గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
-
ఆనవాలు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం
నాయుడుపేట టౌన్ : వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే జాతీయ రహదారి సమీపంలోనే ఓ గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేసి ఆనవాలు తెలియకుండా పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన పట్టణంలోని తుమ్మూరు సమీపంలో బుధవారం వెలుగుచూసింది. గూడూరు డీఎస్పీ శ్రీనివాసులు సమాచారం మేరకు.. తుమ్మూరు స్వర్ణముఖి బ్రిడ్జి సమీపంలో రోడ్డు పక్కన చంద్రకళ అనే మహిళ నివాసం ఏర్పాటు చేసుకుని బీడీ బంకు నిర్వహించుకుంటుంది. తన ఇంటి ముందు సుమారు 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని హత్యచేసి తగులబెట్టినట్లుగా 100కు సమాచారం అందడంతో స్థానిక సీఐ రత్తయ్యతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పీవీ నారాయణ, రవినాయక్, మారుతికృష్ణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న మరో బంకు వెనుక అతనిపై తీవ్రంగా రాయితో దాడి చేసి గొంతునులిమి ఊపిరాడకుండా హత్యచేసి ఎండిన తాటిఆకులు, ప్లాస్టిక్ పట్టలు వేసి మృతదేహాన్ని కాల్చివేసి ఉండడాన్ని గుర్తించామన్నారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పోలీసుల పరిశీలన
స్థానిక సీఐ రత్తయ్య ఆధ్వర్యంలో పోలీసు అధికారులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు నుంచి బిందు అనే జాగిలంతో ప్రాథమిక ఆధారాల కోసం గాలించారు. హత్య జరిగిన ప్రదేశం నుంచి జాగిలం రోడ్డు పక్కన తగులబెట్టిన మృతదేహం వద్దకు వెళ్లింది సమీపంలో శిథిలస్థితిలో తాటి ఆకులతో కప్పి ఉన్న గుడిసె లోపలికి వెళ్లి చుట్టుపక్కల తిరిగింది. అక్కడి నుంచి నేరుగా అన్నమేడు రైల్వేగేటు దాటుకుని వెళ్లి ఓ చెట్టుకింద నిలబడింది. శిథిలస్థితిలో ఉన్న గుడిసెలో పెయింటర్ నాగరాజు అనే వ్యక్తి రోజు మద్యం సేవించి వచ్చి అక్కడ నిద్రించేవాడని చంద్రకళ పోలీసులకు వివరించింది. అయితే ఆ వ్యక్తి పరారీ కావడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్‌టీం ఎస్సై శరత్‌బాబు హత్య జరిగిన ప్రదేశంలో క్షుణంగా పరిశీలన చేశారు. మృతుడిని బండరాయితో మోదినప్పుడు అక్కడ పడి ఉన్న దంతాలను సైతం పరిశీలించారు. సమీపంలో మద్యం బాటిళ్లు తదితర వస్తువులు, మృతుడి చెప్పులను క్లూస్ టీం పోలీసులు గుర్తించారు. మోటార్ బైక్ కీ, వాటర్ బాటిళ్లు సైతం గుర్తించారు. అయితే బంకు వెనుక హత్యచేసి నిత్యం వాహన రాకపోకలు జరిపే రహదారి పక్కన తీసుకువచ్చి ఓ ఇంటి ముందు పడేసి కాల్చివేయడంపై పోలీసులు పలు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం పడి ఉన్న ఇంటి వద్ద నివాసం ఉంటున్న చంద్రకళ ఆమె భర్త రమేష్‌ను సీఐతో పాటు పోలీసులు పూర్తిస్థాయిలో విచారించారు.
మృతుడు ఆనవాలు తెలియకుండా చేసిన వైనం
మృతుడు ఫుల్ హ్యండ్ షర్ట్ ధరించి ఉన్నాడు. మృతుడి కుడిచేతికి ఎరుపు రంగు ధారంతో పాటు స్వాములు ధరించే పూసలతాడు తెగిపోయి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.