Bus burnt
-
జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు దగ్ధం
చిట్యాల: నల్లగొండ జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని వనస్థలిపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులోకి రాగానే బస్సు టైర్ పేలిపోయి మంటలు లేచాయి. ప్రమాద సమయంలో బస్సులోని 25 మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి, బస్సులోని ప్రయాణికులను లేపటంతో వారంతా లగేజీలతో బస్సులోంచి కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించి, పూర్తిగా దగ్ధమైంది. వెంటనే ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. బస్సు దగ్ధమైన సంఘటనపై ఫిర్యాదు అందలేదని చిట్యాల పోలీసులు తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ట్రావెల్స్ బస్సు దగ్ధం
లింగాలఘణపురం: వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల బైపాస్ రోడ్డుపై బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బస్సులోని 26 మంది ప్రయాణికులు డ్రైవర్ అఫ్జల్ అహ్మద్ షేక్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్పూర్ నుంచి ఆదివారం రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ బయలుదేరిన ఏసీ కోచ్ బస్సు మర్నాడు తెల్లవారు జామున 5.30 గంటలకు నెల్లుట్ల బైపాస్ సమీపానికి చేరుకుంది. అదే సమయంలో ఇంజన్‌లోనుంచి పొగతోపాటు వాసన రావడంతో డ్రైవర్‌కు అనుమానం వచ్చి రోడ్డు పక్కన ఆపి దిగి చూశాడు. పొగలు ఎక్కువ కావడంతో నీళ్లు పోసినా ఫలితం లేకపోవడంతో ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేసి కిందికి దింపాడు. కొద్ది నిమిషాల్లోనే బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. కొంతమంది లగేజీ కూడా కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ రఘుచందర్, ఎస్సై దేవేందర్ ఆధ్వర్యంలో ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్‌కు తరలించారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
నల్లగొండ క్రైం: నల్లగొండ సమీపంలోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు లేచి బస్సు పూర్తిగా కాలిపోయింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న గాయత్రీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నల్లగొండ మండలం చర్లపల్లి వద్దకు వచ్చిన సమయంలో ముందునుంచి పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను లగేజీతో సహా కిందికి దింపాడు. అనంతరం బస్సు ఇంజెన్ వైర్ల షార్ట్ సర్క్యూట్‌తో పొగలు రావడాన్ని గమనించి ఆర్పేందుకు యత్నించాడు. ఇసుక, నీటిని పోసి పొగలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరింత ఎక్కువగా వస్తుండటంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే మంటలు చెలరేగి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. పోలీసులు, అగ్నిమాపక అధికారులు వచ్చే లోపే బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక అధికారులు మంటలను చల్లార్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
బస్సులను తగలబెట్టిన మావోయిస్టులు
-
వోల్వో బస్సుకు మంటలు.. చిన్నారి మృతి
-
బస్సుకు మంటలు.. చిన్నారి మృతి
కర్ణాటకలో ఘోరం జరిగింది. హుమ్నాబాద్ ప్రాంతంలో ఒక స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి.. మూడేళ్ల చిన్నారి సజీవ దహనం అయిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన విహాన్ అనే చిన్నారి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 36 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 8 మంది పిల్లలు ఉన్నారని ప్రమాదానికి సజీవ సాక్షి అయిన ప్రభాకరరెడ్డి 'సాక్షి'కి తెలిపారు. కావేరి ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్, క్లీనర్ మంటలు వచ్చాయని అరుచుకుంటూ దిగి పారిపోయారు. షిర్డీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఈ బస్సు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో హుమ్నాబాద్ సమీపంలోకి చేరుకున్నప్పుడు ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో కొంతమంది మాత్రం కిందకు దూకేశారు. దగ్గరలో ఉన్న రాళ్లు తీసుకుని అద్దాలు పగలగొట్టి మిగిలిన వాళ్లను కిందకు తీసుకురావడానికి ప్రయత్నించారు. అందరూ కిందకు వచ్చినట్లు ప్రయాణికులు భావించారు గానీ వాళ్లు దిగే సమయానికి మూడేళ్ల చిన్నారి విహాన్ మాత్రం బస్సులోనే ఉండిపోయాడు. దాంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రయాణికులంతా కట్టుబట్టలతో మిగిలిపోయారు. -
ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం
కడప : కడప జిల్లాలోని విజయదుర్గా కాలనీలో సోమవారం ప్రమాదవశాత్తు బస్సు దగ్ధమైంది. నగరంలోని విజయదుర్గాకాలనీలో ఉన్న వెల్డింగ్ షాప్‌లో మైదకూరుకు చెందిన వీఆర్ కాలేజీ బస్సుకు వెల్డింగ్ చేస్తున్నారు. వెల్డింగ్ చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో బస్సుకు నిప్పంటుకుని కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.5లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో వెల్డింగ్ చేస్తున్న మెకానిక్ మహబూబ్ బాషాకు స్పల్ప గాయాలయ్యాయి. మెకానిక్ షెడ్ పూర్తిగా కాలిపోయింది. కాగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
మూలపాడు వద్ద బస్సు దగ్ధం
-
తుమ్మలపాలెం చెక్‌పోస్ట్ వద్ద బస్సు దగ్ధం
ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులను ఇబ్రహీం పట్నంలోనే దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. మరమ్మతులు చేయిద్దామని తీసుకువెళుతుండగా, తుమ్మలపాలెం చెక్‌పోస్టు వద్దకు వచ్చేసరికి బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏమీ జరుగలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని క్షణాల్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది.