తెలంగాణ తకరారుతో దిగజారిన ఇండియా స్థానం
'డూయింగ్ బిజినెస్ 2014' పేరిట వరల్డ్ బ్యాంకు రూపొందించిన దేశాల బిజినెస్ ఇండెక్స్ జాబితాలో భారత్ 134వ స్థానానికి జారిపోయింది. గత ఏడాది 131వ స్థానంలో ఉన్న ఇండియా మరో 3 స్థానాలు జారిపోవడానికి అనేక కారణాలలో తెలంగాణా అంశం కూడా ఒకటని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పొరుగున ఉన్న చిన్న దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే ఇండియా వెనకపడిపోవడం, సువిశాలమైన భారత ఉపఖండం వ్యాపారానికి ప్రతికూలం అన్న అభిప్రాయం అంతర్జాతీయంగా బలపడటం మరింత ఆందోళనకరమైన అంశాలు.
నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన తర్వాత తెలంగాణ అంశం తిరిగి పేట్రేగి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడింది. రాష్ట్రానికి రావలసిన పెట్టుబడులు వెనక్కి పోయాయి. అంతర్జాతీయంగా హైద్రాబాదుకి ఉన్న బ్రాండ్ నేమ్ మసకబారడం ప్రారంభించింది. బిబిసి, రాయిటర్స్, ఎ.ఎఫ్.పి, ఐ.ఎ.ఎన్.ఎస్ వంటి అంతర్జాతీయ వార్తా సంస్ధలతో పాటు వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్, ది గార్డియన్ లాంటి వార్తా పత్రికలు కూడా తెలంగాణ అంశం వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీసిన వైనం మీద కథనాలు ప్రచురించడం ప్రపంచ వ్యాపార వాణిజ్య సంస్ధలను ఆందోళనకు గురిచేసిందనే చెప్పాలి. తెలంగాణా అంశం కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అది దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసింది, దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం చేస్తున్న డిమాండ్లకి మళ్లీ ప్రాణం పోసింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చింది. కాబట్టి, దేశంలోని వ్యాపార వాతావరణాన్ని ప్రభావితం చేసిన ముఖ్యాంశాలలో ఒకటిగా నిలిచింది.
రూపాయి విలువ పతనం వల్ల ఇన్‌పుట్ వ్యయం పెరగడం, డిమాండ్ బలహీనంగా ఉండడం, రుణాలు ఒక పట్టాన దొరక్కపోవడం, అధిక వడ్డీరేట్లు.... ఫలితంగా వృద్ధి ప్రభావితం కావడం వంటి అంశాలకు ఒక రాజకీయ, సామాజిక కారణంగా కూడా తెలంగాణ అంశం జోడయ్యింది. ఇక దేశంలో మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లే అవినీతి, లంచగొండితనం, లెక్కకు తేలని కుంభకోణాలు ఇండియా పతనానికి మరింత మూలమయ్యాయి. భారత కార్పొరేట్లలో వ్యాపారం మీద విశ్వాసం క్షీణించి, ఇటీవల బిజినెస్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 49 పాయింట్లకు పడిపోయిందని వార్తలు వచ్చాయి. ఆ నిరాశావహమైన బిజినెస్ వాతావరణం వల్ల, 189 దేశాల 'డూయింగ్ బిజినెస్ 2014' జాబితాలో మనం 134 స్థానానికి దిగజారవలసి వచ్చింది.