జిల్లా కార్యాలయంలో 10 గంటలకు జెండావిష్కరణ: బుడ్డా కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి తెలిపారు. పార్టీ ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటలకు కర్నూలు బిర్లాగడ్డ సమీపంలోని కృష్ణజ్యోత్స్న కాంప్లెక్స్‌లో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య పతాకావిష్కరణ, కేక్ కటింగ్ ఉంటుందన్నారు. ఆ తర్వాత కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సాయంత్రం కర్నూలు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కర్నూలు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎస్వీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బీఏఎస్ కల్యాణ మండపంలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. -
రాష్ట్రంలో హెచ్చుమీరిన అవినీతి
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి ధ్వజం కర్నూలు(ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. అధికారపార్టీ నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఎదుట నిలువెత్తు ధనరాశులు పోసి బేరమాడుతుండటం దారుణమన్నారు. టీడీపీ నాయకులు ప్రజాధనం లూటీ చేసి ప్రలోభాలకు దిగారన్నారు. పాలకులే భూ రాబంధుల అవతారమెత్తి రాజధాని ప్రాంతంలో 25 వేల ఎకరాల భూములను బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. దళిత రైతులను భయపెట్టి అసైన్డ్ భూములను దోచుకున్నారని చెప్పారు. టీడీపీలో ఎమ్మెల్యేల చేరికలు చంద్రబాబు మీద ప్రేమతో గానీ, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మీద వ్యతిరేకతతో గానీ జరగడం లేదన్నారు. డబ్బుల సంచుల అందడమే కారణమన్నారు. -
చంద్రబాబు గిమ్మిక్కులతో టీడీపీ బలపడదు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): చంద్రబాబు నీతి నేతి బీరకాయ చందంగా మారిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి విమర్శిం చారు. తెలంగాణాలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినప్పుడు వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో తాను చేస్తున్నదేంటని ప్రశ్నించారు. ఆయన మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నంత మాత్రాన టీడీపీ బలపడబోదన్నారు. రాజకీయ విలువలను తుంగలో తొక్కినందుకు సీఎం సిగ్గుపడాలని పేర్కొన్నారు. ధైర్యముంటే పదవికి రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. -
చంద్రబాబు అవినీతికి అడ్డూఅదుపులేదు
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి కర్నూలు(ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి విమర్శించారు. అవినీతికి అడ్డొచ్చిన అధికారులను స్థానభ్రంశం కల్పిస్తున్నారని, ఇందుకు తాజాగా నగరాభివృద్ధి, యాజమాన్యసంస్థ చైర్మన్ అజయజైన్పై వేటు వేయడమే ఉదాహరణ అన్నారు. సింగపూర్ సంస్థల ప్రతిపాదనలకు లొంగి ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్‌కు సిద్ధమవ్వడం సబబు కాదని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌ప్లాన్ అమలు విషయంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతు ం దని, కొన్ని శాఖల్లో ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. -
అసత్య ప్రచారం
పార్టీని ఎవరూ వీడటం లేదు ఇదంతా చంద్రబాబు మైండ్‌గేమ్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే యత్నం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి సాక్షి, కర్నూలు:జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీని వీడటం లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు భూమానాగిరెడ్డి, భూమా అఖిల ప్రియారెడ్డి.. టీడీపీలో చేరుతున్నట్లు అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి మైండ్ గేమ్ అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ బాబు తుంగలో తొక్కారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల్ని పక్కదోవ పట్టిం చేందుకు ఎలాంటి నీచ ప్రయత్నాలైనా చేయడానికి చంద్రబాబు వెనుకాడరు’ అని బుడ్డా ధ్వజమెత్తారు. అందులో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేరుతున్నారంటూ శుక్రవారం ప్రచారం మొదలెట్టారని విమర్శించారు. చంద్రబాబు మైండ్‌గేమ్ అడుతున్నారని, జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ వీడటం లేదని బుడ్డా స్పష్టం చేశారు. ‘ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలకే ఏ ఒక్క పని జరగడం లేదు. వారంతా అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే మా వైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మునిగే పడవ ఎవరైనా ఎక్కుతారా’ అని అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని పుకార్లు షికారు చేస్తున్న నేపథ్యంలో.. కర్నూలు, పాణ్యం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డిలు స్పందించారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తే లేదని చెప్పారు.