- మరో నాలుగు రోజుల్లో ప్రారంభం
- సంస్థలు, సేవల మోసాలపై ఫిర్యాదుకు అవకాశం
- పోలీసుస్టేషన్లలో ప్రత్యేక ఫిర్యాదు రిజిస్టర్లు
- మార్చి 11 వరకు డ్రైవ్
- 12న జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కారం
సాక్షి, సిటీబ్యూరో: దొంగతనాలు, దోపిడీలు, ఆర్థిక నేరాలు, దాడులు... ప్రస్తుతం ఈ తరహా నేరాల్లో బాధితులైన వారు మాత్రమే పోలీసుస్టేషన్లకు వస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో నగర పోలీసులు ప్రారంభించనున్న స్పెషల్‌డ్రైవ్‌తో మోసపోయామనో, నష్టపోయామనో భావించిన వినియోగదారులు కూడా ఠాణాలకు వెళ్లొచ్చు. దీనికి సంబంధించి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చేసిన కీలక ప్రతిపాదనలకు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ బుధవారం ఆమోదం తెలిపారు. ఈ డ్రైవ్ మార్చి 11 వరకు కొనసాగనుంది.
‘లీగల్ అథారిటీ’ కీలక సూచనతో...
పోటీ ప్రపంచంలో వ్యాపారస్థులు, సంస్థలు గుప్పిస్తున్న హామీలను చూసి అనేక మంది వినియోగదారులు కొనుగోలుదారులుగా మారుతున్నారు. మరికొన్ని సంస్థలు చేసే ప్రకటనల ఆధారంగా వీటిలో సభ్యులుగా చేరుతున్నారు. ఆనక మోసపోయామని తెలిసినా ఎక్కడ, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియని స్థితిలో నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. అతి తక్కువ మంది మాత్రమే వినియోగదారుల ఫోరం వంటి వాటిని ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోకుండా ఉండటంతో పాటు బాధ్యులైన వారికి బుద్ధిచెప్తున్నారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కేవలం వినియోగదారుల సమస్యల పైనే మార్చి 12న భారీ స్థాయిలో ఓ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రతువులో నగర పోలీసుల్నీ భాగస్వాముల్ని కావాలని సూచించడంతో కమిషనర్ అనురాగ్‌శర్మ అంగీకారం తెలిపారు.
రిజిస్టర్ల ఏర్పాటుకు నిర్ణయం
ప్రస్తుతం ఠాణాల్లో ఉండే జనరల్ డైరీ, ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్ మాదిరిగానే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రిజస్టర్లు ఏర్పాటు చేస్తారు. ఈ విషయంపై మాల్స్‌తో పాటు పబ్లిక్ ప్రదేశాలు, వ్యాపార కేంద్రాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తారు. తాము చెల్లించిన సొమ్ముకు తగిన విలువైన వస్తువు/సేవ వ్యాపారస్థుడు, సంస్థ నుంచి పొందలేదని భావించిన వినియోగదారులు పూర్తి వివరాలు, ఆధారాలతో వ్యాపార సంస్థ, కొనుగోలు చేసిన ప్రాంతం ఉన్న ఏరియా స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా వచ్చిన ఫిర్యాదుల్ని అక్కడ ఉండే సిబ్బంది ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఆ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను ఏరోజుకారోజు నివేదిక రూపంలో లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపిస్తారు.
మార్చి 11 వరకు డ్రైవ్
వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని ప్రాథమికంగా పరిశీలించి పోలీసులు అందించే నివేదికల ఆధారంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సమన్లు జారీ చేస్తుంది. ఫిర్యాదు చేసిన వినియోగదారులతో పాటు ఆరోపణలున్న వ్యాపారస్థులు/సంస్థలు/వాటి ప్రతినిధుల్ని మార్చి 12న జరిగే వినియోగదారుల లోక్ అదాలత్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఆ రోజే ఈ ఫిర్యాదుల్లో ఉన్న సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తుంది. నగర పోలీసు విభాగం చేపట్టే ఈ స్పెషల్‌డ్రైవ్ మార్చ్ 11 వరకు కొనసాగునుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీ సూచనలతో బుధవారం ఈ నిర్ణయం తీసుకోగా... అథారిటీ నుంచి అధికారంగా మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు అందనున్నాయి. ఇవి వచ్చిన తరవాత ఠాణాల్లో రిజిస్టర్ల ఏర్పాటు, ప్రచారం తదితరాలకు కొత్వాల్ ఆదేశాలు జారీ చేస్తారు.