నేడు శాకాహారుల్లో ఎనిమిది రకాలు | Vegetarians Eight Types | Sakshi
Sakshi News home page

నేడు శాకాహారుల్లో ఎనిమిది రకాలు

Published Mon, Apr 9 2018 3:16 PM | Last Updated on Thu, Jul 11 2019 5:38 PM

Vegetarians Eight Types - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : శాకాహారం అనగానే మనకు గాంధీయిజం, ఆధ్యాత్మికవాదం, యోగా, బ్రాహ్మణవాదం ఎక్కువగా గుర్తొస్తాయి. ఎందుకంటే వీటిని విశ్వసించే వారిలో ఎక్కువ మంది శాకాహారులు ఉండడమే కారణం. భారత్‌, పాశ్చాత్య దేశాల్లో శాకాహారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శాకాహారం అనే పదం తినే ఆహారానికే పరిమితం కాలేదు. అదొక జీవన శైలి. అందుకోసమే అంతర్జాతీయంగా శాకాహారం కోసం ఉద్యమాలు జరిగాయి, జరుగుతున్నాయి. శాకాహారంతో నైతిక విలువలు కూడా ముడిపడి ఉన్నాయి. జంతువులను హింసించకపోవడం అన్నదే ఇక్కడ నైతిక విలువలకు ప్రమాణం.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది శాకాహారులే ఉన్నా. భారతీయుల్లో మాత్రం మాంసం తినేవారే ఎక్కువ. భారత్‌లో తరతరాల నుంచి సంప్రదాయబద్దంగా బ్రాహ్మణుల లాంటి అగ్రకులస్థులు శాకాహారాన్ని పాటిస్తుంటే తక్కువ కులస్థులు మాంసాహారాన్ని తింటున్నారు. అందుకు కారణం వారి వారి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక నేపథ్యమే కారణం. ఒకప్పుడు అగ్ర, నిమ్న కులస్థులు అనే తేడా లేకుండా అందరూ మాంసం తిన్నట్లు శాస్త్రాల్లోనే రుజువులున్నాయి. దేశంలో జీవహింస కూడదంటూ జైన, బౌద్ధ మతస్థులు ముందుగా శాకాహారాలుగా మారారు. ఆ మతాల ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఏడవ శతాబ్దంలో హిందూ సూక్తుల్తో శాకాహారవాదం ప్రారంభమైంది.

అంతకంటే ముందే యూరప్‌లో ఆరవ శతాబ్దంలోనే శాకాహారవాదం మొదలైంది. ప్రముఖ గ్రీకు తాత్వికుడు పైథాగరస్‌ శాకాహారం ప్రాముఖ్యతపై రచనలు చేసి ప్రచారం చేశారు. అందుకనే అప్పట్లో అక్కడి శాకాహారులను పైథాగరియన్లు అని వ్యవహరించారు. 1847లో ఇంగ్లండ్‌లోని రామ్స్‌గేట్‌ పట్టణంలో పూర్తిగా శాకాహారులు ఉన్నట్లు బయటపడింది. ఆ తర్వాత 1850లో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో కూడా ఓ శాకాహార సొసైటీ వెలుగులోకి వచ్చింది. పాశ్చాత్య దేశాలకన్నా ఎన్నో శతాబ్దాలు ముందుగా భారత్‌లో శాకాహారం ఉద్యమాలు వచ్చాయి. భారత్, పాశ్చాత్య ఉద్యమాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. వేర్వేరు కారణాలతో వేర్వేరు శక్తుల నాయకత్వంలో ఈ ఉద్యమాలు పుట్టుకొచ్చాయి.

బ్రిటన్, అమెరికా రెండు దేశాల్లోనూ 19వ శతాబ్దంలో చర్చిల ప్రభావంతో శాకాహారవాదం వచ్చింది. విలువలు, నైతికత, పర్యావరణం, వన్యప్రాణ హక్కులు, ఆహారం–భద్రత అంశాల ప్రాతిపదికగా ఈ శాకాహార ఉద్యమం కొనసాగింది. ఇందుకోసం అక్కడి మనుషుల్లో మార్పు వచ్చింది. మార్పు కోసం వారు శాకాహారాన్ని ఆశ్రయించారు. అప్పుడే అది ఒక ఆహారానికి సంబంధించిన అంశం కాకుండా జీవనశైలిగా మారిపోయింది. అంటే జంతువుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ నైతిక విలువలను కలిగి ఉండడమే వారి జీవనశైలి.

భారత్‌లో జైన, బైద్ధ మతాల ఆవిర్భావంతో శాకాహారం ఓ జీవనశైలిగా మారిపోయినప్పటికీ బలమైన కులవ్యవస్థ కారణంగా శాకాహారం, మాంసహారం అనేది ఎక్కువగా కులాలకే పరిమితం అవుతూ వస్తోంది. సమాజంలో తమకు సమాన గౌరవం లభించాలనే ఉద్దేశంతో గతంలో కొన్ని నిమ్న కులాల తరఫున శాకాహార ఉద్యమాలు జరిగాయి. శాకాహారులుగా మారిన దళితులు కూడా ఉన్నారు. బ్రాహ్మణులు మాత్రం తమ ఆధిపత్యం కోసం వారిని మాంసహారులంటూ దూరంగా ఉంచుతూ వచ్చారు. జంతువుల మాంసం తినడం మానేస్తే జంతు సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు కాదని, వాటి సంతానానికి వదిలేయాల్సిన పాలను మనం సేకరించి పాలు, పెరుగు, వెన్నగా తినడం కూడా మాంసహారం కిందకే వస్తుందన్న కొత్త వాదనలు కూడా పుట్టుకొచ్చాయి.

శాకాహారం అంటే గౌరవం పెరగడంతో తాము ఒకరకమైన శాకాహారులమేనంటూ చెప్పుకోవడం మొదలవడంతో జనంలో ప్రస్తుతం ఎనిమిది రకాల శాకాహారులు మొదలయ్యారు. 1. పూర్తి విజిటేరియన్లు (ఏ రూపంలోనూ మాంసాన్ని తీసుకోకపోవడం), 2. ఎగ్‌టేరియన్లు (ఎగ్‌ తప్ప చికెన్, మాంసం తిననివారు), 3. కేకిటేరియన్లు (ఎగ్‌తో చేసిన కేక్‌ను తినేవారు), 4. గ్రేవిటేరియన్లు ( కూర అంటు తప్ప మాంసం తిననివారు), 5. రిస్ట్రిక్టేరియన్లు (ఇంటి బయట మాంసం తినేవారు), 6. బూజిటేరియన్లు (మద్యం సేవించినప్పుడే మాంసం తినేవాళ్లు), 7. ఫోర్సిటేరియన్లు (మిత్రులు లేదా బంధువుల బలవంతం వల్ల మాంసం తినేవాళ్లు), క్యాలెండర్టేరియన్లు (గురు, శని లాంటి కొన్ని వారాల్లో మాంసం ముట్టనివారు). ఈ మధ్య యువతలో ఫిట్‌నెస్‌ పిచ్చి పెరగడంతో వారు బహిరంగంగానో, రహస్యంగానో అత్యధికంగా ప్రొటీన్లు ఉండే మాంసాహారాన్ని ఆశ్రయిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement