నిలువనీడలేదు
భవనం కూలిన దుర్ఘటనలో రోడ్డుపాలైన తెలుగు కుటుంబాలు
పరిచయస్తులు, బంధువులు.. ఇలా తలోచోట తలదాచుకుంటున్న వైనం
భివండీ, న్యూస్‌లైన్ : నాలుగు రోజులగా నిలకడలేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేశాయి. సర్వం కోల్పో దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొందరు బంధువులు, పరిచయస్తుల ఇళ్లలో ఆశ్రయం పొందగా, మరికొందరు అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలో తలదాచుకున్నారు. సోమవారం కురిసిన వర్షం కారణంగా ప్రభాగ్ సమితి మూడు పరిధిలో గల పద్మనగర్ ప్రాంతంలోని పుల్లి నారాయణ మూడంతస్తుల భవనం ఉదయం కుప్ప కూలిన విషయం తెలిసిందే.
ఈ దుర్ఘటనలో సుమారు 40 తెలుగు కుంటుంబాలు వీధులపాలయ్యాయి. కూలిన భవన యజమాని ఎలాంటి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నాడు..ఇల్లు కోల్పోయిన తమకు నష్ట పరిహారం ఎవరు చెలిస్తారని? ఇళ్లు కొనుగోలు చేసుకొని సంవత్సారాలు దాటినప్పటికీ ఇంటి యజమాని రిజిస్ట్రేషన్ చేసివ్వలేదు. మా పరిస్థితి ఎలా ? అని కన్నీటి పర్యంతమాయ్యారు.
బాధితుల ఆవేదన వారి మాటల్లోనే..
యజమానితోపాటే కార్పొరేషన్ నిర్లక్ష్యం
వేముల రామదాస్ బిల్డింగ్‌లో 900 చదరపు మీటర్ల మూడు రూములను కొనుగోలు చేసుకొని ఇక్కడే స్తిర పడ్డాను. పుల్లి నారాయణ భవనం పిల్లర్ పగులు పట్టిన వెంబడే ఆ భవనాన్ని కార్పొరేషన్ కూల్చినట్లైయితే పక్కనే ఉన్న మా భవనం పై పడేది కాదు. ఈ రెండు భవనాల మధ్య సందులో బాత్రూమ్ల పైప్ లైన్లు పగిలిపోయాయి. సుమారు 10 సంవత్సరాలుగా నీరంతా పునాదిలోకి వెళ్లినా భవన యజమానులు పట్టించు కోలేదు. పైప్ లైన్లు మరమ్మతులు చేపిస్తామని ప్రతి ఇంటి వద్ద 4 వేల రూపాయలు వసూలు చేసినా పనులు చేయలేదు. ఇప్పడు మా పరిస్థితి రోడ్డున పడింది.
- జక్కని రాములు, కోనార్పేట, కరీంనగర్ జిల్లా
మేం రోడ్డున పడ్డాం
రామదాస్ భవనంలో 2006 సంవత్సరంలో ఇల్లు కొనుగోలు చేశాం. నా భర్త పవర్లూమ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. నేనే దుస్తులు కుట్టే పని చేస్తాను. ఇలా భార్యాభర్తలం కష్టపడుతూ పిల్లలను చదివించుకుంటుంన్నాం. పని చేయక పోతే ఇల్లు గడిచేది కష్టంగా ఉన్న మా కుటుంబం ఒక్కసారిగా వీధుల పాలైంది. పక్కన ఉన్న భవనం కూలి మేం రోడ్డున పడ్డాం. మాకు ఎవరు న్యాయం చేస్తారు అర్థం కావటం లేదు. ఇప్పటి వరకు ఆ భవనం యజమాని మా ఇంటికి రిజిస్ట్రేషన్ చేసిఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో దుర్ఘటన సంభవించింది. నాల్గు రోజుల నుంచి అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలో తలదాచుకుంటున్నాం.
- రాపెల్లి అనిత బాలకృష్ణ
నష్టపరిహారం ఎవరిస్తారు?
1990 సంవత్సరంలో రామదాస్ భవనంలో ఇండ్లు కొనుకున్నాం. మాకు ఇద్దరు పిల్లలు కాలేజీకి వెళుతున్నారు. నా భర్త చిన్న టీ కొట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అకస్మాత్తుగా భవనం ఖాలీ చేయించిన కార్పొరేషన్ అధికారులు ఎలాంటి వసతులు కల్పించ లేదు. అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలో తల దాచుకుంటుంన్నాం. పక్కన భవనం కూలి మా భవనంపై పడితే దీనికి నష్ట పరిహారం ఎవరు చెలిస్తారని ? మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు.. ఎవరు ఆదుకుంటారు?
-పూజారి లక్ష్మీ విశ్వనాథ్, మేగుళూర్
ఇంటికి రిజిస్ట్రేషన్ చేయలేదు
1990 లో రామదాస్ భవనంలో ఇల్లు కొనుగోలు చేశా. ఇప్పటి వరకు మాకు రిజిస్ట్రేషన్ చేయలేదు. నేను దర్జీగా విధులు నిర్వహిస్తూ మా కుంటుంబాన్ని పోషించుకుంటున్నా. గత నాలుగు నెలల క్రితమే పెండ్లి అయిన కొడుకు మృతి చెందాడు. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో మాకు దిక్కులేకుండా పోయింది. ఇప్పుడు మేం వీధుల పాలయ్యాం. మాకు న్యాయం ఎవరు చేస్తారు. అక్రమంగా మూడంతస్తుల భవనం నిర్మించిన యజమానే మాకు నష్ట పరిహారం చెల్లించాలి. కూలిన భవనం పక్కనే ఉన్న తమ భవనం పై పడితే, మాకు న్యాయం చేయాల్సింది ఆ యజమానే. కానీ మాకు న్యాయం చేసేదెవరు? -మిట్టపల్లి సత్తయ్య, సిరిసిల్ల
రూ. 12 లక్షణ నష్టం
1996 సంవతాసరం నుంచి పుల్లి నారాయణ భవనంలోని కింది అంతస్తులో 10 పవర్లూమ్ యంత్రాలను వేసుకొని వ్యాపారం చేస్తున్నా. ప్రస్తుతం ఈ భవనం భూమిలోకి ఇంకి పోయింది. సుమారు 12 లక్షల రూపాయల నష్టం వాటిల్లడమే గాకుండా మా కుటుంబ సభ్యులకు బతుకు దెరువు లేకుండా పోయింది. ఎలా బతుకాలి ? మాకు న్యాయం ఎవరు చేస్తారు ? ఇట్టి భవనంపై అక్రమంగా మూడు అంతస్తుల భవన నిర్మాణాలుట చేపటుతున్నప్పుడు యజమాని పుల్లి తిరుపతి తో విచారించగా కార్పొరేషన్ అనుమతి తీసుకొనే నిర్మించానని బుకాయించాడు. ఇప్పుడు కార్పొరేషన్ వారు పట్టించుకునే పరిస్థితి లేవు. మాకు న్యాయం చేయాలి. - బొల్లు రవీందర్
చర్యలు తీసుకోవాలి
333 గల భవనానికి ముగ్గురం యజమానులం. ఇందులో ఇళ్లు కొనుగోలు చేసుకున్న వారి గురించి త్వరలో అందరితో సమావేశం నిర్వహించి వీరందరికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. పక్క భవనం కూలి మా భవనం పై పడితే దీనికి భాధ్యులం మేమా ? మేం ఇల్లు విడిచి దగ్గరి బంధువుల ఇంట్లో ఎన్నాలని ఉండాలి. పక్కన భవన యజమానిపై కార్పొరేషన్, సంబంధిత అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. నష్ట వాటిల్లిన వారికి పరిహారం చెల్లించాలి.
-వేముల రాందాస్
నేను అప్పట్లో నిరాకరించా
పుల్లి నారాయణ భవనాన్ని సుమారు 20 సంవత్సరాల క్రితం భవనాన్ని నిర్మానాలు చేపట్టినప్పడు ఇంజనీర్ సలహాలతోనే యజమాని చెప్పిన విధంగా నిర్మించాను. మూడు సంవత్సరాల క్రితం యజమాని పుల్లి నారాయణ మూడో అంతస్తు నిర్మాణానికై బిల్డర్‌కు ఇవ్వగా అప్పుడు నేను నిరాకరించా. కార్పొరేషన్ అధికారులను కట్టుకొని అక్రమంగా మూడంతస్తుల భవనం నిర్మాణం చేపట్టడంతోనే అధిక బరువుకు అది కుప్పకూలింది. దీనికి బాధ్యత కార్పొరేషన్ అధికారులా? కార్పోరేషన్ అధికారులా, యజమాని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
-భారత వెంకటయ్య