burnt death
-
క్షుద్ర పూజల కలకలం.. కూకట్‌పల్లిలో సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీకాలనీ: శ్మశాన వాటికలో సగం కాలిన స్థితిలో కనిపించిన మృతదేహం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి ఉంటారని భావిస్తున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా దగ్ధమైన మృతదేహం ఎవరిదనే సీఐ కిషన్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదర్‌నగర్‌లోని అలీతలాబ్ పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి 20 మీటర్ల దూరంలో చెప్పులు, ఓ బ్యాగ్, అందులో రగ్గు(బెడ్ షీట్) స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బ్యాటరీ, సిమ్ కార్డు లేని ఓ సెల్ ఫోన్‌ను కూడా గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చునని అతడిని హత్య చేసి దహనం చేసి ఉండవచ్చునని అనుమాన్యం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైబరాబాద్ క్లూస్ టీంతో పాటు పోలీస్ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే... శ్మశాన వాటికలో మృతదేహం లభించిన తీరు మొదలు అక్కడి ఆనవాళ్లు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం దహనం చేసి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉండవచ్చునని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. -
ఆప్ నేత దారుణ హత్య!
లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు నవీన్ దాస్(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బోప్రా ప్రాంతంలోని లోని- సహీదాబాద్ రోడ్డు మార్గం గుండా కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బోప్రాలో ఓ కారుకు నిప్పంటించి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి పోలీసులు మంటలార్పి లోపల ఉన్న వ్యక్తిని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. కారు నంబరు ఆధారంగా మృతుడిని ఆప్ నేత నవీన్ దాస్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇది ముమ్మాటికి ప్రత్యర్థుల పనే..! తన సోదరుడి ఎదుగుదలను ఓర్చుకోలేకే ప్రత్యర్థులు అతడిని దారుణంగా చంపారని నవీన్ దాస్ సోదరి ఆరోపించారు. రాత్రి 12 గంటలకు ఫోన్ రావడంతో అతడు బయటికి వెళ్లాడని, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నవీన్ దాస్‌ను కారులోకి ఎక్కించి, బయటి నుంచి లాక్ చేసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నవీన్ దాస్ కుటుంబాన్ని పరామర్శించారని అతడి స్నేహితులు తెలిపారు. -
గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
ఆనవాలు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం నాయుడుపేట టౌన్ : వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి సమీపంలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేసి ఆనవాలు తెలియకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన పట్టణంలోని తుమ్మూరు సమీపంలో బుధవారం వెలుగుచూసింది. గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు సమాచారం మేరకు.. తుమ్మూరు స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన చంద్రకళ అనే మహిళ నివాసం ఏర్పాటు చేసుకుని బీడీ బంకు నిర్వహించుకుంటుంది. తన ఇంటి ముందు సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేసి తగులబెట్టినట్లుగా 100కు సమాచారం అందడంతో స్థానిక సీఐ రత్తయ్యతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పీవీ నారాయణ, రవినాయక్, మారుతికృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న మరో బంకు వెనుక అతనిపై తీవ్రంగా రాయితో దాడి చేసి గొంతునులిమి ఊపిరాడకుండా హత్యచేసి ఎండిన తాటిఆకులు, ప్లాస్టిక్ పట్టలు వేసి మృతదేహాన్ని కాల్చివేసి ఉండడాన్ని గుర్తించామన్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పోలీసుల పరిశీలన స్థానిక సీఐ రత్తయ్య ఆధ్వర్యంలో పోలీసు అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు నుంచి బిందు అనే జాగిలంతో ప్రాథమిక ఆధారాల కోసం గాలించారు. హత్య జరిగిన ప్రదేశం నుంచి జాగిలం రోడ్డు పక్కన తగులబెట్టిన మృతదేహం వద్దకు వెళ్లింది సమీపంలో శిథిలస్థితిలో తాటి ఆకులతో కప్పి ఉన్న గుడిసె లోపలికి వెళ్లి చుట్టుపక్కల తిరిగింది. అక్కడి నుంచి నేరుగా అన్నమేడు రైల్వేగేటు దాటుకుని వెళ్లి ఓ చెట్టుకింద నిలబడింది. శిథిలస్థితిలో ఉన్న గుడిసెలో పెయింటర్ నాగరాజు అనే వ్యక్తి రోజు మద్యం సేవించి వచ్చి అక్కడ నిద్రించేవాడని చంద్రకళ పోలీసులకు వివరించింది. అయితే ఆ వ్యక్తి పరారీ కావడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్‌టీం ఎస్సై శరత్‌బాబు హత్య జరిగిన ప్రదేశంలో క్షుణంగా పరిశీలన చేశారు. మృతుడిని బండరాయితో మోదినప్పుడు అక్కడ పడి ఉన్న దంతాలను సైతం పరిశీలించారు. సమీపంలో మద్యం బాటిళ్లు తదితర వస్తువులు, మృతుడి చెప్పులను క్లూస్ టీం పోలీసులు గుర్తించారు. మోటార్ బైక్ కీ, వాటర్ బాటిళ్లు సైతం గుర్తించారు. అయితే బంకు వెనుక హత్యచేసి నిత్యం వాహన రాకపోకలు జరిపే రహదారి పక్కన తీసుకువచ్చి ఓ ఇంటి ముందు పడేసి కాల్చివేయడంపై పోలీసులు పలు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం పడి ఉన్న ఇంటి వద్ద నివాసం ఉంటున్న చంద్రకళ ఆమె భర్త రమేష్‌ను సీఐతో పాటు పోలీసులు పూర్తిస్థాయిలో విచారించారు. మృతుడు ఆనవాలు తెలియకుండా చేసిన వైనం మృతుడు ఫుల్ హ్యండ్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడి కుడిచేతికి ఎరుపు రంగు ధారంతో పాటు స్వాములు ధరించే పూసలతాడు తెగిపోయి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. -
గత ఏడాది అత్యాచారం..ఇపుడు హత్య
సంబల్: ఉత్తరప్రదేశ్‌లోని సంబర్ జిల్లాలో దారుణం జరిగింది. గత ఏడాది అత్యాచారానికి గురైన 17 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడే.. బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం అహ్రౌలా నవాజీ గ్రామానికి చెందిన విజయ్ గత ఏడాది ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే అతని స్నేహితునితో కలిసి మంగళవారం బాలికపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం స్థానిక అలీఘర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందింది. కాగా నిందితులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. మరోవైపు విజయ్‌పై రేప్ కేసు పెట్టామనే కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్, అతని స్నేహితుడు రాజేంద్రతో కలిసి తమ కూతురిని పొట్టన పెట్టుకున్నారని వారు ఆవేదన వక్తం చేశారు.