Business Correspondent
-
ఆర్థిక మోసాలపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం కేవైసీ నిబంధనలను కఠినతరం చేయడం, బిజినెస్ కరెస్పాండెంట్లను (బీసీ) చేర్చుకునేటప్పుడు మదింపు ప్రక్రియను మరింత పటిష్టం చేసేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సూచించడం మొదలైన అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించే వ్యాపారులు, బిజినెస్ కరెస్పాండెంట్ల (బీసీ) మదింపు ప్రక్రియను పటిష్టం చేయడమనేది మోసాల నివారణతో పాటు ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు దోహదపడగలదని వివరించాయి. సాధారణంగా వ్యాపారులు, బీసీల వద్దే డేటా ఉల్లంఘనలకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థాయిలోనే డేటాకు భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. సైబర్ మోసాలకు హాట్‌స్పాట్స్‌గా ఉన్న ప్రాంతాల్లో బీసీలు ఎక్కువగా ఉండటాన్ని, వారి ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను పునఃసమీక్షించుకోవాలని, మోసాల్లో ప్రమేయమున్నట్లుగా తేలిన మైక్రో ఏటీఎంలను బ్లాక్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక మోసాల నివారణపై ఇటీవల జరిగిన అంతర్–మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ మేరకు సూచనలు వచి్చనట్లు పేర్కొన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం 2023లో రూ. 7,489 కోట్ల సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించి 11,28,265 కేసులు నమోదయ్యాయి. -
తెలుగు రాష్ట్రాల్లో 1,600 మంది బిజినెస్ కరస్పాండెంట్లు
న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంకు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొత్తగా 1,600 మంది బిజినెస్ కరస్పాండెంట్స్ (బీసీ)ను నియమించుకోనుంది. బ్యాంక్ ఖాతాలు తెరవడం, ఇంటి వద్దకే బ్యాంకింగ్, ఏటీఎంల ఏర్పాటు, మొండిబాకీల రికవరీ మొదలైన వాటికి వీరి సేవలను వినియోగించుకోనుంది. 2019 జనవరి 31 నాటికల్లా బీసీల నియామకాలు జరిపే ప్రక్రియ పర్యవేక్షణ కోసం కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్స్ (సీబీసీ) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆంధ్రా బ్యాంక్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) ప్రచురించింది. దీని ప్రకారం 2019 మార్చి ఆఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 922 మంది, తెలంగాణలో 695 మంది బీసీలను నియమించుకోనుంది. బ్యాంకులకు అనుసంధానమైన స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) మొదలైన వాటికి బీసీ ఏజెంట్లుగా నియామకంలో ప్రాధాన్యం ఉంటుందని బ్యాంకు వివరించింది. బ్యాంకు ఆమోదించిన.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు, రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, కిరాణా షాప్ ఓనర్లు, ప్రజా పంపిణీ వ్యవస్థలో పనిచేస్తున్న డీలర్లు, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ మొదలైన వారు కూడా దీనికి అర్హులు. ప్రస్తుతం సీబీసీ విధానంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, బిహార్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రా బ్యాంకు సుమారు 2,200 మంది బిజినెస్ కరస్పాండెంట్స్‌ను నియమించుకుంది. -
నగదు పరిమితుల నుంచి క్రెడిట్ కార్డు చెల్లింపులకు మినహాయింపు
న్యూఢిల్లీ: నగదు లావాదేవీలు రూ. 2 లక్షలకు మించకూడదన్న పరిమితులపై కేంద్రం స్పష్టతనిచ్చింది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు నియమించిన బిజినెస్ కరస్పాండెంట్ల లావాదేవీలు, ప్రీపెయిడ్ సాధనాలు జారీ చేసే సంస్థలకు దీన్నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఆదాయ పన్ను విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నగదు లావాదేవీల పరిమితి నుంచి అయిదు రకాల సంస్థలకు మినహాయింపు లభిస్తుంది. సహకార బ్యాంకు లేదా బ్యాంకు తరఫున నియమితులైన బిజినెస్ కరస్పాండెంట్ రూ. 2 లక్షలకు మించి నగదు జమ లావాదేవీలు నిర్వహించవచ్చు. అలాగే, ఒకటి లేదా అంతకు మించిన క్రెడిట్ కార్డులకు సంబంధించి రూ.2 లక్షలకు మించి క్రెడిట్ కార్డు కంపెనీలకు నగదు రూపంలో చెల్లించవచ్చు. రూ.2 లక్షల పరిమితి అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 1 నాటి నుంచే తాజా నిబంధన కూడా అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలని జూలై 3 తేదీ నాటి నోటిఫికేషన్లో రెవెన్యూ విభాగం పేర్కొంది. నికార్సయిన లావాదేవీలు నిర్వహించే వారికి ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ మినహాయింపులు కల్పిస్తున్నట్లు తెలిపింది. సెక్షన్ 269ఎస్టీ ప్రకారం ఒక్క రోజులో ఒకటి లేదా అంతకు మించిన లావాదేవీలకు సంబంధించి ఏ వ్యక్తీ రూ. 2 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరపరాదు. దీన్ని ఉల్లంఘిస్తే నగదు అందుకున్న వారు 100 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.