Call Money - sex racket
-
ఉయ్యూరులో మరో కాల్నాగు
ఉయ్యూరు : కాల్ మనీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాల్ నాగుల దందాలకు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు బలైపోయి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పు తీర్చాక కూడా ఖాళీ నోట్లు, చెక్కులు, డాక్యుమెంట్లు ఇవ్వకుండా వేరే వ్యక్తుల పేరుతో లక్షల్లో బాకీ ఉన్నారంటూ కేసులు వేయడంతో దళిత, మైనార్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన బాధితులు ఉయ్యూరులో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన.. పట్టణంలోని రాజేంద్రనగర్, దళితవాడకు చెందిన దాదాపు 90 మంది బాధితులు కాల్‌మనీలో చిక్కుకున్నారు. అల్లిబిల్లి చిన అప్పలనాయుడు అధిక వడ్డీలు వసూలు చేసి తమను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి కోర్టులో కేసులు వేసి ఉన్న ఇళ్లను కూడా లాక్కుంటున్నాడని గంటా జోజెమ్మ, ఓరుగంటి జాష్వా, కన్నెబోయిన వీరమ్మ, నాగమల్లి వెంకటపద్మ, మహ్మద్ హసీనా, బుద్దుల మేరిమ్మ, ఉల్లి జోగేశ్వరరావు, జుజ్జవరపు తిరుమలరావు, అసిలేటి నాగరాజ్యం, కన్నెబోయిన నాగరాజు విజయవాడ నగర పోలీసులకు దళిత దండు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాచేటి రూతుమ్మ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ వడ్డీ వ్యాపారి ఆగడాలు పెచ్చుమీరడంతో బాధితులందరూ ఆదివారం దళిత దండు ఆధ్వర్యంలో ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు అందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. నూటికి రూ.10 వడ్డీ.. తాము తీసుకున్న అప్పుకు నూటికి రూ.10 చొప్పున వడ్డీ వసూలు చేసి ఇంకా పీడించుకుని బెదిరిస్తున్నాడని బాధితులు మీడియా ఎదుట ఆవేదన వెల్లిబుచ్చారు. అప్పు మొత్తం వడ్డీతో సహా చెల్లించినా ఖాళీ నోట్లు, చెక్కులు, ఇతర పత్రాలు ఇవ్వకుండా వేరే వ్యక్తుల పేరుతో కేసులు వేసి ఉన్న ఇళ్లను కూడా లాక్కునేందుకు సిద్ధమవుతున్నాడని ఆవేదన చెందారు. అల్లిబిల్లి చిన్నాను గట్టిగా నిలదీస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడన్నారు. పోలీసులంతా తన చేతుల్లోనే ఉన్నారంటూ, మీకు దిక్కెవరంటూ ఎదురు దాడికి దిగబట్టే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. లక్షకు రూ.4 లక్షలు కట్టా.. నాలుగేళ్ల క్రితం అల్లిబిల్లి చినఅప్పలనాయుడు దగ్గర రూ.లక్ష అప్పు తీసుకున్నా. ఇప్పటి వరకు అసలుతో కలిపి రూ.4 లక్షలు చెల్లించా. మొత్తం రూ.10 వడ్డీనే. అప్పు ఇచ్చేటప్పుడు రెండు ఖాళీ నోట్లు, రెండు ఖాళీ చెక్కులు, మా ఇంటి బీ–ఫార్మ్ పట్టా, రూ.100 స్టాంప్ పేపర్‌ను తీసుకున్నాడు. మొత్తం అప్పు కట్టాక పత్రాలు అడిగా. ఇంకా రూ.1.50 లక్షలు కడితేనే ఇస్తానన్నాడు. అదేమిటని ప్రశ్నిస్తే రూ.8 లక్షలకు కోర్టులో కేసు వేసి అరెస్టు వారెంట్ పంపాడు. ఈ అన్యాయంపై పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. ఇల్లు లాక్కుంటానని బెదిరిస్తున్నాడు. న్యాయం జరగకపోతే భార్యా, పిల్లలతో కలిసి ఆత్మహత్యే శరణ్యం.– నాగుమల్లి వినయ్‌కుమార్ రూ.65 వేలకు రూ.9.50 లక్షలు.. మేము రూ.65 వేలు అప్పు తీసుకున్నాం. మొదట నెలకు నూటికి రూ.10 వడ్డీ అన్నాడు. కాలం గడిచాక వారానికి నూటికి రూ.10 వడ్డీ చొప్పున వసూలు చేశాడు. గట్టిగా మాట్లాడితే ఖాళీ నోట్లు, చెక్కులు, పత్రాలు చూపి బెదిరిస్తున్నాడు. బాధను ఓర్చుకుంటూ రెక్కలు ముక్కలు చేసి కష్టపడి వడ్డీతో కలిపి రూ.65 వేలకు రూ.2.76 లక్షలు కట్టా. ఇంటికి వెళ్లి మా కాగితాలు అడిగా. మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది, వచ్చాక ఇస్తామని చిన్నా భార్య చెప్పింది. ఇంకా రూ.20 వేలు కడితే సరిపోద్దన్నారు. తీరా డబ్బులు తీసుకెళ్తే మొత్తం రూ.9.50 లక్షలు బాకీ ఉందన్నారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయా. షాక్‌ను తట్టుకోకపోవడంతో నన్ను ఆస్పత్రిలో కూడా పెట్టారు. భర్త లేడనే కనికరం కూడా లేకుండా రూ.9.50 లక్షలకు నోటీస్ ఇచ్చాడు. ఇక మాకు చావే కనిపిస్తుంది.– మహ్మద్ హసీనా చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు.. అధిక వడ్డీ బారిన పడిన వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బాధితుడు ఎక్కువ వడ్డీకి తీసుకుని బెదిరింపులకు గురై భయంతో నష్టపోయిన అంశాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకోవచ్చు. గతంలో పోలీసులే కాల్‌మనీ కేసులు నమోదు చేశారు. అధిక వడ్డీ విషయంలో ఐపీసీ 384 నుంచి 389 వరకు ఫిర్యాదును బట్టి కేసులు నమోదు చేసి విచారించే రైట్ పోలీసులకు ఉంది. బాధితుడిని భయపెట్టో, బెదిరించో దౌర్జన్యంగా ఆస్తులు లాక్కున్నప్పుడు ఆ మేరకు ఫిర్యాదు ఇస్తే పోలీసులు ఆ కోణంలో విచారించాల్సిన అవసరం ఉంది. ఆ వ్యాపారి ఇంటికి వెళ్లి అన్ని పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలించి చర్యలు తీసుకోవాలి. గతంలో కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా సెల్ పెట్టి కాల్‌మనీ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా అలా చేసి బాధితులను రక్షించాలి.– టీ చంటిబాబు, న్యాయవాది -
విజయవాడలో సంచలనాలు
► ఈ ఏడాది జనవరి 30న భవానీపురంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు మృతిచెందారు. వన్‌టౌన్‌లోని కేఎల్‌రావునగర్‌లో సిలిండర్ పేలి నలుగురు అశువులుబాశారు. ► ముంబయిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గాచేస్తున్న మచిలీపట్నంకు చెందిన అనూహ్య హత్యాచార ఘటనలో నిందితుడు చంద్రభానుకు అక్టోబర్‌లో ముంబయి కోర్టు ఉరిశిక్ష విధించింది. ► రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు ఆగస్టు 19న తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి 15 రోజులు ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ► జులైలో మాచవరం స్టేషన్ పరిధిలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ► హిమబిందుపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, జులై 28న ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ► సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న సూర్యారావుపేటను హై సెక్యూరిటీ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. అక్కడ ఆగస్టు 1న రెండు గంటల్లో ఆరు దొంగతనాలు జరిగాయి. ► అంతర్రాష్ట దొంగ సాహును విజయవాడ పోలీసులు జూన్ 6న అరెస్ట్ చేశారు. ► విజయవాడ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్ సాయికుమార్‌ను నియమించారు. ► కృష్ణలంక స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృత్యువాత పడిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ► విజయవాడలో బయటపడిన కాల్‌మనీ సెక్స్ రాకెట్ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు పలువురు నేతలకు సంబంధాలు ఉండటం విశేషం. మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన ఒక మహిళా టైలర్ జ్యోత్స్నరెడ్డి తన వ్యాపార అవసరాల కోసం పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద పంటకాలువ రోడ్డులో ఉన్న కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయించింది. రోజువారీ వడ్డీకి వీరు డబ్బులు ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ఆమెను వారు లొంగదీసుకున్నారు. ఆమె సీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేయడంతో కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చాయి. ► విజయవాడ కేంద్రంగా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. -
అసెంబ్లీలో ఆధారాలు చూపినా...
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ర్టంలో కాల్‌మనీ ముసుగులో క్షమించరాని ఘోరమైన నేరాలు జరిగాయి.. మహిళల మానప్రాణాలను హరించిన నేరగాళ్లు కళ్లెదురుగా కనిపిస్తున్నారు. వారి నేరాలకు సజీవ సాక్ష్యాధారాలూ ఉన్నాయి. నిందితులతో సాక్షాత్తూ ప్రభుత్వాధినేత చెట్టపట్టాలేసుకుని కలర్ఫొటోల్లో కనిపిస్తున్నారు. అదే నిందితుడు ఇంటెలిజెన్స్ డీజీ పక్కనే కూర్చుని చర్చలు జరుపుతున్న ఫొటోలూ ఉన్నాయి. నేరగాళ్లతో పెదబాబే కాదు చినబాబు కూడా సీరియస్‌గా చర్చిస్తున్నట్లు ఫొటోలున్నాయి. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ ఉదంతం గురించి, సభలో ప్రతిపక్ష నేత చూపిస్తున్న ఆధారాల గురించి ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంత పెద్ద సమస్యపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ స్పందిస్తున్న తీరు కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. అదేదో సాదాసీదా వడ్డీవ్యాపారం జరుగుతోంటే అనవసరంగా రచ్చ చేస్తున్నారంటూ చాపచుట్టేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుండటం, అనేక అడ్డదారుల్ని ఆశ్రయిస్తుండటం ప్రజలు గమనిస్తున్నారు. పక్కదారి పట్టించే వ్యవహారాలు.. ఐదు రోజుల శీతాకాల అసెంబ్లీలో అపుడే మూడు రోజులు కరిగిపోయాయి. అంబేడ్కర్‌పై చర్చను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ వంటి ముఖ్యమైన సమస్యను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది. కాల్‌మనీ పై ముందు తాను ప్రకటన చేస్తానని, ఆ తర్వాత ప్రతి పక్షం వివరణలు కోరడానికి అవకాశమిస్తామని సభానాయకుడైన సీఎం చంద్రబాబు మొండిగా వ్యవహరించడం ఈ సమావేశాల్లో సంప్రదాయ విరుద్ధంగా కని పించిన ముఖ్యాంశాల్లో ఒకటి. ఏదైనా సమస్యపై సభ్యులు ముందు మాట్లాడితే సభా నాయకుడు ఆ తర్వాత ప్రకటన చేయడం సంప్రదాయం. కానీ ముందే ప్రకటన చేసేస్తే ఆ తర్వాత ఇక చర్చకు అవకాశం ఏముంటుంది? ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పదేపదే ప్రశ్నించినా అధికార పార్టీ తామనుకున్నదే చేసింది. ఆధారాలు పట్టించుకోరా? కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ అంశంపై తనకు లభించిన అతి కొద్ది సమయంలోనే విపక్షనేత పలు ఆధారాలను సభకు సమర్పించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాధినేతకు, అధికారులకు నిందితులు ఎంత సన్నిహితులో తెలిపే పలు ఫొటోలను ఆయన సభలో ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమైన నిందితుడు, పరారీలో ఉన్న సత్యానందం అనే అధికారి సీఎం చంద్రబాబుతోనూ, ఇంటెలి జెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోనూ సన్నిహితంగా కనిపిస్తున్న ఫొటోలను జగన్ సభకు చూపించారు. ఇంటెలిజెన్స్ డీజీతో నిందితుడు తాపీగా కూర్చుని చర్చిస్తున్నాడంటే బాబు ఆశీస్సులు లేకుండానే జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కాల్‌మనీ-సెక్స్ రాకెట్ నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్‌తో కలసి విదేశాలకు వెళ్లిన విషయాన్ని రుజువు చేసే ఫొటోనూ ఆయన ప్రదర్శించారు. అదే ఎమ్మెల్యే విదేశాలనుంచి తిరిగి వచ్చాడని, విదేశాల్లోనే ఉండిపోయిన నిందితుల గురించి ఆ ఎమ్మెల్యేని ఎందుకు ప్రశ్నించడం లేదని జగన్ అధికారపార్టీని నిలదీశారు. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సొంత తమ్ముడు బుద్దా నాగేశ్వరరావు ఈ సెక్స్‌రాకెట్ ఉదంతం లో కీలక నిందితుడుగా ఉన్నాడని, అదే ఎమ్మెల్సీకి సీఎం చంద్రబాబు వెన్నుదన్నుగా ఉన్నారని జగన్ సభకు వివరించారు. కేంద్ర మంత్రులు పాల్గొన్న ఓ బహిరంగ సభలో చంద్రబాబుకు సదరు ఎమ్మెల్సీ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫొటోను కూడా జగన్ సభ ముందుంచారు. సీఎం చంద్రబాబుతోనూ, ఆయన కుమారుడు లోకేశ్‌తోనూ కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ నిందితులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంత సన్నిహితంగా కనిపిస్తున్నా పట్టించుకోరా అని సభను నిలదీశారు. ఓ కీలకమైన కేసులో ప్రధాననిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంటెలిజెన్స్ డీజీ పక్కన అంత సన్నిహితంగా కనిపిస్తారా? అని ప్రశ్నించారు. ఇదేమి అన్యాయం? కాల్‌మనీ -సెక్స్ రాకెట్ కేసులో ప్రభుత్వం నిందితుల పక్షం వహిస్తున్నదనడానికి ఇదో ఉదాహరణ. ఈ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు నాగేశ్వరరావుకు పోలీసులు ఆగమేఘాలపై స్టేషన్ బెయిల్ సమర్పించేశారు. ఆయనపై ఎన్నో ఆధారాలున్నా కావాలని బెయిలిచ్చి పంపేశారంటే ఈ కేసులో ‘పైస్థాయి’ జోక్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు దర్యాప్తు జరుగుతున్న తీరుకు కూడా ఇది అద్దం పడుతోంది. ఒక చిన్న కేసులో అరెస్టయితేనే పోలీసులు ఎన్ని ముప్పతిప్పలు పెడతారో వేరే చెప్పనక్కరలేదు. అలాంటిది రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక ముఖ్యమైన కేసులో ప్రధాననిందితుడి విషయంలో ఇంత ఉదారంగా, ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణాలు ఏమై ఉంటాయి? పెద్ద తలకాయలన్నీ బయటకొస్తాయనా..? తీగలాగితే డొంకంతా బయటపడుతుందనా?