ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట కాల్ మనీ బాధితుల నిరసన
ఉయ్యూరు : కాల్ మనీ బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాల్ నాగుల దందాలకు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు బలైపోయి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పు తీర్చాక కూడా ఖాళీ నోట్లు, చెక్కులు, డాక్యుమెంట్లు ఇవ్వకుండా వేరే వ్యక్తుల పేరుతో లక్షల్లో బాకీ ఉన్నారంటూ కేసులు వేయడంతో దళిత, మైనార్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన బాధితులు ఉయ్యూరులో పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు.
టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన..
పట్టణంలోని రాజేంద్రనగర్, దళితవాడకు చెందిన దాదాపు 90 మంది బాధితులు కాల్‌మనీలో చిక్కుకున్నారు. అల్లిబిల్లి చిన అప్పలనాయుడు అధిక వడ్డీలు వసూలు చేసి తమను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి కోర్టులో కేసులు వేసి ఉన్న ఇళ్లను కూడా లాక్కుంటున్నాడని గంటా జోజెమ్మ, ఓరుగంటి జాష్వా, కన్నెబోయిన వీరమ్మ, నాగమల్లి వెంకటపద్మ, మహ్మద్ హసీనా, బుద్దుల మేరిమ్మ, ఉల్లి జోగేశ్వరరావు, జుజ్జవరపు తిరుమలరావు, అసిలేటి నాగరాజ్యం, కన్నెబోయిన నాగరాజు విజయవాడ నగర పోలీసులకు దళిత దండు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాచేటి రూతుమ్మ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆ వడ్డీ వ్యాపారి ఆగడాలు పెచ్చుమీరడంతో బాధితులందరూ ఆదివారం దళిత దండు ఆధ్వర్యంలో ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు అందించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
నూటికి రూ.10 వడ్డీ..
తాము తీసుకున్న అప్పుకు నూటికి రూ.10 చొప్పున వడ్డీ వసూలు చేసి ఇంకా పీడించుకుని బెదిరిస్తున్నాడని బాధితులు మీడియా ఎదుట ఆవేదన వెల్లిబుచ్చారు. అప్పు మొత్తం వడ్డీతో సహా చెల్లించినా ఖాళీ నోట్లు, చెక్కులు, ఇతర పత్రాలు ఇవ్వకుండా వేరే వ్యక్తుల పేరుతో కేసులు వేసి ఉన్న ఇళ్లను కూడా లాక్కునేందుకు సిద్ధమవుతున్నాడని ఆవేదన చెందారు. అల్లిబిల్లి చిన్నాను గట్టిగా నిలదీస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడన్నారు. పోలీసులంతా తన చేతుల్లోనే ఉన్నారంటూ, మీకు దిక్కెవరంటూ ఎదురు దాడికి దిగబట్టే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.
లక్షకు రూ.4 లక్షలు కట్టా..
నాలుగేళ్ల క్రితం అల్లిబిల్లి చినఅప్పలనాయుడు దగ్గర రూ.లక్ష అప్పు తీసుకున్నా. ఇప్పటి వరకు అసలుతో కలిపి రూ.4 లక్షలు చెల్లించా. మొత్తం రూ.10 వడ్డీనే. అప్పు ఇచ్చేటప్పుడు రెండు ఖాళీ నోట్లు, రెండు ఖాళీ చెక్కులు, మా ఇంటి బీ–ఫార్మ్ పట్టా, రూ.100 స్టాంప్ పేపర్‌ను తీసుకున్నాడు. మొత్తం అప్పు కట్టాక పత్రాలు అడిగా. ఇంకా రూ.1.50 లక్షలు కడితేనే ఇస్తానన్నాడు. అదేమిటని ప్రశ్నిస్తే రూ.8 లక్షలకు కోర్టులో కేసు వేసి అరెస్టు వారెంట్ పంపాడు. ఈ అన్యాయంపై పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదు. ఇల్లు లాక్కుంటానని బెదిరిస్తున్నాడు. న్యాయం జరగకపోతే భార్యా, పిల్లలతో కలిసి ఆత్మహత్యే శరణ్యం.– నాగుమల్లి వినయ్‌కుమార్
రూ.65 వేలకు రూ.9.50 లక్షలు..
మేము రూ.65 వేలు అప్పు తీసుకున్నాం. మొదట నెలకు నూటికి రూ.10 వడ్డీ అన్నాడు. కాలం గడిచాక వారానికి నూటికి రూ.10 వడ్డీ చొప్పున వసూలు చేశాడు. గట్టిగా మాట్లాడితే ఖాళీ నోట్లు, చెక్కులు, పత్రాలు చూపి బెదిరిస్తున్నాడు. బాధను ఓర్చుకుంటూ రెక్కలు ముక్కలు చేసి కష్టపడి వడ్డీతో కలిపి రూ.65 వేలకు రూ.2.76 లక్షలు కట్టా. ఇంటికి వెళ్లి మా కాగితాలు అడిగా. మా ఆయనకు యాక్సిడెంట్ అయ్యింది, వచ్చాక ఇస్తామని చిన్నా భార్య చెప్పింది. ఇంకా రూ.20 వేలు కడితే సరిపోద్దన్నారు. తీరా డబ్బులు తీసుకెళ్తే మొత్తం రూ.9.50 లక్షలు బాకీ ఉందన్నారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయా. షాక్‌ను తట్టుకోకపోవడంతో నన్ను ఆస్పత్రిలో కూడా పెట్టారు. భర్త లేడనే కనికరం కూడా లేకుండా రూ.9.50 లక్షలకు నోటీస్ ఇచ్చాడు. ఇక మాకు చావే కనిపిస్తుంది.– మహ్మద్ హసీనా
చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు..
అధిక వడ్డీ బారిన పడిన వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బాధితుడు ఎక్కువ వడ్డీకి తీసుకుని బెదిరింపులకు గురై భయంతో నష్టపోయిన అంశాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకోవచ్చు. గతంలో పోలీసులే కాల్‌మనీ కేసులు నమోదు చేశారు. అధిక వడ్డీ విషయంలో ఐపీసీ 384 నుంచి 389 వరకు ఫిర్యాదును బట్టి కేసులు నమోదు చేసి విచారించే రైట్ పోలీసులకు ఉంది. బాధితుడిని భయపెట్టో, బెదిరించో దౌర్జన్యంగా ఆస్తులు లాక్కున్నప్పుడు ఆ మేరకు ఫిర్యాదు ఇస్తే పోలీసులు ఆ కోణంలో విచారించాల్సిన అవసరం ఉంది. ఆ వ్యాపారి ఇంటికి వెళ్లి అన్ని పత్రాలు స్వాధీనం చేసుకుని పరిశీలించి చర్యలు తీసుకోవాలి. గతంలో కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా సెల్ పెట్టి కాల్‌మనీ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు కూడా అలా చేసి బాధితులను రక్షించాలి.– టీ చంటిబాబు, న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment