చెక్‌పోస్టుల్లో నిఘా పెంచండి
నెలవారీగా మార్కెట్ ఫీజు వసూలు చేయాలి
రాయలసీమ మార్కెట్ యార్డు కార్యదర్శులకు ఆర్జేడీ ఆదేశం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: వ్యవసాయ మార్కెట్‌యార్డుల చెక్‌పోస్టు ల్లో మరింత నిఘా పెంచి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలని మార్కెటింగ్ శాఖ రాయల సీమ ఆర్జేడీ సి.రామాంజినేయులు ఆదేశించారు. నిర్దేశించిన మార్కెట్ ఫీజును నెలవారీగా వసూ లు చేయాలన్నారు. ఇందులో నిర్లక్ష్యం వహిం చినా అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులోని డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సమావేశ మందిరంలో శుక్రవారం రాయలసీమ జిల్లాల పరిధిలో ఉన్న 56 మార్కెట్ యార్డుల కార్యదర్శులు, సూపర్వైజర్లు, ఇంజినీర్లతో సమీ క్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్జేడీతో పాటు డెప్యూటీ డెరైక్టర్ రాజశేఖర్‌రెడ్డి, అనంతపురం ఏడీ బి.శ్రీకాంత్‌రెడ్డి, కర్నూలు ఏడీ ఉపేంద్ర, వైఎస్సార్ కడప ఏడీ పీఏ.చౌదరి, చిత్తూరు ఏడీ గోపి, అనంత మార్కెట్‌యార్డు కార్యదర్శి వై.రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
2013-14లో లక్ష్యాలు-సాధించిన ప్రగతిపై సమీక్షించా రు. రీజియన్ పరిధిలో రూ.70.73 కోట్లు లక్ష్యం కాగా రూ.70.68 కోట్లు సాధించడంతో ఆర్జేడీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితాలు నిరాశాజనకం గా ఉన్న యార్డులు ఈ ఏడాది గట్టిగా పనిచేయాలని ఆదేశించారు. గత ఏడాది అనంతపురం జి ల్లాలో 13 యార్డుల ద్వారా రూ.12.11 కోట్లకు గాను 81 శాతంతో రూ.9.77 కోట్లు, కర్నూలు జిల్లాలో 12 యార్డుల ద్వారా రూ.31.61 కోట్లకు గాను 110 శాతంతో 34.91 కోట్లు, వైఎస్సార్ కడప జిల్లాలో 12 యార్డుల ద్వారా రూ.10.72 కోట్ల కు గాను 101 శాతంతో రూ.10.78 కోట్లు, చిత్తూ రు జిల్లాలో 19 యార్డుల ద్వారా రూ.15.29 కోట్లకు గాను 98 శాతంతో రూ.15.22 కోట్ల ఆదాయం గడించినట్టు తెలిపారు. సమైక్యాంధ్ర సమ్మె, వర్షాభావ పరిస్థితులతో అనంతపురం జి ల్లా లక్ష్య సాధనలో వెనుకబడినట్టు పేర్కొన్నారు.
ఈ ఏడాది రూ.78.29 కోట్లు లక్ష్యం
ప్రస్తుత 2014-15లో నాలుగు జిల్లాల నుంచి రూ.78.29 కోట్లు ఆదాయ వనరులు సాధించాల ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆర్జేడీ సి.రామాంజినేయులు తెలిపారు. ఇందులో అనంతపురం జిల్లా కు రూ.12.21 కోట్లు, కర్నూలు జిల్లాకు రూ. 35.85 కోట్లు, వైఎస్సార్ కడప జిల్లాకు రూ. 11.52 కోట్లు, చిత్తూరు జిల్లాకు రూ.18.70 కోట్లు లక్ష్య నిర్దేశనం చేశామన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో 118 వ్యవసాయ చెక్పోస్టులున్నట్టు తెలిపారు. సిబ్బందిని పెంచి, నిఘా ఏర్పాటు చేసి ఆశించిన ఆదాయ వనరులు సమీకరించాల ని ఆదేశించారు. రైతులు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా యార్డుల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు.
16 మార్కెట్‌యార్డులకు ప్రశంసాపత్రాలు...
గత ఏడాది (2013-14) వంద శాతానికి పైగా లక్ష్యాలు సాధించిన 16 మార్కెట్ యార్డులకు ఆర్జేడీ రామాంజినేయులు ప్రశంసాపత్రాలు అం దజేశారు. అనంతపురం జిల్లాలో గుంతకల్లు, తాడిపత్రి, కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, బనగానపల్లె, వైఎస్సార్ కడప జిల్లాలో ప్రొద్దుటూరు, రైల్వేకోడూరు, కమలాపురం, చిత్తూరు జిల్లాలో చిత్తూరు, వాయల్పాడు, పలమనేరు, తిరుపతి, రొంపిచెర్ల మార్కెట్‌యార్డు కార్యదర్శులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.