Business Index
-
భారత్ ‘సేవలు’ భేష్...
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఫిబ్రవరిలో చక్కటి పనితీరు ప్రదర్శించింది. దేశ ఎకానమీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 59.4 వద్ద ముగిసింది. గత 12 ఏళ్లలో ఈ స్థాయి పురోగతి ఇదే తొలిసారి. దేశంలో డిమాండ్ పరిస్థితులు, కొత్త వ్యాపారాలు ఊపందుకోవడం వంటి అంశాలు దీనికి కారణమని గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లో ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సూచీ జనవరిలో 57.2 వద్ద ఉంది. అయితే ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ ప్రాతిపదికన చూస్తే, సేవల రంగం వరుసగా 19 నెలల నుంచి వృద్ధిలోనే కొనసాగుతోంది. కాగా, ఉపాధి అవకాశాల పరిస్థితులు మాత్రం ఇంకా మందగమనంలోనే ఉన్నట్లు డీ లిమా తెలిపారు. సేవలు–తయారీ కలిపినా... పురోగతి! తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా ఫిబ్రవరిలో పటిష్ట స్థాయిలో 59 వద్దకు చేరింది. జనవరిలో సూచీ 57.5 వద్ద ఉంది. ఇది 11 ఏళ్ల గరిష్టం. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం సూచీ ఫిబ్రవరిలో 55.3 వద్ద ఉంది. జనవరికన్నా (55.4) సూచీ స్వల్పంగా వెనుకబడింది. -
ఈ-కామర్స్‌లోకి జీఎస్టీ పరిధిలోకి రాని వ్యాపార సంస్థలు!
న్యూఢిల్లీ: జీఎస్టీ వ్యవస్థ పరిధిలోకి రాని వ్యాపార సంస్థలను, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో వ్యాపారానికి అనుమతించడం అన్నది వాటికి మేలు చేస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఈ కామర్స్ రూపంలో చిన్న సంస్థలు సైతం ప్రయోజనం పొందొచ్చన్నారు. ప్రభుత్వం రూపొందిస్తున్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ) ప్లాట్‌ఫామ్ విజయవంతం అయ్యేందుకు జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం కీలకమైనదిగా అభివర్ణించారు. ఇది చిన్న రిటైలర్లను కూడా ఈ కామర్స్ పరిధిలోకి తీసుకొస్తుందన్నారు. చిన్న సంస్థలకు సైతం ఈ కామర్స్ అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఓఎన్డీసీ ఏర్పాటును ప్రతిపాదించడం గమనార్హం. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. కట్, పాలిష్డ్ వజ్రాలపై జీఎస్టీ రేట్ల క్రమద్ధీకరణ నిర్ణయం ఆ రంగం వృద్ధిని ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కామర్స్ పోర్టళ్ల ద్వారా ఒక రాష్ట్రం పరిధిలో సరఫరా చేసే సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో వస్తు విక్రయాల టర్నోవర్ రూ.40 లక్షల్లోపు ఉంటే, సేవల టర్నోవర్ రూ.20 లక్షల్లోపు ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. -
ఫిబ్రవరిలో ‘సేవలు’ సూపర్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఫిబ్రవరిలో మంచి పనితీరును ప్రదర్శించింది. ఇందుకు సంబంధించి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 55.3గా నమోదయ్యింది. జనవరిలో ఈ సూచీ 52.8 వద్ద ఉంది. డిమాండ్ భారీగా పెరగడం దీనికి కారణమని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా తెలిపారు. అయితే ఉపాధి కల్పన విషయంలో మాత్రం ఈ రంగం ఇంకా వెనుకబడే ఉండడం గమనార్హం. నిజానికి సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 50 పైన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సూచీ వృద్ధి బాటన కొనసాగడం ఇది వరుసగా ఐదవ నెల. కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో మార్చి నుంచి సెప్టెంబర్ వరకూ సేవల సూచీ క్షీణతలోనే ఉన్న సంగతి తెలిసిందే. తరువాత సూచీ మెరుగుపడినా, ఉపాధి అవకాశాల్లో మాత్రం అంతగా పురోగతి కనిపించడం లేదు. సేవలు–తయారీ ఇండెక్స్ కూడా ఓకే సేవలు, తయారీ కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుడ్ ఇండెక్స్ కూడా జనవరిలో పురోగతి బాటనే నడిచింది. జనవరిలో 55.8గా ఉన్న కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుడ్ ఇండెక్స్, ఫిబ్రవరిలో 57.3 వద్దకు ఎగసింది. ‘‘సేవలు–తయారీ రంగాలు రెండూ కలిపి చూస్తే, ఇండియన్ ఎకానమీ మరింత పునరుత్తేజం అవుతోంది. ప్రైవేటు రంగంలో ఉత్పత్తి, క్తొత ఆర్డర్లు పెరిగాయి’’ అని డీ లిమా పేర్కొన్నారు. కాగా, ఒక్క తయారీ రంగాన్ని చూస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఫిబ్రవరిలో కొంత మందగించింది. జనవరిలో ఇండెక్స్ 57.7 వద్ద ఉంటే, ఫిబ్రవరిలో 57.5కు తగ్గింది. అయితే తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా ఏడవ నెల. వరుసగా 36 నెలలు సూచీ 50 పైన వృద్ధి ధోరణిలోనే కొనసాగిన తయారీ, కరోనా కఠిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో 50 పాయింట్ల దిగువకు క్షీణతలోకి జారిపోయింది. తిరిగి ఆగస్టులోనే వృద్ధి బాటకు వచ్చింది. ఉపాధి కల్పనలో మాత్రం అటు తయారీ ఇటు సేవల రంగాలు రెండూ వెనుకబడే ఉన్నాయి. -
డిసెంబర్లో నెమ్మదించిన ‘సేవలు’
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం డిసెంబర్లో మందగించింది. ఇందుకు సంబంధించి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 52.3గా నమోదయ్యింది. నవంబర్‌లో ఈ సూచీ 53.7 వద్ద ఉంది. అమ్మకాల్లో వృద్ధి మందగించడం దీనికి ప్రధానకారణమని ఆర్థిక సమాచార సేవల దిగ్గజ సంస్థ ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీనా డీ లిమా పేర్కొన్నారు. నిజానికి బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ప్రాతిపదికన డిసెంబర్ వరకూ వరుసగా మూడవనెల బిజినెస్ యాక్టివిటీ సూచీ వృద్ధి ధోరణిలోనే ఉంది. బలహీన వ్యాపార ఆశావాద పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్లో ఉపాధి కల్పన తగ్గిందని, అమ్మకాలు మూడు నెలల కనిష్టానికి పడ్డాయనీ పోలీనా డీ లిమా వివరించారు. బ్రిటన్ కొత్త స్ట్రెయిన్, దీనితో తిరిగి గ్లోబల్ కోవిడ్–19 ప్రయాణపు ఆంక్షలు, డిమాండ్ పరిస్థితులపై ఆయా అంశాల ప్రతికూల ప్రభావం, 2020 చివరిలో భారత్ సేవల రంగాన్ని నెమ్మదింపజేసి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సేవలు, తయారీ రెండూ కలిపినా తగ్గుదలే! కాగా సేవలు, తయారీ రెండు రంగాలూ కలిపిన కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా నవంబర్‌తో పోల్చితే డిసెంబర్లో 56.3 నుంచి 54.9కి పడిపోయింది. ‘‘అయితే 2021లో ఉత్పత్తి పెరుగుతుందన్న ఆశావహ అంచనాలను కంపెనీలు కొనసాగిస్తున్నాయి. అయితే 2021 తొలి కాలంలో సవాళ్లు కొనసాగుతాయి. అయితే అటు తర్వాత సుస్థిర రికవరీ కొనసాగుతుంది. కోవిడ్–19 లభ్యత ఒకసారి ప్రారంభమైన తర్వాత మరింతగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయి’’ అని పోలీనా డీ లిమా పేర్కొన్నారు. -
తెలంగాణ తకరారుతో దిగజారిన ఇండియా స్థానం
'డూయింగ్ బిజినెస్ 2014' పేరిట వరల్డ్ బ్యాంకు రూపొందించిన దేశాల బిజినెస్ ఇండెక్స్ జాబితాలో భారత్ 134వ స్థానానికి జారిపోయింది. గత ఏడాది 131వ స్థానంలో ఉన్న ఇండియా మరో 3 స్థానాలు జారిపోవడానికి అనేక కారణాలలో తెలంగాణా అంశం కూడా ఒకటని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పొరుగున ఉన్న చిన్న దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే ఇండియా వెనకపడిపోవడం, సువిశాలమైన భారత ఉపఖండం వ్యాపారానికి ప్రతికూలం అన్న అభిప్రాయం అంతర్జాతీయంగా బలపడటం మరింత ఆందోళనకరమైన అంశాలు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన తర్వాత తెలంగాణ అంశం తిరిగి పేట్రేగి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడింది. రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోయాయి. అంతర్జాతీయంగా హైద్రాబాదుకి ఉన్న బ్రాండ్ నేమ్ మసకబారడం ప్రారంభించింది. బిబిసి, రాయిటర్స్, ఎ.ఎఫ్.పి, ఐ.ఎ.ఎన్.ఎస్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్ధలతో పాటు వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్, ది గార్డియన్ లాంటి వార్తా పత్రికలు కూడా తెలంగాణ అంశం వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీసిన వైనం మీద కథనాలు ప్రచురించడం ప్రపంచ వ్యాపార వాణిజ్య సంస్ధలను ఆందోళనకు గురిచేసిందనే చెప్పాలి. తెలంగాణా అంశం కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అది దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసింది, దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం చేస్తున్న డిమాండ్లకి మళ్లీ ప్రాణం పోసింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది. కాబట్టి, దేశంలోని వ్యాపార వాతావరణాన్ని ప్రభావితం చేసిన ముఖ్యాంశాలలో ఒకటిగా నిలిచింది. రూపాయి విలువ పతనం వల్ల ఇన్పుట్ వ్యయం పెరగడం, డిమాండ్ బలహీనంగా ఉండడం, రుణాలు ఒక పట్టాన దొరక్కపోవడం, అధిక వడ్డీరేట్లు.... ఫలితంగా వృద్ధి ప్రభావితం కావడం వంటి అంశాలకు ఒక రాజకీయ, సామాజిక కారణంగా కూడా తెలంగాణ అంశం జోడయ్యింది. ఇక దేశంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లే అవినీతి, లంచగొండితనం, లెక్కకు తేలని కుంభకోణాలు ఇండియా పతనానికి మరింత మూలమయ్యాయి. భారత కార్పొరేట్లలో వ్యాపారం మీద విశ్వాసం క్షీణించి, ఇటీవల బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 49 పాయింట్లకు పడిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ నిరాశావహమైన బిజినెస్ వాతావరణం వల్ల, 189 దేశాల 'డూయింగ్ బిజినెస్ 2014' జాబితాలో మనం 134 స్థానానికి దిగజారవలసి వచ్చింది.