యూఎస్‌లో మరోదాడి.. మళ్లీ మనవాళ్లే టార్గెట్
ప్లోరిడా: అమెరికాలో మరో జాత్యహంకార దాడి జరిగింది. మొన్న భారతీయులపై జరగగా నేడు ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. దానిని కాల్చివేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే, ఆ స్టోర్ భారత సంతతి పౌరులదని తనకు తెలియదని అరబ్ దేశానికి చెందిన ముస్లింలదని అనుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వలసలను అడ్డుకునేందుకు చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి తొలుత దాడులు భారతీయులపైనే ఎక్కువవుతున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. రిచర్డ్ లాయిడ్ అనే 64 ఏళ్ల వ్యక్తి దర్జాగా దుకాణానికి నిప్పుపెట్టి చేతులు వెనక్కి పెట్టుకొని అది తగులబడుతుంటే నవ్వుతూ నిల్చున్నాడు. తమ దేశంలో అరబ్ దేశాలకు చెందిన ముస్లిలు అస్సలు ఉండొద్దనేది తన కోరిక అని అందులో భాగంగానే ఆ స్టోర్‌ను తగులబెట్టేందుకు ప్రయత్నించానని చెప్పాడు. తనను అరెస్టు చేసుకోవచ్చంటూ పోలీసులకు స్వయంగా చెప్పాడు. అతడికి ఉన్న అభిప్రాయంపట్ల అక్కడి అధికారులు విచారం వ్యక్తం చేశారు.
ఒక పౌరుడికి అరబ్ ముస్లింలపై కోపం ఉండటం దురదృష్టం అని, అది భారతీయ సంతతి పౌరులను చూసి అరబ్స్ అనుకొని దాడికి దిగడం మరింత బాధాకరం అని మాస్కారా అనే అధికారి తెలిపారు. గతంలో శ్రీనివాస్ కూచిబొట్లపై జరిగిన దాడిని కూడా ఆయన ప్రస్తావించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లగా 30వేల డాలర్ల బాండు ఇవ్వాలని ఆదేశించడంతోపాటు జైలుకు తరలించాలని ఆదేశించింది.