సంఘజీవిలా బతకాలి
మనుషులు రకరకాలు. కొందరు అందరితో కలివిడిగా ఉంటారు. కొందరు తమకు నచ్చిన కొందరితోనే స్నేహం చేస్తారు. ఇంకొందరు ఏ ఒక్కరితో కలవకుండా, ఎవ్వరినీ కలుపుకోకుండా తమకు తాముగా ఒంటరిగానే బతుకుతుంటారు. బౌద్ధసంఘంలో కూడా కొందరు భిక్షువులు ఇలాగే ఉండేవారు. సంఘంలో ఇతర భిక్షువులకు ఎలాంటి సహాయ సహకారాలూ అందించేవారు కాదు. అలాంటి వారు శ్రావస్తిలో ఆరుగురున్నారు. వారిని షడ్వర్గీయ భిక్షువులంటారు. అక్కడే మహానాగుడు అనే భిక్షువు ఉండేవాడు. అతను ఏ భిక్షువుకి ఏ అవసరం వచ్చినా కల్పించుకుని మరీ సహాయం చేసేవాడు. అందరితో స్నేహంతో మెలిగేవాడు.
అందరి విషయాలు నీకెందుకు, నీవేమైనా సంసారివా? మన పని మనమే చూసుకోవాలి. అని ఎప్పడూ మహానాగుణ్ణి నిందించేవారు షడ్వర్గీయులు. పైగా వారంతా వెళ్లి ఈ విషయం బుద్ధునితో చెప్పారు. మహానాగుణ్ణి మందలించమన్నారు. అప్పుడు బుద్ధుడు– ‘‘భిక్షువులారా! మనిషికంటే సంఘం గొప్పది. సంఘంలో అందరూ ఒకరికోసం మరొకరు కృషి చేయాలి. సహాయ సహకారాలు అందించుకోవాలి. ప్రతివ్యక్తీ అందరికీ మిత్రుడు కావాలి.
సమాజంలో అందరితో కలసి మెలసి మైత్రి సలిపే వ్యక్తి సముద్రజలాల్లో బతికే చేపలాంటివాడు. ఆ జలాలు ఎప్పుడూ ఎండవు. అలాకాక ఏ కొందరితోనో స్నేహంగా బతికేవాడు చెరువు లో చేపలాంటివాడు. ఆ జలాలు కొంతకాలమే ఉంటాయి. ఇక, ఏకాంతంగా, ఒంటరిగా బతికేవాడు ఒడ్డున పడ్డ చేపలాంటివాడు’’ అని చెప్పాడు.భిక్షువుకి ఉండాల్సిన సామాజిక బాధ్యత ఏమిటో మిగిలిన వారికి అర్థమైంది. మహానాగుణ్ణి అనుసరించి, అందరికీ తలలో నాలుకలా మెలిగారు.