టెలికం సేవల నాణ్యతపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: కాల్ డ్రాప్స్ ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో టెల్కోలతో కేంద్ర టెలికం శాఖ బుధవారం భేటీ అయ్యింది. కాల్ డ్రాప్స్, సర్వీసుల్లో నాణ్యత తదితర అంశాలపై చర్చించింది. అలాగే కాల్ నాణ్యతను మెరుగుపర్చడానికి విధానపరంగా తీసుకోతగిన చర్యలపై సమాలోచనలు జరిపింది. దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
టెలికం శాఖ కార్యదర్శి కె రాజారామన్ ఈ సమావేశానికి సారథ్యం వహించగా భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోల ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఇది సాగింది. నిర్దేశిత ప్రమాణాలకు ప్రతిగా ప్రస్తుతం తాము అందిస్తున్న సర్వీసుల నాణ్యత గురించి టెల్కోలు వివరంగా చెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే అక్రమ బూస్టర్లలో సేవలకు అంతరాయం కలుగుతుండటం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిపాయి. సమస్యాత్మక విషయాలను గుర్తించి తమ దృష్టికి తేవాలని, కాల్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు విధానపరంగా తీసుకోతగిన చర్యలపై తగు సూచనలు చేయాలని ఆపరేటర్లను టెలికం శాఖ కోరినట్లు వివరించాయి.