న్యూఢిల్లీ: జీఎస్‌టీ వ్యవస్థ పరిధిలోకి రాని వ్యాపార సంస్థలను, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో వ్యాపారానికి అనుమతించడం అన్నది వాటికి మేలు చేస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఈ కామర్స్ రూపంలో చిన్న సంస్థలు సైతం ప్రయోజనం పొందొచ్చన్నారు.
ప్రభుత్వం రూపొందిస్తున్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్‌డీసీ) ప్లాట్‌ఫామ్ విజయవంతం అయ్యేందుకు జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం కీలకమైనదిగా అభివర్ణించారు. ఇది చిన్న రిటైలర్లను కూడా ఈ కామర్స్ పరిధిలోకి తీసుకొస్తుందన్నారు. చిన్న సంస్థలకు సైతం ఈ కామర్స్ అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఓఎన్‌డీసీ ఏర్పాటును ప్రతిపాదించడం గమనార్హం.
ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. కట్, పాలిష్డ్ వజ్రాలపై జీఎస్‌టీ రేట్ల క్రమద్ధీకరణ నిర్ణయం ఆ రంగం వృద్ధిని ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కామర్స్ పోర్టళ్ల ద్వారా ఒక రాష్ట్రం పరిధిలో సరఫరా చేసే సంస్థలకు వెసులుబాటు కల్పిస్తూ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో వస్తు విక్రయాల టర్నోవర్ రూ.40 లక్షల్లోపు ఉంటే, సేవల టర్నోవర్ రూ.20 లక్షల్లోపు ఉంటే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment