burglaries
-
Hyderabad: పండగ ప్రయాణాలపై పోలీసుల అలర్ట్.. సోషల్ పోస్టులొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్ టూర్లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. ఎందుకంటే మీరు తిరిగొచ్చేసరికి మీ ఇల్లు గుల్లయ్యే ప్రమాదముంది.’ అంటూ పోలీసులు నగర పౌరులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల నేరస్తులు సైతం తెలివిమీరి సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఊరెళ్లిన వారి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు. ► మీరు ఊరెళుతున్న విషయాన్ని స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ► ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని, వాటి డీవీఆర్లు బయటికి కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉంచాలి. ► సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ► బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకులో భద్రపర్చుకోండి. లేదా ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. ► ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలి. ► కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నంబరులో సమాచారం ఇవ్వాలి. -
ఖాలీద్ కన్నుపడితే..
కరీంనగర్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు ఖాలీద్ గ్యాంగ్ ఇటీవల నగర శివారులో ఓ విద్యార్థినిని చెరబట్టింది. కరీంనగర్ క్రైం : కరీంనగర్‌కు చెందిన కరుడుగట్టిన నేరస్తుడు ధూం ఖాలీద్ నగర శివారు ప్రాంతాల్లో మాటువేసి రేప్‌లు, దోపిడీలు చేస్తుంటాడు. ఇప్పటికి పదుల సంఖ్యలో అమ్మారుులను చెరబట్టిన ఇతడి గ్యాంగ్ ఇటీవల ఓ ఇంటర్ విద్యార్థినిని చెరిచింది. నగరానికి చెందిన విద్యార్థిని పెద్దపల్లి బైపాస్ రోడ్డు ప్రాంతంలో వెళ్తుండగా.. ఖాలీద్, అతడి అనుచరులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. అనంతరం ఖాలీద్‌తో అనుచరులకు గొడవ జరగడంతో అతడిపై దాడి చేసి కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఖాలీద్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కాళ్లకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఓ కాలిని తొలగించాల్సి వస్తున్నట్లు సమాచారం. ఖాలీద్తోపాటు అతడి అనుచరులు పోలీసు శాఖలోని కొంతమంది బంధువుల అండతో రెచ్చిపోతున్నట్లు ఆరోపణలున్నారుు. అలాగే ఓ రాజకీయ పార్టీ నాయకులు వారి ఆగడాలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలున్నారుు. కాగా.. తాజా ఘటన నేపథ్యంలో పోలీసులు ఖాలీద్ గ్యాంగ్‌పై నిర్భయ కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా వీరిని కఠినంగా శిక్షించాలని పలువురు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. -
దొంగల ముఠా ఆటకట్టు
జల్సాల కోసం దోపిడీలు ఐదుగురి నిందితుల అరెస్టు చోరీ సొత్తు స్వాధీనం శంషాబాద్ రూరల్ : బైక్‌లపై తిరుగుతూ అర్ధరాత్రి వేళ దారి దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఐదుగురు నిందితుల్లో ఓ బాలు డు ఉన్నాడు. వివరాలిలా ఉన్నాయి. కొన్నాళ్లుగా హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాకు చెందిన ఎం.డి.హైమద్, ఎం,.డి.సమీ, మైలార్‌దేవ్‌పల్లిలోని శాస్త్రీపురం వాసి ఎం.డి.అఫ్రోజ్‌ఖాన్, కాలాపత్తర్‌కు చెందిన ఎం.డి.ఖదీర్తోపాటు 17ఏళ్ల బాలుడు జల్సాలకు అలవాటై దోపిడీలకు పాల్పడుతున్నారు. హైమద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. అఫ్రోజ్‌ఖాన్ ఆటోడ్రైవర్ కాగా సమీ, ఖదీర్ ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. వీరంతా తరచూ రాత్రివేళ రెండు బైక్‌లపై దోపిడీకి బయలుదేరతారు. రహదారుల వెంబడి తిరుగుతూ నిర్జన ప్రదేశంలో వాహనాలను ఆపి దారిదోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి శంషాబాద్ మండలంలో రెండు వేర్వేరు చోట్ల ఇదే తరహాలో చోరీ చేశారు. అదేరోజు కందకూరు మండలం చెవులపల్లికి చెందిన కె.కృష్ణ తన ఆటోట్రాలీలో కూరగాయల లోడుతో షాద్‌నగర్ నుంచి నల్గొండ వెళుతున్నాడు. శంషాబాద్ మండలం బుర్జుగడ్డతండా సమీపంలోని పీ-వన్ వద్దకు చేరుకోగానే ఈ ముఠా అడ్డుకుంది. కత్తులతో బెదిరించి కృష్ణ నుంచి తులం బంగారుగొలుసు, రూ.4,800తోపాటు సెల్‌ఫోన్‌ను దోచుకున్నారు. దుండగులు అక్కడి నుంచి పాల్మాకుల మీదుగా బెంగళూరు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం బండగొండకు చెందిన నారాయణరెడ్డి, మద్దూరు మండలం చెన్వారం రైతు వెంగల్రెడ్డి కలిసి బొలేరో వాహనంలో బత్తాయి పండ్లను హైదరాబాద్ నగరంలోని కొత్తపేట మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. పెద్దషాపూర్ వద్దకు రాగానే ఈ దోపిడి ముఠా వీరి వాహనాన్ని అడ్డుకుంది. బెదిరించి నారాయణరెడ్డి వద్ద రూ.పది వేలతో పాటు సెల్‌ఫోన్, వెంగల్రెడ్డి నుంచి రూ.నాలుగు వేలు, సెల్‌ఫోన్ దోచుకున్నారు. మరో ఐదు ఠాణాల పరిధిల్లో... ఈ దోపిడీ ముఠా శంషాబాద్‌తోపాటు ఇబ్రహీపట్నం, నా ర్సింగ్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వివిద ప్రాంతాల్లో ఇదే తరహాలో దోపిడీలకు పాల్పడింది. సెల్ఫోన్లు, నగదు, బంగారు నగలతోపాటు బైక్‌లను దోచుకున్నారు. ఈ సంఘటనలు అన్నీ గత నెలలోనే చోటుచేసుకోగా చివరిసారిగా శంషాబాద్ ప్రాంతంలో జరగడం గమనార్హం. ఈ మేరకు ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోద య్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు బుధవారం నిందితులను అదుపులోకి తీసుకునివిచారణచేపట్టగా ఈ దొంగతనాలకు పాల్పడింది తామేనని అంగీకరించారు. దీంతో వారి నుంచి ఏడు బైక్‌లు, ఆరు సెల్ఫోన్లు, రూ.13 వేలు, తులం బంగారుగొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఎముకలతో నూనె తయారుచేస్తున్న నలుగురి రిమాండ్ ధారూరు:పశువుల ఎముకలు, కొవ్వు తో నూనె తయారుచేసిన కేసులో బుధవారం నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజులుగా ధారూరు మండలం మైలారం శివారు అటవీప్రాంతంలోని మద్దులపల్లి కృష్ణ పొలంలో కొందరు వ్యక్తులు పశువుల ఎముకలు, కొవ్వు తో నూనె తయారు చేస్తున్నారు. దీని పై మైలారం గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వికారాబాద్ సబ్‌కలెక్టర్ అలుగు వర్షిణి, పోలీసులు ఈనెల 14న ఈ స్థావరంపై దాడిచేశారు. ఈ ప్రాంతంలో ఎముకలు, కొవ్వుతోపాటు డీసీఎం, నూనె తయారుచేసేం దుకు అమర్చిన సామగ్రిని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. ఈ మేరకు మోమిన్‌పేట్ సీఐ ఎన్వీ రంగా, ధారూరు ఎస్ఐ ఎం.మల్లేశం కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు బుధవారం ఈ నూనె తయారీలో ప్రధాన సూత్రదారులైన వికారాబాద్ పట్టణం కొత్తగడికి చెందిన ఆసీఫ్, హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా వాసి రహీమ్‌తోపాటు డీసీఎం యజమాని ఖాజాపాషా, పొలం యజమాని ఎం. కృష్ణను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించారు. -
బ్రహ్మచారులతో తస్మాత్ జాగ్రత్త!
ఇళ్లు అద్దెకు తీసుకుని వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను విజయనగరం జిల్లా సాలూరులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, 6 తులాల బంగారం, సెల్ఫోన్లు, 3 లక్షల రూపాయల విలువైన రంగురాళ్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో విద్యార్థులమని, ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నామంటూ అద్దెకు వచ్చే బ్రహ్మచారులతో జాగ్రత్తగా ఉండాలని సీసీఎస్ డీఎస్పీ ఏఎస్ చక్రవర్తి తెలిపారు. గుర్తింపు కార్డులు తీసుకోకుండా ఎవరికీ ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దని ఆయన ఇళ్ల యజమానులకు సూచించారు. -
విమానాల్లో వచ్చి చోరీ.. ఆ కిక్కే వేరబ్బా!
బైకుపై వచ్చి గొలుసు దొంగతనాలు, మామూలుగా పిల్లిలా వచ్చి ఇళ్లలో దొంగతనాలు చేయడం మనకు తెలుసు. కానీ విమానాల్లో వచ్చి దొంగతనం చేసి మళ్లీ అంతే వేగంగా విమానాల్లో చెక్కేసే దొంగను ఎక్కడైనా చూశారా? అలాంటి దొంగను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ చోర కళా కోవిదుడు చెప్పిన వివరాలు విన్న పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. దొంగతనాలు చేయడానికి ఒక ఊరి నుంచి మరో ఊరికి విమానాల్లో వెళ్లడం అతగాడి స్పెషాలిటీ. ఏదో పనిమీద విమానంలో వెళ్లి, పనిలో పనిగా దొంగతనాలు చేయడం కాదు.. కేవలం చోరీల కోసమే విమాన ప్రయాణాలు చేస్తాడు మనోడు!! హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు చదువులో మహా చురుకు. ఎంబీబీఎస్‌లో సీటు కూడా సంపాదించాడు. రేపో మాపో వైద్య వృత్తిలో ప్రవేశించాల్సిన అతడు.. జీవితంలో కొత్తదనాన్ని కోరుకున్నాడు. పుస్తకాలు పక్కన పెట్టి చోరమార్గం ఎంచుకున్నాడు. ఇళ్లలో దొంగతనాలు చేస్తుండగా అందులోనూ 'కిక్' కావాలనుకున్నాడు. అలా వైద్యుడి (నకిలీ) అవతారం ఎత్తాడు. కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రులకు కారులో వెళ్లి ...రోగులతో మీ ఆరోగ్యం తర్వలో కుదుటపడుతుందని మీకేం పర్వాలేదు నేనున్నాను అంటూ వారికి, వారి బంధువులకు సాంత్వన కల్పిస్తూనే నగలు, నగదు క్షణాలలో మాయం చేసేవాడు. అతగాడి దెబ్బకు బెంగళూరు, కోయంబత్తూరులోని ఆస్ప్తత్రులలో పలువురు రోగులు, వారి బంధువులు బాధితులుగా మారి... పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఈ కొత్త రకం చోరీలేంటిరా బాబూ అంటూ పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత సదరు నకిలీ వైద్యుడు విజయవాడలోని పలు ఆసుపత్రులలో కూడా ప్రదర్శించాడు. దాంతో బాధితులు విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కర్ణాటక, తమిళనాడు పోలీసుల సమన్వయంతో ఎట్టకేలకు ఛేదించారు. నకిలీ వైద్యుడ్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించగా.... విమానాలలో వెళ్లి మరీ దొంగతనాలు చేసేవాడినని చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు. -
ఎట్టకేలకు పట్టుబడ్డ కుణిగల్ గిరి
హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్ : అంతర్ రాష్ట్ర దొంగల ముఠా నాయకుడు గిరీష్ అలియాస్ కుణిగల్ గిరి అలియాస్ మోదురు గిరి, అతని అనుచరులను ఆదివారం హిందూపురం పోలీసులు పట్టుకున్నారు. కుణిగల్ గిరి స్థానికంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని చెప్పుకుంటూ తెర వెనుక వ్యవహారం నడిపేవాడు. ఇతనిది కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా హోసూరు గ్రామం. దాదాపు 75 కేసుల్లో ప్రధాన నిందితుడు. ఇతని ముఠాను పట్టుకోవడానికి కర్ణాటక పోలీసులు మూడు ప్రత్యేకృబందాలుగా రంగంలోకి దిగారు. ఇతను 15 రోజుల క్రితం హిందూపురం పట్టణంలోని ఆరవిందనగర్‌లో ఓ ఇంటి పైఅంతస్తును అద్దెకు తీసుకున్నాడు. తన అనుచరులు ముగ్గురితో కలసి ఉండేవాడు. వారంతా ఉదయాన్నే కర్ణాటకలో డ్యూటీలంటూ వెళ్లి రాత్రి ఇంటికి చేరుకునేవారు. కర్ణాటక ప్రాంతంలో దోపిడీలు, దొంగతనాలు, బెదిరింపులు, ఇసుక దందాలు వంటివి చేసేవారు. కాగా, శనివారం రాత్రి 11 గంటల సమయంలో కుణిగల్ గిరి కెనిటిక్ బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని 108 సిబ్బంది ఆస్పత్రిలో చేర్చారు. వివరాలు చెప్పలేని స్థితిలో ఉండగా అతని వద్ద ఏదైనా ఆధారం లభిస్తుందేమోనని సోదా చేశారు. ఒక తపంచా, బుల్లెట్లు, కె.ప్రశాంత్ పేరుతో డ్రైవింగ్ లెసైన్సు లభ్యమయ్యాయి. వెంటనే వారు హిందూపురం వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణకు సమాచారం అందించారు. ఆయన హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ముందు తప్పుడు అడ్రెస్ చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నించాడు. పోలీసులు గట్టిగా విచారణ చేయడంతో అసలు విషయం బయట పడింది. వెంటనే కర్ణాటకలోని తుమకూరు నేరవిభాగం పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కూడా హిందూపురం చేరుకున్నారు. సంయుక్తంగా గిరి ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. అతని అనుచరులైన మంజునాథ్, గోవిందు, వాసులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు తపంచాలు, బెల్లెట్లు, సుమారు రూ.8 లక్షల నగదు, దాదాపు అరకిలో బంగారు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారిని కర్ణాటక పోలీసులు బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోని బెవనహళ్లి వద్ద గోవిందు మూత్రవిసర్జన అంటూ వాహనాన్ని ఆపించి పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. కాళ్లలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అతన్ని తిరిగి పట్టుకుని బెంగళూరుకు తరలించారు. కుణిగల్ గిరి ముఠా సుమారు మూడు నెలలుగా పట్టణంలోనే వివిధ ప్రాంతాల్లో ఉంటూ చివరగా ఆరవింద్‌నగర్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని హత్య చేయడానికి ఈ ముఠా స్కెచ్ వేసిందనే వదంతులు పట్టణంలో విన్పించాయి. ‘అక్బరుద్దీన్ ఓవైసీని హత్య చేయడానికి కుట్రపన్నిన ముఠాను అరెస్టుచేసిన స్థానిక పోలీసులకు అభినందనలు’ అంటూ స్థానిక ఎంఐఎం నాయకులు పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం గమనార్హం. అయితే..దీన్ని స్థానిక పోలీసులు కొట్టిపారేస్తున్నారు. నిఘా వైఫల్యం : కర్ణాటక ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ పక్కనే ఉన్న హిందూపురంలో మకాం పెడుతున్నా నిఘా విభాగం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం బెంగళూరు ఏటీఎం నిందితుడు హిందూపురం వచ్చి సెల్‌ఫోన్‌ను విక్రయించి దర్జాగా జారుకున్నాడు. ఇప్పుడు కుణిగల్ గిరి ముఠా పట్టుబడింది. దీన్నిబట్టే నేరగాళ్లకు హిందూపురం షెల్టర్ జోన్‌గా మారిందనే విషయం స్పష్టమవుతోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులైన రాహుల్‌గాంధీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి, నందమూరి బాలకృష్ణ.. ఇలా ముఖ్యులు హిందూపురం వచ్చినప్పుడు పోలీసులు అంతా కంట్రోల్లోనే ఉందని చెప్పుకున్నారు. అయితే..వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉండడంతో పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. -
వినియోగదారుల కోసం స్పెషల్‌డ్రైవ్
మరో నాలుగు రోజుల్లో ప్రారంభం సంస్థలు, సేవల మోసాలపై ఫిర్యాదుకు అవకాశం పోలీసుస్టేషన్లలో ప్రత్యేక ఫిర్యాదు రిజిస్టర్లు మార్చి 11 వరకు డ్రైవ్ 12న జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కారం సాక్షి, సిటీబ్యూరో: దొంగతనాలు, దోపిడీలు, ఆర్థిక నేరాలు, దాడులు... ప్రస్తుతం ఈ తరహా నేరాల్లో బాధితులైన వారు మాత్రమే పోలీసుస్టేషన్లకు వస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో నగర పోలీసులు ప్రారంభించనున్న స్పెషల్‌డ్రైవ్‌తో మోసపోయామనో, నష్టపోయామనో భావించిన వినియోగదారులు కూడా ఠాణాలకు వెళ్లొచ్చు. దీనికి సంబంధించి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చేసిన కీలక ప్రతిపాదనలకు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ డ్రైవ్ మార్చి 11 వరకు కొనసాగనుంది. ‘లీగల్ అథారిటీ’ కీలక సూచనతో... పోటీ ప్రపంచంలో వ్యాపారస్థులు, సంస్థలు గుప్పిస్తున్న హామీలను చూసి అనేక మంది వినియోగదారులు కొనుగోలుదారులుగా మారుతున్నారు. మరికొన్ని సంస్థలు చేసే ప్రకటనల ఆధారంగా వీటిలో సభ్యులుగా చేరుతున్నారు. ఆనక మోసపోయామని తెలిసినా ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియని స్థితిలో నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. అతి తక్కువ మంది మాత్రమే వినియోగదారుల ఫోరం వంటి వాటిని ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోకుండా ఉండటంతో పాటు బాధ్యులైన వారికి బుద్ధిచెప్తున్నారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కేవలం వినియోగదారుల సమస్యల పైనే మార్చి 12న భారీ స్థాయిలో ఓ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రతువులో నగర పోలీసుల్నీ భాగస్వాముల్ని కావాలని సూచించడంతో కమిషనర్ అనురాగ్‌శర్మ అంగీకారం తెలిపారు. రిజిస్టర్ల ఏర్పాటుకు నిర్ణయం ప్రస్తుతం ఠాణాల్లో ఉండే జనరల్ డైరీ, ఎఫ్ఐఆర్ ఇండెక్స్ మాదిరిగానే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రిజస్టర్లు ఏర్పాటు చేస్తారు. ఈ విషయంపై మాల్స్‌తో పాటు పబ్లిక్ ప్రదేశాలు, వ్యాపార కేంద్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తారు. తాము చెల్లించిన సొమ్ముకు తగిన విలువైన వస్తువు/సేవ వ్యాపారస్థుడు, సంస్థ నుంచి పొందలేదని భావించిన వినియోగదారులు పూర్తి వివరాలు, ఆధారాలతో వ్యాపార సంస్థ, కొనుగోలు చేసిన ప్రాంతం ఉన్న ఏరియా స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా వచ్చిన ఫిర్యాదుల్ని అక్కడ ఉండే సిబ్బంది ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఆ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను ఏరోజుకారోజు నివేదిక రూపంలో లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపిస్తారు. మార్చి 11 వరకు డ్రైవ్ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని ప్రాథమికంగా పరిశీలించి పోలీసులు అందించే నివేదికల ఆధారంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సమన్లు జారీ చేస్తుంది. ఫిర్యాదు చేసిన వినియోగదారులతో పాటు ఆరోపణలున్న వ్యాపారస్థులు/సంస్థలు/వాటి ప్రతినిధుల్ని మార్చి 12న జరిగే వినియోగదారుల లోక్ అదాలత్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఆ రోజే ఈ ఫిర్యాదుల్లో ఉన్న సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తుంది. నగర పోలీసు విభాగం చేపట్టే ఈ స్పెషల్‌డ్రైవ్ మార్చ్ 11 వరకు కొనసాగునుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనలతో బుధవారం ఈ నిర్ణయం తీసుకోగా... అథారిటీ నుంచి అధికారంగా మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు అందనున్నాయి. ఇవి వచ్చిన తరవాత ఠాణాల్లో రిజిస్టర్ల ఏర్పాటు, ప్రచారం తదితరాలకు కొత్వాల్ ఆదేశాలు జారీ చేస్తారు.