గోధుమ ‘మద్దతు’ పెంపు
క్వింటాల్‌కు 50 పెరిగిన ధర
న్యూఢిల్లీ: గోధుమల కనీస మద్దతు ధర స్వల్పంగా పెరిగింది. గోధుమల మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 50 పెంచుతూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో మద్దతు ధర రూ. 1,450లకు చేరుకుంటుందని, రబీసీజన్ సాగులో రైతులకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల సలహా సంఘం (సీఏసీపీ) సిఫార్సులమేరకు రబీ సీజన్లో పంటల మద్దతు ధ రను రూ. 50నుంచి రూ. 125ల వరకూ హెచ్చిస్తూ, సీసీఈఏ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటన పేర్కొంది. రబీ సీజన్‌కు సంబంధించి బార్లీ, పప్పులు, ఆవాలు వంటి పంటల మద్దతు ధరను పెంచారు.
పప్పుల మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 125 పెరిగి రూ. 3,075కు చేరింది. ఆవాలు, సన్‌ఫ్లవర్ గింజల మద్దతు ధర రూ. 50ల చొప్పున పెరిగింది. ఆవాల మద్దతు ధర క్వింటాల్ రూ. 3,175కు, సన్‌ఫ్లవర్ ధర క్వింటాల్ రూ. 3,050కి చేరింది. బార్లీ కనీస వుద్దతు ధర రూ. 50 పెరిగి, క్వింటాల్ మద్దతు ధర రూ. 1,150కి చేరింది.వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో పరిశోధనలో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు సంబంధించి విదేశాలతో ఓ ఒప్పందాన్ని చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.