ఆత్మకూరు: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. పోలీసులు, అధికారులను ఉసిగొల్పి తమను ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఎమ్మెల్యే అండతో పోలీసులు, మునిసిపల్ కమిషనర్ రమేష్‌బాబు దౌర్జన్యం చేయడంతో ప్రియదర్శిని మహిళా సంఘం అధ్యక్షురాలు షఫివున్ స్పృహ కోల్పోయి ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆత్మకూరు పట్టణంలోని రామ్ రహీం రాబర్ట్ పట్టణ మహిళా సమాఖ్య పరిధిలో 36 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో ఆరు సంఘాలు ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతుండగా.. మిగిలిన 30 సంఘాలు వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డికి మద్దతుగా ఉన్నాయి.
కాగా..కేవలం ఆరు సంఘాల మద్దతు ఉన్న సరోజ అనే మహిళను ఎమ్మెల్యే అండతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా పట్టణ సమాఖ్య అధ్యక్షురాలిగా ఎన్నిక చేశారు. సరోజ సోమవారం మునిసిపల్ కమిషనర్, పోలీసులను తీసుకెళ్లి మెప్మా కార్యాలయాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. కార్యాలయ తలుపులు మూసి ఉండడంతో తాళం పగులగొట్టేందుకు కమిషనర్ యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న మిగిలిన సంఘాల సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కమిషనర్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గొడవ జరగడంతో షఫివున్ స్పృహ కోల్పోయింది. ఆమెకు బీపీ పడిపోవడంతో వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం షఫివున్ మాట్లాడుతూ శిల్పా చక్రపాణిరెడ్డికి మద్దతు ఇస్తున్నారంటూ తమపై కక్ష సాధిస్తున్నారని వాపోయారు. సంఘాల్లో లక్షలాది రూపాయల పొదుపు డబ్బు ఉందని, వారికి అప్పగిస్తే అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment