బస్సుల కొనుగోలుకు ఆర్టీసీకి రూ.150 కోట్లు
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్టీసీకి రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తంతో ఆర్టీసీ 500 బస్సులు కొనుగోలు చేయబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1613 బస్సులు పాతబడిపోయాయి. వాటి స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు వెచ్చించే పరిస్థితిలో ఆర్టీసీ లేదు. గతేడాది సీఎం కె. చంద్రశేఖర్‌రావుతో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు ఇదే విషయాన్ని వెల్లడించారు.
దీంతో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఆ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. ఇందులో రూ.80 కోట్లతో 400 పల్లెవెలుగు బస్సులు, రూ.70 కోట్లతో 20 ప్రీమియం బస్సులు (వోల్వో, బెంజ్ తరహా), 80 ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులు కొనాలని నిర్ణయించారు. ఓల్వో బస్సులకు ప్రభుత్వ వాటాగా రూ.17.5 కోట్లు... ఇటీవల హైదరాబాద్‌లో 80 వోల్వో బస్సులు రోడ్డుపైకొచ్చాయి. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలోని ప్రీమియం కేటగిరీ కింద వీటిని కేంద్రం మంజూరు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా మార్జిన్ మనీ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం రూ.17.5 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వు జారీ చేసింది.