business operations
-
కొత్త ఏడాదిలో..కొత్త ఉత్సాహంతో..మళ్లీ రెలిగేర్ ఫిన్వెస్ట్ షురూ!
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే అవకాశమున్నట్లు రుణ సంక్షోభంలో చిక్కుకున్న రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్(ఆర్ఎఫ్ఎల్) భావిస్తోంది. రూ. 2,300 కోట్ల వన్‌టైమ్ సెటిల్మెంట్(ఓటీఎస్) ప్రతిపాదనకు రుణదాతలలో అత్యధిక శాతం సానుకూలంగా స్పందించడం ఇందుకు సహకరించనున్నట్లు అభిప్రాయపడుతోంది. ఓటీఎస్ ప్రక్రియ పూర్తయితే ఆర్ఎఫ్ఎల్ దిద్దుబాటు చర్యల ప్రణాళిక(సీఏపీ) నుంచి బయటపడే వీలుంది. కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించిన నేపథ్యంలో ఆర్బీఐ 2018 జనవరిలో సీఏపీకి తెరతీసిన సంగతి తెలిసిందే. ఓటీఎస్ ఒప్పందంపై 16 రుణదాత సంస్థలలో 14 సంస్థలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోగా మిగిలిన రెండు సంస్థలు సైతం అంగీకరించే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఎన్బీఎఫ్సీ ఆర్ఎఫ్ఎల్.. ఎస్బీఐ అధ్యక్షతన ఏర్పాటైన రుణదాతల కన్సార్షియంకు రూ. 5,300 కోట్లు బకాయి పడింది. ప్రతిపాదిత ఓటీఎస్ ప్రకారం 2022 జూన్‌లో కంపెనీ సెక్యూరిటీగా రూ. 220 కోట్లు డిపాజిట్ చేసింది. ఈ బాటలో ఓటీఎస్ సొమ్ము చెల్లించేందుకు కంపెనీ సంసిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి 2023లో కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. -
చైనాకు గూగుల్ జబర్ధస్త్ షాక్!
ప్రపంచ నెంబర్ వన్ సర్చ్ ఇంజన్ గూగుల్ తన కార్యకలాపాలను గత రాత్రి నుంచి అర్ధాంతరంగా చైనాలో ఆపివేసింది. ఇటీవల కాలంలో హ్యాకర్ల దాడులు ఎక్కువ కావడం, అనేక నిబంధనలు వ్యాపార లావాదేవిలకు అడ్డుగా మారడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనా నుంచి హాంకాంగ్ కు తమ కార్యాలయాన్ని గూగుల్ బదిలీ చేసింది. ఈ పరిణామంపై చైనా ప్రభుత్వం గూగుల్ పై నిప్పులు చెరుగుతోంది. గూగుల్ సర్చ్ ఇంజిన్ పై సెన్సార్ విధించడం, కొన్ని సెన్సిటివ్ సర్చ్ ఆపరేషన్స్ ను ప్రభుత్వం ఫిల్టర్ చేయడం లాంటి అంశాలు గూగుల్ కు ఇబ్బందిగా మారాయి. దాంతో చైనా నుంచి తమ కార్యకలాపాలను హాంకాంగ్ బదిలీ చేయాలని తీసుకున్న నిర్ణయం సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీని షాక్ గురి చేసింది. ఈ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజీంగ్ హెడ్ క్వార్టర్స్ లోని కార్యాలయం ఎదుట మద్దతుదారులు ఫ్లవర్ బోకేలు, చాకోలెట్, ఇతర బహుమతులతో నిరసన తెలిపారు. 400 మిలియన్ల యూజర్లు ఉన్న చైనా గూగుల్ కు అతిపెద్ద బిజినెస్ మార్కెట్ గా ఉంది. అయితే అధికారులు చైనా సర్చ్ సర్వీస్ లపై ఆంక్షలు విధించడం, నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో గూగుల్ ఈ విధంగా షాకిచ్చినట్టు తెలుస్తోంది. -
భారత్‌లో హెచ్ఎస్బీసీ ఒమన్ బిజినెస్ దోహా బ్యాంక్ పరం!
దుబాయ్: భారత్‌లో హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఒమన్ వ్యాపారాన్ని దోహా బ్యాంక్ సొంతం చేసుకోనుంది. దోహా బ్యాంక్ ఖతార్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఒమన్ రుణాల (ఆస్తుల) విలువ 2013 డిసెంబరు 31 నాటికి దాదాపు రూ.350 కోట్లు. భారత్‌లో హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఒమన్ రెండు బ్రాంచీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. డీల్ వ్యవహారాన్ని దోహా బ్యాంక్ చైర్మన్ షేక్ ఫహాద్ బిన్ మహ్మద్ బిన్ జబార్ అల్ థానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రకటన ప్రకారం, హెచ్ఎస్బీసీ బ్యాంక్ ఒమన్ సిబ్బంది మొత్తం ఇకపై దోహా బ్యాంక్ ఉద్యోగులుగా మారతారు. హెచ్ఎస్బీసీ (బ్యాంక్) ఒమన్‌లో దాదాపు 51 శాతం పరోక్ష వాటా కలిగిఉన్న హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ కూడా ఈ లావాదేవీని ధృవీకరించింది. కాగా ఈ లావాదేవీకి భారత్, ఖతార్, ఒమన్ రెగ్యులేటరీ అధికారుల ఆమోదముద్రలు పడాల్సి ఉంది.