ప్రియుడిపై అనుమానం.. ఫుల్‌గా తాగి ఇంటినే తగలెట్టేసింది
బ్యాంకాక్: ఓ బంధమైనా నమ్మకం, విధేయత ఉంటే కలకలం కొనసాగుతుంది. చిన్న అనుమానమనే నిప్పు రవ్వ పడితే క్షణాల్లో మాడిపోతుంది. ఓ మహిళ తన ప్రియుడు తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. మరో ఆలోచన లేకుండా బాయ్‌ఫ్రెండ్ గదినే తగలెట్టేసింది. ఈ సంఘటన థాయ్‌లాండ్‌లో వెలుగుచూసింది.
పట్టాయా ప్రాంతానికి చెందిన డొన్లాయా నాలీ అనే మహిళ.. తన బాయ్‌ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని అనుమానం పెంచుకుంది. అదే ఆలోచనతో రగిలిపోయింది. అది నిజమేనా, కాదా? అనే ఆలోచన కూడా చేయలేదు. ఫూటుగా మద్యం తాగి మత్తులో తన ప్రియుడి ఇంటికి వెళ్లి అతడు ఉండే గదికి నిప్పంటించింది. ఈ సంఘటన నవంబర్ 26న జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది.
అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే గది మొత్తం కాలిపోయింది. ఇతర రూముల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ క్రమంలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మాట్లాడిన బాధితుడు ‘మరో మహిళతో సంబంధం ఉందనే కోపంతోనే ఇలా చేసింది. నిప్పంటించే ముందే నాపై దాడి చేసింది.’ అని తెలిపాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? అనేది తెలపలేదు.
ఇదీ చదవండి: శత్రు డ్రోన్లకు చెక్ పెట్టేలా గద్దలకు శిక్షణ.. కంటపడితే అంతే..!