జనాభా ప్రాతిపదికన మాకు సీట్లివ్వాలి
* ఏపీ మున్నూరుకాపు మహాసభ ఉపాధ్యక్షుడు కొండూరి డిమాండ్
సాక్షి, హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన మున్నూరుకాపులకు రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలను ఆంధ్రప్రదేశ్ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండూరి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్నూరుకాపు యువకమండలి ప్రధాన కార్యదర్శి బూర్గుభావి రాంమోహన్ ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ కాచిగూడలోని మున్నూరుకాపు భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా మున్నూరుకాపులున్నా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో రాజకీయపార్టీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని కొండూరి ఆరోపించారు. ఓట్లకోసం మున్నూరుకాపులను వాడుకుంటూ సీట్ల విషయంలో పట్టించుకోవట్లేదని విమర్శించారు. మున్నూరుకాపులను నిర్లక్ష్యం చేసే పార్టీలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మణికొండ వెంకటేశ్వర్రావు, ఆది నాగేష్, దత్తుమూర్తి, గంప బ్రిజ్మోహన్, బండారు శ్రీధర్, అల్లం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.