జోరుగా మంచినీటి వ్యాపారం
మదనపల్లెలో నెలకు రూ.2.13కోట్ల వ్యాపారం
ట్యాంకరు నీళ్లు రూ.700
30 ట్యాంకర్లు, 60 ట్రిప్పులుగా వ్యాపారం
మదనపల్లె: జిల్లాలో ఎక్కడా లేని విధంగా మదనపల్లెలో నెలకు దాదాపు రూ.2.13 కోట్ల వరకు మంచినీటి వ్యాపారం జరుగుతోంది. పట్టణంలో భూగర్భ జలా లు పూర్తిగా అడుగంటిపోవడంతో శివారు ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేయాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులు 29 ట్యాంకుల ద్వారా రోజుకు 403 ట్రిప్పుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ.306 చొప్పున ప్రైవేటు వారికి చెల్లిస్తున్నారు. ఈ మొత్తం రోజుకు దాదాపు రూ.1.50 లక్షలు అవుతోంది.
అంటే నెలకు రూ.45 లక్షలు. అదేవిధంగా ప్రైవేటు ట్యాంకర్లైతే ఒక్కో ట్యాం కు నీళ్లను రూ.600 నుంచి రూ.700 వరకూ విక్రయిస్తున్నారు. పట్టణంలో దాదాపు 40 ట్యాంకర్లకు పైగా ఉన్నాయి. ఒక్కో ట్యాంకరు రోజుకు 20 ట్రిప్పులు వరకూ తోలుతున్నాయి. అంటే దాదాపుగా 800 ట్రిప్పులు. రోజుకు రూ.5.60 లక్షల వ్యాపారం ప్రైవే టు ట్యాంకర్ల ద్వారా జరుగుతోంది.
అంటే నెలకు రూ.1.68 కోట్లు, ఇటు మున్సిపాల్టీ, అటు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని నెలకు రూ.2.13 కోట్లు వ్యాపారం జరుగుతోంది. ప్రస్తుతం మున్సిపల్ కొళాయిల ద్వారా 10 రోజులకు, 15 రోజులకు ఒకసారి సరఫరా జరుగుతుండటంతో ప్రైవేటు ట్యాంకర్ల వ్యాపా రం సిరులు కురిపిస్తోంది. పట్టణ శివారు ప్రాంతాల నుంచి ట్యాంకరు యజమానులు నీటిని కొనుగోలు చేస్తున్నారు. బోర్ల వద్ద ట్యాంకరు నీరు రూ.300 చొప్పున కొనుగోలు చేసి, పట్టణంలో రూ.700 చొప్పున విక్రయిస్తున్నారు.
అడుగంటిన భూగర్భజలాలు
మదనపల్లె పట్టణంలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఒకప్పుడు 600 నుంచి 700 అడుగుల్లో ఉన్న నీటిమట్టం ప్రస్తుతం 1200 నుంచి 1300 అడుగులకు పడిపోయింది. మున్సిపల్ పవర్ బోర్లు 11, హ్యాండ్ బోర్లు 12 మాత్రమే పనిచేస్తున్నాయి. గతంలో ఇవి పవర్ బోర్లు 94, హ్యాండ్బోర్లు 62 పనిచేసేవి. వరుణదేవుడు కరుణిస్తే తప్పా సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.