Caketarians
-
అర్ధరాత్రి స్వతంత్రం
తల్లిని అంటిపెట్టుకుని ఉండే పిల్లలు పనుల్ని తెమలనివ్వరు. తల్లి అంటిపెట్టుకుని ఉండాల్సిన పిల్లలు పనుల్ని అసలు మొదలే పెట్టనివ్వరు. అందుకే ఈ తల్లులంతా.. అర్ధరాత్రి వెలిగే కిచెన్లు అయ్యారు. పిల్లలు నిద్రపోయే వరకు ఉండి.. కేకుల బేకింగ్ పనిలోకి దిగుతున్నారు. కోర్సు చేసింది.. ఆర్థిక స్వాతంత్య్రం కోసం. కళ్లు మూతలు పడుతున్నా మేల్కొని ఉంటోంది అర్ధరాత్రి స్వతంత్రం కోసం. ఒక బ్యాచ్ పూర్తయింది. రెండో బ్యాచ్‌కి లాక్డౌన్ అడ్డుపడింది. ‘క్రాఫ్ట్ బేకింగ్’కోర్సు అది. పూర్తయిన బ్యాచ్‌లోని మహిళలంతా రుచిగా కేకులు తయారు చేయడంలో సిద్ధహస్తులై ఉన్నారు. ‘వైట్ వాంచో’, ‘బార్బీ’ కేకులను చేస్తే వాళ్లు చెయ్యాల్సిందే. అంత రుచిగా వచ్చాయి కోర్సు ట్రైనింగ్‌లో. ఆ రెండు కేక్స్‌కి మంచి మార్కెట్ ఉంది. బయట మార్కెట్లే లేవు! చేసి చుట్టుపక్కల అమ్మేస్తున్నారు. అందరికీ నచ్చుతున్నాయి. ‘ఆంటీ.. మళ్లీ చేస్తారా?’ పిల్లలొచ్చి అడుగుతున్నారు. నేర్చుకున్న విద్య వృధాగా పోలేదు. లాక్‌డౌన్‌ని ఎత్తేస్తే వీళ్ల కుటీర కేక్ పరిశ్రమకు పెద్ద పెద్ద బేకరీలు బెంబేలెత్తి పోవాల్సిందే. ఇక్కడి వరకు చెప్పుకుని ఆపేస్తే ఇది స్వయం ఉపాధి కథ మాత్రమే అవుతుంది. క్రాఫ్ట్ బేకింగ్ కోర్సు ఫస్ట్ బ్యాచ్‌లోని 35 మంది మహిళలూ తల్లులే. వీరిలో 30 మంది ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ పిల్లలున్న తల్లులు. అరె! అలా ఎలా కుదిరింది. కుదర్లేదు. ఎంపిక చేసుకున్నారు. కోళికోడ్ నేషనల్ ట్రస్ట్, కోళికోడ్ పరివార్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలున్న తల్లుల సంఘం.. మూడూ కలిసి ట్రైనింగ్ ఇచ్చిన మాతృమూర్తులు వీరంతా. కేరళ ప్రభుత్వ పథకం ఎ.ఎస్.ఎ.పి. (అడిషనల్ స్కిల్ అక్విజిషన్ ప్రోగ్రామ్) కింద ఉన్న ఉపాధి కోర్సులలో ‘క్రాఫ్ట్ బేకింగ్’ కూడా ఒకటి. కోర్సు చేసిన వాళ్లంతా కోళికోడ్‌లోని దగ్గరి దగ్గరి ప్రాంతాల నుంచి వచ్చినవారే. కోర్సు అయిపోగానే ఇంటికి వచ్చి సోలియా బైజు అనే మహిళ చేసిన మొదటి పని.. వెనీలా, చాక్లెట్, స్ట్రా బెర్రీ కేకులను తయారు చేయడం. ఎలా వస్తాయో చూద్దాం అని చేసింది. ‘ఇంత బాగా ఎలా వచ్చాయి’ అనే ప్రశంసలు వచ్చాయి. కొడెంచెరీ, కొడువల్లి ప్రాంతాల్లో సోలియా కేకుల్ని తిన్నవారు.. ‘కొత్త బేకరీ పడిందా?’ అనుకున్నారు. అయితే సోనియా వాటిని రాత్రంతా మేల్కొనే ఉండి తెల్లవారు జామున చేస్తోందని వారికి తెలిసే అవకాశం లేదు. నిజానికి అప్పుడు మాత్రమే ఆమెకు కుదురుతుంది. తన నాలుగేళ్ల కొడుకును వదిలి పనిలో పడటానికి ఆమెకు దొరికే సమయం అది. ఆ చిన్నారికి నరాల బలహీనత. ఏ అర్ధరాత్రి తర్వాతో కాని నిద్రపోడు. అప్పటివరకు తల్లి తన పక్కన ఉండాల్సిందే. నజీబత్ సలీమ్, షైజాలది కూడా సోలియా పరిస్థితే. నిద్రకు ఆగలేగ రెప్పపడుతున్నా.. పిల్లల కంటికి అనుక్షణం రెప్పల్లా ఉండాలి. నజీబత్ చెంబుకడవులో, షైజా ఉన్నికుళంలో ఉంటారు. పిల్లలు పడుకున్నాక అర్ధరాత్రి కేకుల తయారీ మొదలుపెడతారు. సోలియాకు అప్పుడే కొంత డబ్బును వెనకేయడానికి వీలవుతోంది. ఆమె బిడ్డకు తరచు డైపర్స్ మారుస్తుండాలి. భర్తను డబ్బులు అడగవలసి వచ్చేది. ఇప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టనవసరం లేకపోవడం ఆమెకు సంతోషాన్నిస్తోంది. రోజుకు ఇరవై కేకులు చేసి అమ్మగలుగుతోంది. నజీబత్‌కు పద్నాలుగేళ్ల కూతురు ఉంది. అది తల్లికి సహాయం చేసే వయసే కానీ, మానసికంగా తనింకా పసిపాపే. ఎనభైశాతం ‘మెంటల్లీ ఛాలెంజ్డ్’. ఆ పాప నిద్రపోయాకే నజీబత్‌కు పని మొదలుపెట్టడం సాధ్యమౌతుంది. అయితే ఎప్పుడు నిద్రపోతుందో చెప్పలేం. అప్పటి వరకు ఆమె వేచి చూడవలసిందే. అప్పటికి నజీబత్ కళ్లూ నిద్రకు బరువెక్కుతుంటాయి. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం బలవంతంగా నిద్ర ఆపుకుంటుంది. ఆమె భర్త ఉపాధి కోసం ఆఫ్రికా వెళ్లాడు. షైజా కొడుకు వయసు 22 ఏళ్లు. అతడికి మానసిక వైకల్యంతో పాటు వినికిడి లోపం కూడా ఉంది. అతడు నిద్రపోయాకే కేకుల తయారీకి, కేకులపైన ఐసింగ్కీ వీలవుతుంది షైజాకు. లాక్డౌన్ పూర్తయ్యాక ఫస్ట్ బ్యాచ్‌లోని వాళ్లతో కేకులు తయారు చేయించి మార్కెట్ చేయాలని ఎ.ఎస్.ఎ.పి. జిల్లా కోఆర్డినేటర్ మెర్సీ ప్రియా ఇప్పటికే ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేసి ఉంచారు. నిద్ర మానుకుని మరీ కష్టపడుతున్న ఈ తల్లులకు.. కష్టాన్ని మరిపించేలా ఆ ప్రతిఫలం ఉండబోతోందన్న మాట. బార్బీ కేకు, వైట్ వాంచో కేక్ -
నేడు శాకాహారుల్లో ఎనిమిది రకాలు
సాక్షి, న్యూఢిల్లీ : శాకాహారం అనగానే మనకు గాంధీయిజం, ఆధ్యాత్మికవాదం, యోగా, బ్రాహ్మణవాదం ఎక్కువగా గుర్తొస్తాయి. ఎందుకంటే వీటిని విశ్వసించే వారిలో ఎక్కువ మంది శాకాహారులు ఉండడమే కారణం. భారత్, పాశ్చాత్య దేశాల్లో శాకాహారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శాకాహారం అనే పదం తినే ఆహారానికే పరిమితం కాలేదు. అదొక జీవన శైలి. అందుకోసమే అంతర్జాతీయంగా శాకాహారం కోసం ఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి. శాకాహారంతో నైతిక విలువలు కూడా ముడిపడి ఉన్నాయి. జంతువులను హింసించకపోవడం అన్నదే ఇక్కడ నైతిక విలువలకు ప్రమాణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది శాకాహారులే ఉన్నా. భారతీయుల్లో మాత్రం మాంసం తినేవారే ఎక్కువ. భారత్‌లో తరతరాల నుంచి సంప్రదాయబద్దంగా బ్రాహ్మణుల లాంటి అగ్రకులస్థులు శాకాహారాన్ని పాటిస్తుంటే తక్కువ కులస్థులు మాంసాహారాన్ని తింటున్నారు. అందుకు కారణం వారి వారి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక నేపథ్యమే కారణం. ఒకప్పుడు అగ్ర, నిమ్న కులస్థులు అనే తేడా లేకుండా అందరూ మాంసం తిన్నట్లు శాస్త్రాల్లోనే రుజువులున్నాయి. దేశంలో జీవహింస కూడదంటూ జైన, బౌద్ధ మతస్థులు ముందుగా శాకాహారాలుగా మారారు. ఆ మతాల ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఏడవ శతాబ్దంలో హిందూ సూక్తుల్తో శాకాహారవాదం ప్రారంభమైంది. అంతకంటే ముందే యూరప్‌లో ఆరవ శతాబ్దంలోనే శాకాహారవాదం మొదలైంది. ప్రముఖ గ్రీకు తాత్వికుడు పైథాగరస్ శాకాహారం ప్రాముఖ్యతపై రచనలు చేసి ప్రచారం చేశారు. అందుకనే అప్పట్లో అక్కడి శాకాహారులను పైథాగరియన్లు అని వ్యవహరించారు. 1847లో ఇంగ్లండ్‌లోని రామ్స్గేట్ పట్టణంలో పూర్తిగా శాకాహారులు ఉన్నట్లు బయటపడింది. ఆ తర్వాత 1850లో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కూడా ఓ శాకాహార సొసైటీ వెలుగులోకి వచ్చింది. పాశ్చాత్య దేశాలకన్నా ఎన్నో శతాబ్దాలు ముందుగా భారత్‌లో శాకాహారం ఉద్యమాలు వచ్చాయి. భారత్, పాశ్చాత్య ఉద్యమాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. వేర్వేరు కారణాలతో వేర్వేరు శక్తుల నాయకత్వంలో ఈ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. బ్రిటన్, అమెరికా రెండు దేశాల్లోనూ 19వ శతాబ్దంలో చర్చిల ప్రభావంతో శాకాహారవాదం వచ్చింది. విలువలు, నైతికత, పర్యావరణం, వన్యప్రాణ హక్కులు, ఆహారం–భద్రత అంశాల ప్రాతిపదికగా ఈ శాకాహార ఉద్యమం కొనసాగింది. ఇందుకోసం అక్కడి మనుషుల్లో మార్పు వచ్చింది. మార్పు కోసం వారు శాకాహారాన్ని ఆశ్రయించారు. అప్పుడే అది ఒక ఆహారానికి సంబంధించిన అంశం కాకుండా జీవనశైలిగా మారిపోయింది. అంటే జంతువుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ నైతిక విలువలను కలిగి ఉండడమే వారి జీవనశైలి. భారత్‌లో జైన, బైద్ధ మతాల ఆవిర్భావంతో శాకాహారం ఓ జీవనశైలిగా మారిపోయినప్పటికీ బలమైన కులవ్యవస్థ కారణంగా శాకాహారం, మాంసహారం అనేది ఎక్కువగా కులాలకే పరిమితం అవుతూ వస్తోంది. సమాజంలో తమకు సమాన గౌరవం లభించాలనే ఉద్దేశంతో గతంలో కొన్ని నిమ్న కులాల తరఫున శాకాహార ఉద్యమాలు జరిగాయి. శాకాహారులుగా మారిన దళితులు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు మాత్రం తమ ఆధిపత్యం కోసం వారిని మాంసహారులంటూ దూరంగా ఉంచుతూ వచ్చారు. జంతువుల మాంసం తినడం మానేస్తే జంతు సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు కాదని, వాటి సంతానానికి వదిలేయాల్సిన పాలను మనం సేకరించి పాలు, పెరుగు, వెన్నగా తినడం కూడా మాంసహారం కిందకే వస్తుందన్న కొత్త వాదనలు కూడా పుట్టుకొచ్చాయి. శాకాహారం అంటే గౌరవం పెరగడంతో తాము ఒకరకమైన శాకాహారులమేనంటూ చెప్పుకోవడం మొదలవడంతో జనంలో ప్రస్తుతం ఎనిమిది రకాల శాకాహారులు మొదలయ్యారు. 1. పూర్తి విజిటేరియన్లు (ఏ రూపంలోనూ మాంసాన్ని తీసుకోకపోవడం), 2. ఎగ్‌టేరియన్లు (ఎగ్ తప్ప చికెన్, మాంసం తిననివారు), 3. కేకిటేరియన్లు (ఎగ్‌తో చేసిన కేక్‌ను తినేవారు), 4. గ్రేవిటేరియన్లు ( కూర అంటు తప్ప మాంసం తిననివారు), 5. రిస్ట్రిక్టేరియన్లు (ఇంటి బయట మాంసం తినేవారు), 6. బూజిటేరియన్లు (మద్యం సేవించినప్పుడే మాంసం తినేవాళ్లు), 7. ఫోర్సిటేరియన్లు (మిత్రులు లేదా బంధువుల బలవంతం వల్ల మాంసం తినేవాళ్లు), క్యాలెండర్టేరియన్లు (గురు, శని లాంటి కొన్ని వారాల్లో మాంసం ముట్టనివారు). ఈ మధ్య యువతలో ఫిట్నెస్ పిచ్చి పెరగడంతో వారు బహిరంగంగానో, రహస్యంగానో అత్యధికంగా ప్రొటీన్లు ఉండే మాంసాహారాన్ని ఆశ్రయిస్తున్నారు.