ఉత్తరప్రదేశ్లోని సంబర్ జిల్లాలో దారుణం జరిగింది.
సంబల్: ఉత్తరప్రదేశ్లోని సంబర్ జిల్లాలో దారుణం జరిగింది. గత ఏడాది అత్యాచారానికి గురైన 17 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడే.. బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం అహ్రౌలా నవాజీ గ్రామానికి చెందిన విజయ్ గత ఏడాది ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలోనే అతని స్నేహితునితో కలిసి మంగళవారం బాలికపై దాడి చేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం స్థానిక అలీఘర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందింది. కాగా నిందితులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రమోద్ కుమార్ వెల్లడించారు. మరోవైపు విజయ్పై రేప్ కేసు పెట్టామనే కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్, అతని స్నేహితుడు రాజేంద్రతో కలిసి తమ కూతురిని పొట్టన పెట్టుకున్నారని వారు ఆవేదన వక్తం చేశారు.