31న పీఎస్ఎల్వీ–సీ39 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెల 31న పీఎస్ఎల్వీ–సీ39 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నద్ధమవుతున్నారు. దీని ద్వారా ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్) ఉప గ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 15లోపు బెంగళూరు నుంచి ఉపగ్రహం షార్కి వచ్చే అవకాశముంది.
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారత్‌కు దిక్సూ చి వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు 7 ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్లను రోదసీలోకి పంపగా, అందులో ఒకటి సేవలను అందించడం మానేసింది. దానిస్థానంలో ఈ నెల 31న మరో ఉపగ్రహన్ని పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అద్భుతంగా పనిచేస్తున్న ఆస్ట్రోశాట్: విశ్వంలోని మూలాలను శోధించేందుకు 2015 సెప్టెంబర్ 28న ప్రయోగించిన 1,513 కిలోల ఆస్ట్రోశాట్ అద్భుతంగా పనిచేస్తోందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) గురువారం ప్రకటించింది.
ఇది ఖగోళంలో 360 రకాల పదార్థాలను పరిశోధించి సమాచారాన్ని అందించింది. ఖగోళ పరిశోధనకు ఇస్రో చేసిన తొలి ప్రయోగం ఇదే కావడం విశేషం. 1996లో అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ విశ్వంలోని గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక, వాటికి అవతల ఉన్న స్థితిగతులను తెలుసుకోవడానికి ఓ ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రతిపాదించారు.
దాన్ని 2015లో అమలు చేశారు. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి, నక్షత్రాల ఆవిర్భావం, న్యూట్రాన్ స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాలు, గెలాక్సీ అవతలి పరిస్థితుల అధ్యయనానికి ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన 5 రకాల ఉపకరణాలు ఖగోళంలోని స్థితిగతులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నాయి.