అసెంబ్లీలో ఆధారాలు చూపినా...
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ర్టంలో కాల్‌మనీ ముసుగులో క్షమించరాని ఘోరమైన నేరాలు జరిగాయి.. మహిళల మానప్రాణాలను హరించిన నేరగాళ్లు కళ్లెదురుగా కనిపిస్తున్నారు. వారి నేరాలకు సజీవ సాక్ష్యాధారాలూ ఉన్నాయి. నిందితులతో సాక్షాత్తూ ప్రభుత్వాధినేత చెట్టపట్టాలేసుకుని కలర్‌ఫొటోల్లో కనిపిస్తున్నారు. అదే నిందితుడు ఇంటెలిజెన్స్ డీజీ పక్కనే కూర్చుని చర్చలు జరుపుతున్న ఫొటోలూ ఉన్నాయి. నేరగాళ్లతో పెదబాబే కాదు చినబాబు కూడా సీరియస్‌గా చర్చిస్తున్నట్లు ఫొటోలున్నాయి.
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కాల్‌మనీ - సెక్స్‌రాకెట్ ఉదంతం గురించి, సభలో ప్రతిపక్ష నేత చూపిస్తున్న ఆధారాల గురించి ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంత పెద్ద సమస్యపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ స్పందిస్తున్న తీరు కూడా సర్వత్రా చర్చనీయాంశమైంది. అదేదో సాదాసీదా వడ్డీవ్యాపారం జరుగుతోంటే అనవసరంగా రచ్చ చేస్తున్నారంటూ చాపచుట్టేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తుండటం, అనేక అడ్డదారుల్ని ఆశ్రయిస్తుండటం ప్రజలు గమనిస్తున్నారు.
పక్కదారి పట్టించే వ్యవహారాలు..
ఐదు రోజుల శీతాకాల అసెంబ్లీలో అపుడే మూడు రోజులు కరిగిపోయాయి. అంబేడ్కర్‌పై చర్చను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ వంటి ముఖ్యమైన సమస్యను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది. కాల్‌మనీ పై ముందు తాను ప్రకటన చేస్తానని, ఆ తర్వాత ప్రతి పక్షం వివరణలు కోరడానికి అవకాశమిస్తామని సభానాయకుడైన సీఎం చంద్రబాబు మొండిగా వ్యవహరించడం ఈ సమావేశాల్లో సంప్రదాయ విరుద్ధంగా కని పించిన ముఖ్యాంశాల్లో ఒకటి.
ఏదైనా సమస్యపై సభ్యులు ముందు మాట్లాడితే సభా నాయకుడు ఆ తర్వాత ప్రకటన చేయడం సంప్రదాయం. కానీ ముందే ప్రకటన చేసేస్తే ఆ తర్వాత ఇక చర్చకు అవకాశం ఏముంటుంది? ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే ప్రశ్నించినా అధికార పార్టీ తామనుకున్నదే చేసింది.
ఆధారాలు పట్టించుకోరా?
కాల్‌మనీ-సెక్స్‌రాకెట్ అంశంపై తనకు లభించిన అతి కొద్ది సమయంలోనే విపక్షనేత పలు ఆధారాలను సభకు సమర్పించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాధినేతకు, అధికారులకు నిందితులు ఎంత సన్నిహితులో తెలిపే పలు ఫొటోలను ఆయన సభలో ప్రదర్శించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమైన నిందితుడు, పరారీలో ఉన్న సత్యానందం అనే అధికారి సీఎం చంద్రబాబుతోనూ, ఇంటెలి జెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోనూ సన్నిహితంగా కనిపిస్తున్న ఫొటోలను జగన్ సభకు చూపించారు.
ఇంటెలిజెన్స్ డీజీతో నిందితుడు తాపీగా కూర్చుని చర్చిస్తున్నాడంటే బాబు ఆశీస్సులు లేకుండానే జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కాల్‌మనీ-సెక్స్ రాకెట్ నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్‌తో కలసి విదేశాలకు వెళ్లిన విషయాన్ని రుజువు చేసే ఫొటోనూ ఆయన ప్రదర్శించారు. అదే ఎమ్మెల్యే విదేశాలనుంచి తిరిగి వచ్చాడని, విదేశాల్లోనే ఉండిపోయిన నిందితుల గురించి ఆ ఎమ్మెల్యేని ఎందుకు ప్రశ్నించడం లేదని జగన్ అధికారపార్టీని నిలదీశారు.
అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సొంత తమ్ముడు బుద్దా నాగేశ్వరరావు ఈ సెక్స్‌రాకెట్ ఉదంతం లో కీలక నిందితుడుగా ఉన్నాడని, అదే ఎమ్మెల్సీకి సీఎం చంద్రబాబు వెన్నుదన్నుగా ఉన్నారని జగన్ సభకు వివరించారు. కేంద్ర మంత్రులు పాల్గొన్న ఓ బహిరంగ సభలో చంద్రబాబుకు సదరు ఎమ్మెల్సీ సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫొటోను కూడా జగన్ సభ ముందుంచారు.
సీఎం చంద్రబాబుతోనూ, ఆయన కుమారుడు లోకేశ్‌తోనూ కాల్‌మనీ- సెక్స్‌రాకెట్ నిందితులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంత సన్నిహితంగా కనిపిస్తున్నా పట్టించుకోరా అని సభను నిలదీశారు. ఓ కీలకమైన కేసులో ప్రధాననిందితుడిగా ఉన్న వ్యక్తి ఇంటెలిజెన్స్ డీజీ పక్కన అంత సన్నిహితంగా కనిపిస్తారా? అని ప్రశ్నించారు.
ఇదేమి అన్యాయం?
కాల్‌మనీ -సెక్స్ రాకెట్ కేసులో ప్రభుత్వం నిందితుల పక్షం వహిస్తున్నదనడానికి ఇదో ఉదాహరణ. ఈ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు నాగేశ్వరరావుకు పోలీసులు ఆగమేఘాలపై స్టేషన్ బెయిల్ సమర్పించేశారు. ఆయనపై ఎన్నో ఆధారాలున్నా కావాలని బెయిలిచ్చి పంపేశారంటే ఈ కేసులో ‘పైస్థాయి’ జోక్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు దర్యాప్తు జరుగుతున్న తీరుకు కూడా ఇది అద్దం పడుతోంది. ఒక చిన్న కేసులో అరెస్టయితేనే పోలీసులు ఎన్ని ముప్పతిప్పలు పెడతారో వేరే చెప్పనక్కరలేదు. అలాంటిది రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఒక ముఖ్యమైన కేసులో ప్రధాననిందితుడి విషయంలో ఇంత ఉదారంగా, ఉదాసీనంగా వ్యవహరించడానికి కారణాలు ఏమై ఉంటాయి? పెద్ద తలకాయలన్నీ బయటకొస్తాయనా..? తీగలాగితే డొంకంతా బయటపడుతుందనా?